ఎవరక్కడా?: బిగ్ బాస్ లోకి సెకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మామూలుగా లేదుగా!

బిగ్ బాస్.. ఆయన చర్యలు ఊహాతీతం.. నిజమే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఎవరికీ అర్థం కాదు. ఈ వారం ఎలిమిషన్ లేకుండా కీలక నిర్ణయమే తీసుకున్న బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మరో కంటెస్టెంట్ ని ఇంట్లోకి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తిని షోలోకి పంపేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా చక్రవర్తి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రమ్య కృష్ణ రెండు ఎపిసోడ్ లను హోస్ట్ చేసి ఎలిమినేషన్ లేదంటూ చెప్పేసి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే యాంకర్ శిల్పాశెట్టిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపాడు.
తొలి రెండు సీజన్లలో దీక్షపంత్, నవదీప్, నందితా రాయ్, పూజా రామచంద్రన్ ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి గట్టి పోటీ ఇచ్చారు. సీజన్ 3లో ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తమన్నా రెండు వారాలు తిరగకముందే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. తమన్నా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శ్రద్ధాదాస్, హెబ్బా పటేల్, ఇషా రెబ్బా ఇలా చాలా పేర్లు వినిపించగా.. వీరందరినీ కాదని యాంకర్ శిల్పాశెట్టిని రంగంలోకి దింపారు బిగ్ బాస్ నిర్వాహకులు.
ఒకప్పుడు తెలుగు టెలివిజన్ ని ఓ ఊపు ఊపిన యాంకర్ శిల్పా చక్రవర్తి ఇటీవల కాలంలో కొన్ని ఆడియో ఫంక్షన్ లలో తప్ప పెద్దగా టీవీల్లో కనిపించట్లేదు. ఆమె కొన్ని టీవీ సీరియళ్లలో కూడా నటించింది. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. శిల్పా చక్రవర్తి ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను ఓ రేంజ్ లో తీశారు నిర్వాహకులు. ఇది ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఎవరక్కడా? అనే క్యాప్షన్ పెట్టి ప్రోమో వీడియోని విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.