తలైవి కోసం తాత పాత్రలో తారక్: భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్న నిర్మాతలు

  • Published By: vamsi ,Published On : November 20, 2019 / 02:46 AM IST
తలైవి కోసం తాత పాత్రలో తారక్: భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్న నిర్మాతలు

Updated On : November 20, 2019 / 2:46 AM IST

సినిమా తారగా ప్రస్థానం ప్రారంభించి, రాజకీయాల్లో వెలుగు వెలిగి, తమిళనాడు ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా, అమ్మగా పేరు తెచ్చుకున్న జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులు అనేకం. అనూహ్య సంఘటనలకు కొదవే లేదు. అందుకే ఆమె జీవిత కథతో బయోపిక్ తీస్తున్నారు. ఇప్పటికే జయలలిత చరిత్రతో మూడు, నాలుగు బయోపిక్‌లు అనౌన్స్ చేయగా.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్‌కే హైప్ ఎక్కువగా ఉంది.

ఈ సినిమాను ‘తలైవి’ అనే పేరుతో రూపొందిస్తుండగా.. ఈ సినిమాలో ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తున్నాడు. అయితే తెలుగు, తమిళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకు దక్షిణాది నుంచి టాప్ హీరోలను తీసుకోవాలని భావించింది చిత్ర యూనిట్ ఇందులో భాగంగానే సినిమాలో ముఖ్యమైన ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సంప్రందించిందట చిత్ర యూనిట్. అయితే చెయ్యనని చెప్పేశాడట ఎన్టీఆర్.

ఇప్పటికే తాత పాత్రను చెయ్యనని పలు మార్లు స్పష్టం చేసిన ఎన్టీఆర్.. అదే విషయాన్ని వారికి చెప్పారట. కానీ నిర్మాతలు మాత్రం ఎన్టీఆర్‌ని వదలట్లేదట. సినిమాలో ఎన్టీఆర్ చిన్న పాత్ర చేసినా కూడా తెలుగులో మార్కెట్ అవుతుందని, భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైందట. అయినా కూడా చెయ్యనని సున్నితంగా తిరస్కరించారట. ఎన్టీఆర్, జయలలిత కలసి పలు చిత్రాల్లో నటించగా సినిమా పార్ట్ వరకైనా చెయ్యాలని నిర్మాతలు కోరినా ఎన్టీఆర్ ఒప్పుకోలేదు.  

అంతకుముందు మహానటి సినిమాలో కూడా జూ. ఎన్టీఆర్ తన తాత పాత్ర చేయనని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో బాలకృష్ణని కూడా నిర్మాతలు రిక్వస్ట్ చేస్తున్నట్లు టాక్. తలైవి సినిమాకి నిర్మాత విష్ణు ఇందూరి. ఎన్టీఆర్ బయోపిక్ మూవీని నిర్మించింది కూడా ఆయనే కావడంతో బాలకృష్ణను అడుగుతున్నారట నిర్మాతలు. బాలకృష్ణ అంగీకారం తెలిపినా తలైవి చిత్రానికి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. చూడాలి మరి ఆ మహా నాయకుని పాత్రలో ఎవరు నటిస్తారో…

ఇక ‘తలైవి’ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ  సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు.