ప్రముఖ నటి ఆశాలత కన్నుమూత

  • Published By: sekhar ,Published On : September 22, 2020 / 12:47 PM IST
ప్రముఖ నటి ఆశాలత కన్నుమూత

Updated On : September 22, 2020 / 1:13 PM IST

Actress ashalata wabgaonkar passes away: కరోనా వైరస్ రోజురోజుకీ మరింతగా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా కారణంగా కన్నుమూసారు. తాజాగా సీనియర్ బాలీవుడ్, మరాఠీ నటి ఆశాలత వబ్‌గాంకర్ కోవిడ్ కారణంగా మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె కరోనాతో బాధపడుతూ.. సతారాలోని ప్రతిభ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మంగళవారం (సెప్టెంబర్ 22) తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 83 సంవత్సరాలు.


‘ఆయి మజి కలు బాయి’ అనే మరాఠీ టీవీ షో చేస్తుండగా వారం క్రితం ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆ షోలో పాల్గొన్న వాళ్లందరు కరోనా టెస్టులు చేయించుకోగా.. అందరికీ నెగిటివ్ వచ్చింది. ఆశాలతకు కరోనా నిర్ధారణ కావడంతో దర్శక,నిర్మాతలు షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసి టీమ్ మెంబర్స్ అందురూ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆశాలత గత మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.


మరాఠీ రంగస్థల నటిగా గుర్తింపు పొందిన ఆశాలత ఓ కొంకణి సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. తర్వాత మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. మరాఠీలో ప్రసారమయ్యే పలు టీవీ సీరియల్లో అత్త, అమ్మ పాత్రల్లో మెప్పించారు. ఆశాలత కొంకొణి, మరాఠీ, హిందీ సినిమాల్లో కలిపి వంద చిత్రాలకు పైగా నటించారు. ఆశాలత మృతికి బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమ వర్గాల వారు సంతాపం తెలియచేస్తున్నారు.