‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ.. సాఫ్ట్‌వేర్ అబ్బాయి కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తే..

మార్కెట్ మహాలక్ష్మి సినిమా రేపు ఏప్రిల్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందే ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు.

Market Mahalakshmi Movie Review : కేరింత ఫేమ్ పార్వతీశం(Parvateesam) హీరోగా ప్రణీకాన్వికా హీరోయిన్ గా కొత్త దర్శకుడు VS ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సాఫ్ట్‌వేర్ జాబ్ అబ్బాయి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో ముందు నుంచి కూడా ఈ సినిమా సరికొత్తగా ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చింది. మార్కెట్ మహాలక్ష్మి సినిమా రేపు ఏప్రిల్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందే ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు.

కథ విషయానికొస్తే..
హీరో(పార్వతీశం) చిన్నప్పటి నుంచి అతని తండ్రి కొడుకుని బాగా చదివించి పెద్ద జాబ్ వస్తే ఫ్యూచర్ లో కట్నం బాగా రాబట్టాలని అనుకుంటూ ఉంటాడు. హీరో పెద్దయ్యాక ఇండిపెండెంట్ గా, ధైర్యంగా బతికే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్న తీసుకొచ్చే సంబంధాలు రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఓ సారి అమ్మతో కలిసి హీరో కూరగాయల మార్కెట్ వెళ్తే అక్కడ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని చూస్తాడు. ఆ అమ్మాయి చిన్నప్పట్నుంచి ఫ్యామిలీని పోషిస్తుందని, ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడుతుందని, తేడా వస్తే గొడవ కూడా పడుతుందని అక్కడ మార్కెట్ లో సన్నివేశాలు చూసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు.

దీంతో మొదటి సారి చూసినప్పుడే వెళ్లి మహాలక్ష్మికి ప్రపోజ్ చేస్తే కొడుతుంది. ఇది హీరో తల్లి చూసి ఆమె కూడా కొడుతుంది. ఆఫీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో మార్కెట్ లో షాప్ పెట్టుకొని మహాలక్ష్మిని ఎలాగైనా పడేయాలని పెళ్ళికి ఒప్పించాలని తెగ ప్రయత్నిస్తుంటాడు హీరో. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. మహాలక్ష్మి అయితే హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా అతన్ని పట్టించుకోదు. మరి మహాలక్ష్మి హీరో ప్రేమని కనికరిస్తుందా? ఇండిపెండెంట్ గా బతికే అమ్మాయి పెళ్లి తర్వాత మారుతుందా? హీరో తండ్రి కట్నం లేకుండా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాడా? హీరో తన ప్రేమ కోసం ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : Anjana Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కూతుర్ని చూశారా? హీరోయిన్ లెవెల్..

సినిమా విశ్లేషణ..
సాఫ్ట్ వేర్ జాబ్ అబ్బాయి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో మార్కెట్ మహాలక్ష్మి సినిమాని తీసుకొచ్చినా సెకండ్ హాఫ్ లో పెళ్లి, అమ్మాయిలు, పెళ్లి తర్వాత జీవితం, కట్నం.. లాంటి పలు అంశాలని చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్స్, హీరో ఫాదర్ క్యారెక్టర్స్ గురించి చెప్పడం, హీరో మహాలక్ష్మి వెంట పడటం చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో హీరో ప్రేమ గురించి వాళ్ళ నాన్నకి తెలియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఓ ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ లా సాగుతుంది. ఒక మంచి పాయింట్ ని దర్శకుడు ఈ సినిమాలో టచ్ చేసాడు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని ఆలోచింపచేస్తాయి. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అయితే సినిమా మొత్తంలో హీరో క్యారెక్టర్ కి పేరు లేకుండా రాసుకోవడం గమనార్హం. సినిమా అంతా అయ్యాక వచ్చే DJ సాంగ్ కూడా బాగుంటుంది. సినిమాలో హీరోయిన్ మాట్లాడే మాటలు DJ సాంగ్ గా మార్చడం కొత్తగా ఉంటుంది. సినిమా మొత్తంలో కామెడీ కూడా అక్కడక్కడా నవ్విస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
పార్వతీశం చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ చేశాడు. సెకండ్ హాఫ్ లో తన నటనతో మెప్పించాడు. అయితే ఈ సినిమాలో మహాలక్ష్మిగా నటించిన ప్రణీకాన్వికా అదరగొట్టిందని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ లో హీరోని డామినేట్ చేసి మరీ నటించి మెప్పించింది. తండ్రి పాత్రలో కేదార్ శంకర్ మెప్పించారు. ముక్కు అవినాష్, బాషా తమ కామెడీతో అక్కడక్కడా నవ్వించారు.

సాంకేతిక అంశాలు..
సినిమాలో చాలా భాగం రియల్ కూరగాయల మార్కెట్ లోనే తీశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే DJ సాంగ్ మాత్రం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొన్ని చోట్ల డైలాగ్స్ ని డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. కథ కొత్త పాయింట్ తీసుకున్నా కథనం మాత్రం రొటీన్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా రాసుకున్నారు. దర్శకుడిగా ముఖేష్ మొదటి సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇక సినిమాకి తగ్గట్టు నిర్మాతలు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘మార్కెట్ మహాలక్ష్మి’ సినిమా సాఫ్ట్‌వేర్ అబ్బాయి కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ అయినా పెళ్లి తర్వాత లైఫ్ గురించి కూడా ఆలోంచించే విధంగా ఓ మంచి ఎమోషనల్ పాయింట్ ని కూడా చూపించారు.ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు