Plant Man Review : ‘ప్లాంట్ మాన్’ రివ్యూ.. మనిషి శరీరం మీద మొక్కలు పెరిగితే..?

తాజాగా ఓ ఆసక్తికర కథతో, కామెడీ అంశాలతో 'ప్లాంట్ మాన్' అనే సినిమా వచ్చింది.

Plant Man Review : ‘ప్లాంట్ మాన్’ రివ్యూ.. మనిషి శరీరం మీద మొక్కలు పెరిగితే..?

New Interesting Comedy Movie Plant Man Review and Rating

Plant Man Review : ఇటీవల చిన్న సినిమాలు కొత్త కొత్త కథలతో వస్తున్నాయి. అందులో కామెడీ కథలతో వచ్చే సినిమాలు ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర కథతో, కామెడీ అంశాలతో ‘ప్లాంట్ మాన్’ అనే సినిమా వచ్చింది. గతంలో కాలింగ్ బెల్, రాక్షసి సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. కొత్త దర్శకుడు సంతోష్ బాబు దర్శకత్వంలో ప్లాంట్ మాన్ తెరకెక్కింది. ప్లాంట్ మాన్ సినిమా నేడు జనవరి 5న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి హీరోహీరోయిన్స్ గా పరిచయమవ్వగా పలువురు కమెడియన్స్ నటించారు.

కథ విషయానికొస్తే.. చారి(చంద్రశేఖర్) రైతులకు సపోర్ట్ గా ఉండాలని వారు పండించిన ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు అమ్ముతూ ఉంటాడు. చందు(సోనాలి)తో చారి పెళ్లి చూపులకు వస్తాడు. సంబంధం నచ్చడంతో ఈ పెళ్ళికి ఓకే చెప్తారు. అయితే చందు చిన్ననాటి నుంచి ఉన్న స్నేహితుడు చింటూ ఈ పెళ్లిని చెడగొట్టాలని ముందు నుంచి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే చింటూ వాళ్ళ నాన్న ఓ సైంటిస్ట్. బీడు భూములను కూడా సస్యశ్యామలం చేయాలని అక్కడ ఓ ద్రావణం వేయగానే మొక్కలు పుట్టుకువచ్చేలా ఓ ఫార్ములాని తయారుచేస్తాడు. అది మనుషులు తాగకూడదు అని తెలిసిన చింటూ.. చందు – చారి పెళ్లి చెడగొట్టాలని చారికి తెలియకుండా అతనితో ఆ ద్రావణాన్ని తాగిస్తాడు. దీంతో రాత్రికి రాత్రి చారి ఒంటిమీద మొత్తం మొక్కలు పెరుగుతాయి. దీంతో చారి ఏం చేశాడు? చందు – చారి పెళ్లి జరుగుతుందా? ఆ మొక్కలు ఎలా పోతాయి? ఆ సైంటిస్ట్ కి ఈ విషయం తెలిసి ఏం చేశాడు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ప్లాంట్ మాన్ అని టైటిల్ తోనే ఆసక్తి కలిగించిన చిత్రయూనిట్ ఈ ఆసక్తికర పాయింట్ ని కామెడీగా చూపించడం గమనార్హం. మొదటి హాఫ్ అంతా చారి – చందు పెళ్లి చూపులు, వాళ్ళ మధ్య సన్నివేశాలు, చింటూ పెళ్లి చెడగొట్టడానికి చేసే పనులు.. ఇవన్నీ కామెడీగా చూపిస్తారు. ఇక హీరోకి శరీరంపై మొక్కలు పెరగడంతో ఆసక్తిగా ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో చారి ఆ మొక్కల్ని కనపడకుండా దాచుకునే ప్రయత్నాలు, ఎవరికీ దీని గురించి తెలియకుండా జాగ్రత్త పడటం, ఆ మొక్కలు పోవడానికి చేసే ప్రయత్నాలు అన్ని కామెడీగా సాగుతాయి. చివర్లో ఓ మంచి మెసేజ్ తో కథని ముగించడం విశేషం.

Also Read : Prabhas : మారుతీ సినిమా స్టోరీ లైన్ ఏంటో చెప్పిన ప్రభాస్..

నటీనటులు, సాంకేతిక అంశాలు.. కొత్త నటీనటులైనా చంద్రశేఖర్, సోనాలి బాగానే చేశారు అని చెప్పొచ్చు. కామెడీతో యాదమ్మ రాజు, హీరో ఫ్రెండ్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు, హీరో హీరోయిన్స్ తల్లితండ్రులు నవ్విస్తాయి. ఒక కొత్త కథని తీసుకున్నారు. కథనం మొత్తం కామెడీతో నింపేసి చివర్లో మెసేజ్ ఇవ్వడం బాగానే అనిపిస్తుంది. అయితే కామెడీ అన్ని చోట్లా వర్కౌట్ అవ్వలేదు. దర్శకుడు ప్లాంట్ మాన్ ని బాగానే తెరకెక్కించాడు. ఇక కామెడీకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ అంతా పాతదే కావడం గమనార్హం. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి. చిన్న సినిమా అయినా ఆసక్తికర కథ కావడంతో నిర్మాతలు నిర్మాణ విలువలు దానికి తగ్గట్టు పెట్టారు.

మొత్తంగా ప్లాంట్ మాన్ సినిమా ఓ మంచి మెసేజ్ ని కామెడీ కథాంశంతో ప్రేక్షకులని నవ్విస్తూ చెప్పారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.