అక్కడ ఎన్టీఆర్ పాటకు ఫస్ట్‌ప్రైజ్!

  • Publish Date - November 21, 2020 / 07:18 PM IST

Sivasankari Song: విశ్వ విఖ్యాత నటసారభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా మెప్పించిన అద్భుత చిత్రాల్లో అడ్వెంచరస్ ఫాంటసీ మూవీ.. ‘జగదేకవీరుని కథ’ ప్రత్యేకం.. కె.వి.రెడ్డి దర్శక, నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం 1961లో విడుదలైంది.

పెండ్యాల నాగేశ్వరరావు కంపోజ్ చేసిన ఈ సినిమాలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. వాటిలో ‘శివశంకరి’ పాట ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ అని కొత్తగా చెప్పక్కర్లేదు. పెండ్యాల సంగీత సారథ్యం వహించిన ఈ పాటను ఘంటసాల అద్భతంగా ఆలపించారు.


ఇప్పుడీ పాట గురించిన విషయమేంటంటే.. ఇటీవల ఈ అద్భుతమైన పాటను కేరళలో జరిగిన ‘స్వరమంజరి సంగీత ప్రతిభ’ అనే మ్యూజిక్‌ కాంపిటీషన్‌లో మలయాళీ సింగర్‌ సౌజీ జార్జ్‌ పాడారు.

ఈ పాట విన్న సంగీతాభిమానులే కాదు, సంగీత పోటీకి హాజరైన న్యాయ నిర్ణేతలు కూడా అద్భుతమైన పాటను సింగర్‌ అద్భుతంగా పాడిందంటూ ప్రశంసించారు. అలాగే సింగర్ సౌజీ జార్జ్‌కి ఫస్ట్‌ప్రైజ్‌గా ఇరవై వేల రూపాయలు అందించారు.


తెలుగు పాట ఇతర రాష్ట్రంలో ఇంతటి ఆదరణ దక్కించుకోవడం అనేది తెలుగు వారందరికీ, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు గర్వకారణమనే చెప్పాలి. ఇటీవల ఈ పాటను బాలకృష్ణ కూడా పాడిన సంగతి తెలిసిందే.