Satyabhama Song : కాజల్ అగర్వాల్ కోసం పాట పాడిన కీరవాణి.. ‘సత్యభామ’ కోసం..
తాజాగా సత్యభామ సినిమా నుంచి మరో పాటని విడుదల చేశారు.

Kajal Aggarwal Satyabhama movie second song released by sing by MM Keeravani
Satyabhama Movie Song : కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో కాజల్ అగర్వాల్ లేడీ ఓరియెంటెడ్ గా చేసిన సత్యభామ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, సాంగ్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. తాజాగా సత్యభామ సినిమా నుంచి మరో పాటని విడుదల చేశారు. హైదరాబాద్ లో సత్యభామ మ్యూజికల్ ఈవెనింగ్ నిర్వహించి ‘వెతుకు వెతుకు..’ అనే పాటని రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, అండ్ టీమ్ లైవ్ ఆర్కిస్ట్రాలో పాటలతో అదరగొట్టారు. ఈ పాటని చంద్రబోస్ రాయగా శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వంలో కీరవాణి పాడటం విశేషం. అమ్మాయిలపై జరుగుతున్న హత్యాయత్నాల నేపథ్యంలో.. బాధిత యువతులను చూసి, నేరస్తులను పట్టుకోవడానికి పోలీసాఫీసర్ సత్యభామ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సినిమాలో ఈ సాంగ్ వస్తుందని తెలుస్తుంది. ఈ ఇన్ స్పైరింగ్ సాంగ్ మీరు కూడా వినేయండి..
ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ వెతుకు వెతుకు.. నా సోలో సాంగ్. సత్యభామగా నటించడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నా కెరీర్ లో మొదటిసారి. ఈ సినిమా నా కెరీర్ లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది. నేను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేసిన సినిమా ఇది. ఈ కథ చాలా పర్పస్ ఫుల్ గా, పవర్ ఫుల్ గా అనిపించింది. అమ్మాయిలు తప్పకుండా ఈ సినిమా చూడాలి. అమ్మాయిలు షీ సేఫ్ యాప్ ను ఎలా ఉపయోగించాలి, ఎలా సేఫ్ గా ఉండాలి అనేది సినిమాలో చూపించాం. సత్యభామ క్యారెక్టర్ కండబలంతో పాటు బుద్ధిబలం కూడా చూపిస్తుంది అని తెలిపింది.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తుండగా మేజర్ సినిమా డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించగా సుమన్ చిక్కాల డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.