ఏపీలో కొత్త సర్కార్ కొలువుదీరేలోగా.. వాటిని పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ నిర్ణయం

కేబినెట్ మీటింగ్‌లో వీటిపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదలకు కృషి చేయాలని నిర్ణయించారు.

ఏపీలో కొత్త సర్కార్ కొలువుదీరేలోగా.. వాటిని పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ నిర్ణయం

Updated On : May 16, 2024 / 10:38 PM IST

Cm Revanth Reddy : విభజన హామీలు, ఏపీతో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తుండటం, ఇన్నాళ్లు పార్లమెంట్‌ ఎన్నికలు, ఇతరత్రా పనులతో బిజీగా ఉన్న సీఎం.. ఇక పరిపాలనపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా ఏపీలో కొత్త సర్కార్‌ కొలువుదీరేలోగా విభజన హామీలు, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

ఇక పరిపాలనపై ఫుల్ ఫోకస్..
పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో ఇక రాష్ట్రంలో పరిపాలనపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించారు సీఎం రేవంత్‌రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 100 రోజులకే పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవ్వడం వల్ల ఇప్పటివరకు పరిపాలనపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ చేయలేకపోయారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడం వల్ల ఇక పూర్తి సమయం పాలనకే కేటాయించాలని నిర్ణయించారు. ముందుగా వచ్చే నెలతో రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు కావస్తుండటం, ఈ పదేళ్లలో పరిష్కారం కాని విభజన హామీలు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ‌ మ‌ధ్య పెండింగ్‌లో ఉన్న ఉమ్మడి స‌మ‌స్యల‌పై దృష్టి..
ముందుగా ఏపీ, తెలంగాణ‌ మ‌ధ్య పెండింగ్‌లో ఉన్న ఉమ్మడి స‌మ‌స్యల‌పై దృష్టి సారించారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాలు అమలు అవుతున్నాయా? లేదా? పదేళ్లలో ఏం సాధించింది? ఇప్పుడు తమ ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? అన్నదానిపై దృష్టి పెట్టారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం -2014లో ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఉమ్మడి ఆస్తులను చేర్చారు.

వచ్చే నెలలోగా పరిష్కరించుకోవాలని నిర్ణయం..
పదేళ్ల వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో చేర్చారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10 కింద ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆస్తులు, అప్పులు చేర్చారు. ఐతే ఈ పదేళ్లలో దాదాపు 80 శాతం మేర ఆస్తులు, అప్పుల పంపకం పూర్తి చేశారు. ఇంకా కొన్ని అపరిష్కృతంగా మిగిలిపోవడం, కొన్ని ఆస్తులు, అప్పులపై పీటముడి ఏర్పడింది. ఈ సమస్యలను కూడా వచ్చే నెలలోగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశం..
ముఖ్యంగా ఆర్టీసీ, సింగ‌రేణి, ఎన్టీపీసీ, ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ విభ‌జ‌న‌, ఫిల్మ్ డెవ‌ల‌ప్ మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్, మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేషన్‌ ఆస్తులపై పీటముడి నెలకొంది. అంతేకాకుండా తెలంగాణ విద్యుత్ సంస్థల‌కు పవ‌ర్ యుటిలిటిస్ కింద‌.. 12 వేల కోట్ల బ‌కాయి చెల్లించాల్సి వుంది. వీటిలో తెలంగాణ రాష్ట్రం ఏపీ ఇవ్వాల్సిన మొత్తంపోను ఇంకా 8 వేల కోట్లు ఏపీ నుంచి వసూలు కావాల్సి వుంది. హౌసింగ్ బోర్డ్ ఆస్తుల అంశం కూడా ప‌రిష్కారం కాలేదు. ఇక జూన్ 2తో.. ప‌దేళ్ళు పూర్తి కావ‌స్తున్నందున.. ఇప్పటికీ పెండింగ్ లిస్ట్‌లో ఉన్న వాటిపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌.

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా..
జూన్ 4 త‌ర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీర‌నుంది. అక్కడ ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా స‌త్ససంబంధాలు కొన‌సాగిస్తామ‌ని ఇప్పటికే ప్రక‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం ముందుగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య పెండింగ్ స‌మ‌స్యల‌పై నివేదిక తీసుకుంటున్నారు. శ‌నివారం కేబినెట్ మీటింగ్‌లో వీటిపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం దృష్టికి వీటిని తీసుకువెళ్లి, తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదలకు కృషి చేయాలని నిర్ణయించారు.

Also Read : రైతు రుణమాఫీ ఎలా? సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్, ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?