Akkada Ammayi Ikkada Abbayi : ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ మూవీ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ హీరోగా రెండో సినిమా ఎలా ఉందంటే..?

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి.

Akkada Ammayi Ikkada Abbayi : ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ మూవీ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ హీరోగా రెండో సినిమా ఎలా ఉందంటే..?

Pradeep Machiraju Deepika Pilli Akkada Ammayi Ikkada Abbayi Movie Review and Rating

Updated On : April 11, 2025 / 12:53 PM IST

Akkada Ammayi Ikkada Abbayi Movie Review : ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన సినిమా ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై నితిన్‌, భరత్‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గెటప్ శ్రీను, పీకే కోదాటి, సత్య, మురళీధర్ గౌడ్, ఝాన్సీ, వెన్నెల కిషోర్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నేడు ఏప్రిల్ 11న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. భైరిలంక అనే ఊళ్ళో ఓ జనరేషన్ లో ఆడపిల్లలు పుట్టరు. ఊళ్ళో కరువు వస్తుంది. అలాంటి సమయంలో ఆ ఊళ్ళో ఒక ఆడపిల్ల పుట్టడంతో వర్షాలు పడి ఊరు బాగుంటుంది. దీంతో ఆ అమ్మాయిని రాజకుమారి(దీపికా పిల్లి) ఆ ఊరు దాటించకూడదు అని, ఊళ్ళో ఉన్న 60 మంది మగాళ్లలో ఎవర్నో ఒకరినే పెళ్లి చేసుకోవాలని, తను ఎవర్ని చేసుకుంటే వాళ్లకు ఆస్తి ఇచ్చి నెక్స్ట్ ప్రసిడెంట్ వాళ్ళే అని ఆ ఊరి ప్రసిడెంట్ ప్రకటిస్తాడు. రాజ వాళ్ళ నాన్న కూడా అందుకు ఒప్పుకొని మాట ఇస్తాడు. దీంతో ఆ ఊళ్లోకి వేరే మగాళ్లని రానివ్వరు. ఈ ఊరి మగాళ్లు ఆ రాజని పెళ్లి చేసుకోవాలనే అక్కడే ఉండిపోతారు.

రాజకి 21 ఏళ్ళు వచ్చాక ఆ ఊరికి బాత్రూమ్స్ కట్టాలని ఒక ప్రాజెక్టు మీద సివిల్ ఇంజనీర్ కృష్ణ(ప్రదీప్), అతని డ్రైవర్ బిలాల్(సత్య)వస్తారు. వాళ్ళను రాజని చూడకుండా పని చేయాలని ఆ ఊళ్ళో మగవాళ్ళు తీర్మానిస్తారు. అవి కట్టడానికి ఎవ్వరూ పని చేయరు. ఆ బాత్రూమ్స్ ప్రాజెక్టు అవ్వాలంటే రాజతో మాట్లాడాలని రాత్రి పూట కృష్ణ వాళ్ళింటికి వెళ్తే అనుకోకుండా రాజకు ముద్దు పెడతాడు. చిన్నప్పట్నుంచి ఆ ఊరిని దాటాలని, బయటి వ్యక్తితోనే వెళ్లాలని అనుకుంటున్న రాజ కృష్ణ ప్రేమలో పడుతుంది. కృష్ణ కూడా రాజ ప్రేమలో పడతాడు. ఊళ్ళో ఎవరికీ తెలియకుండా కలుస్తూ ఉంటారు ఈ ఇద్దరూ. ఒకరోజు ఈ విషయం ఊళ్ళో వాళ్లకు తెలుస్తుంది. దీంతో ఆ ఊరి మగవాళ్ళు ఏం చేసారు? రాజ ఆ ఊరు దాటుతుందా? కృష్ణ – రాజల ప్రేమ పండుతుందా? బాత్రూమ్స్ ప్రాజెక్టు పూర్తవుతుందా? రాజ వాళ్ళ నాన్న ఇచ్చిన మాట నిలబడుతుందా? రాజని ప్రేమించడం వల్ల కృష్ణ కు వచ్చిన కష్టాలు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Pawan Kalyan : 15 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు.. అయినా సరే పక్కన పెట్టేసాను..

సినిమా విశ్లేషణ.. యాంకర్ గా బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రదీప్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇది ప్రదీప్ కి హీరోగా రెండో సినిమా. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ చేసాక ఇదేదో కొత్త కాన్సెప్ట్ అనిపించింది. ఒక ఊళ్ళో ఒకే అమ్మాయి ఉండటం, ఆ అమ్మాయి ఊళ్ళో వాళ్లనే ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవాలి, ఓ అబ్బాయి బయటి నుంచి వచ్చి ఆమెని ప్రేమిస్తే ఏమవుతుంది అని ఓ కొత్త పాయింట్ తీసుకున్నారు.

అయితే సినిమా అంతా ఫుల్ ఎంటర్టైనింగ్ గానే తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ గా నవ్వుకోవాల్సిందే, ప్రదీప్, సత్య, ఆ ఊళ్ళో 60 మంది చేసే పనులు బాగా కామెడీ పండించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కొత్త సినిమా, ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. ఫుల్ గా నవ్వుకొని బయటకి రావొచ్చు. ఇంటర్వెల్ ఊహించినా ఇంటర్వెల్ తర్వాత ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. దాంతో సినిమా ఇంకా కామెడీ ఉంటుంది అనుకుంటాం. అయితే సెకండ్ హాఫ్ లో కామెడీ కాస్త వర్కౌట్ అవ్వలేదు. చివర్లో ఎమోషన్ పండించడానికి ట్రై చేసారు కానీ అది సహజంగా అనిపించదు. సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్స్ మధ్యలోనే వదిలేసినట్టు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో వాటన్నిటికీ లింక్ ఇచ్చి వావ్ అనిపించారు. క్లైమాక్స్ పూర్తిగా చూడకుండా వెళ్ళిపోతే మాత్రం వాళ్లకు సినిమా ఏదో మిస్ చేసారు అనిపిస్తుంది. సాయం చేయడం అనే కాన్సెప్ట్ ని కొత్తగా చూపించారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వెళ్లి ఫుల్ గా నవ్వుకోవచ్చు.

akkada ammayi ikkada abbayi

నటీనటుల పర్ఫార్మెన్స్.. సివిల్ ఇంజనీర్ పాత్రలో, 60 మందితో బాధలు పడే పాత్రలో ప్రదీప్ బాగా నటించాడు. సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకొని టీవీ షోలతో పాపులర్ అయినా దీపికా పిల్లికి హీరోయిన్ గా పర్ఫెక్ట్ ఎంట్రీ పడింది. సినిమా అంతా లంగావోణీలొక్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, పీకే పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం.. బాగా నవ్వించారు. ఝాన్సీ, జెమిని కిరణ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : OG : వామ్మో.. OG సినిమా ఓటీటీ హక్కులు అన్ని కోట్లా? ఇది OG సినిమా మీదున్న హైప్ అంటే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించారు. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా వినడానికి, చూడటానికి బాగున్నాయి. ఓ కొత్త కథని తీసుకొని కామెడీగా మంచి స్క్రీన్ ప్లేతో దర్శకులు నితిన్ – భరత్ బాగా తెరకెక్కించారు. ఇన్నాళ్లు టీవీ షోలలో నవ్వించిన డైరెక్టర్స్ ఇప్పుడు మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ఒక ఊళ్ళో ఒకే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ఫుల్ లెంగ్త్ కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.