Razakar Review : రజాకార్ మూవీ రివ్యూ.. హైదరాబాద్ నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనం అయింది?

హైదరబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో రూపొందిన రజాకార్ మూవీ రివ్యూ ఏంటి..?

Razakar Review : రజాకార్ మూవీ రివ్యూ.. హైదరాబాద్ నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనం అయింది?

Razakar Review

Updated On : March 15, 2024 / 9:09 AM IST

Razakar Review : హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్ నటుడు విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. భీమ్స్ సంగీతం అందించారు. ట్రైలర్ అండ్ టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

కథ విషయానికొస్తే.. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 500కి పైగా రాజసంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ మనదేశంలో విలీనం అయ్యేలా చర్యలు చేపట్టారు. అయితే హైదరాబాద్ రాజధానిగా నిజాం ప్రభుత్వం మాత్రం ప్రత్యేక దేశంగా ఉండాలనుంది. మొదట నిజాం సంస్థానం మొదలైన దగ్గర్నుంచి ఒక వాయిస్ ఓవర్ తో నిజాం రాజుల గురించి చెప్పారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలిస్తూ ఉంటాడు. అతను ఎంతో కొంత మంచివాడైనా అతని దగ్గర ఉండే రజాకార్ల అధ్యక్షుడు, సైన్యాధిపతి ఖాసిం రాజ్వి, మరో నేత నిజాం రాజుతో కలిసి నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్ గా మరో ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటారు. దీంతో నిజాం ప్రభుత్వంలో ఉన్న హిందువులపై దాడులు చేస్తూ ఉంటారు. మతం మారాలి లేదా చనిపోవాలి అంటూ దారుణంగా ప్రజల మీద అకృత్యాలకు పాల్పడతారు. ఎదురు తిరిగిన వారిని చంపేస్తూ ఉంటారు.

ఇవన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి తెలిసి ఎలాగైనా రజాకార్ల ఆకృత్యాలు అణిచివేయాలని, నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చర్యలు చేపడతారు. మరోపక్క నిజం ప్రభుత్వం, రజాకార్లు కలిసి హైదరాబాద్ ని ఇస్లాం దేశంగా మార్చడానికి పాకిస్తాన్ తో పాటు వేరే దేశాల సహాయం కూడా కోరుతాయి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను అణిచివేసి, నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి ఎలా భారతదేశంలో విలీనం చేశారు అనేది తెరపై చూడాల్సిందే.

Also read : Lambasingi Review : లంబసింగి మూవీ రివ్యూ.. పోలీస్ కానిస్టేబుల్‌కి, లేడీ నక్సలైట్‌కి మధ్య ప్రేమ కథ..

సినిమా విశ్లేషణ.. రజాకార్ సినిమా హైదరాబాద్ చరిత్ర పై తీశారు. మనందరం కూడా హైదరాబాద్ నిజాం సంస్థానం గురించి రజాకార్ల గురించి వినే ఉంటాం లేదా చదివే ఉంటాం. ఇప్పటికీ హైదరాబాద్ భారతదేశంలో కలిసిన రోజుని సెప్టెంబర్ 17 తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రజాకార్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా నిజాం సంస్థానం గురించి, రజాకార్ల గురించి, అలాగే నిజాం ప్రభుత్వంలో ఉండే ప్రజల మీద మతం మారకపోతే వాళ్ళు చేసిన దాడులు గురించి, అందులో కొంతమంది తిరగబడడం గురించి చూపిస్తారు. ఈ సినిమాలో ప్రేమ, వేదిక, ఇంద్రజ, బాబి సింహ, అనసూయ.. ఇలా చాలామంది స్టార్ ఆర్టిస్టులు ఉండడంతో ఎవరికి వారికి సపరేట్ గా నిజాం ప్రభుత్వంలో పల్లెల్లో ఒక కథను చూపించి.. వీరు నిజం ప్రభుత్వానికి ఎలా ఎదురు తిరిగారు, తిరిగితే రజాకార్లు ఏం చేశారు అనేది చూపించారు.

ఇక సెకండ్ హాఫ్ లో ఓ పక్క ప్రజల్లో రజాకార్లపై వ్యతిరేకతను చూపిస్తూనే మరోపక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఎలా భారత దేశంలో విలీనం చేశారు అని రాజకీయంగా, ఆయన చేపట్టిన ఆపరేషన్ పోలో కూడా చూపించారు. సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి 15 నిమిషాలకు ఒక ఎపిసోడ్ లాగా తీసుకొని ప్రతి ఆర్టిస్ట్ కు ఎలివేషన్ ఇచ్చి, రజాకార్లు ప్రజలపై అకృత్యాలు చేయడం, వాటికి ఎదురు తిరగడం వంటి సీన్స్ తో ఒకపక్క ఎమోషన్ చూపిస్తూనే మరోపక్క ఎదిరించాలి అనే ఒక దేశభక్తి హై ఎమోషన్ కూడా చూపించారు.

నటీనటులు.. నిజాం రాజుగా మకరంద దేశ్ పాండే, ఖాసిం రజ్విగా రాజ్ అర్జున్, వల్లభాయ్ పటేల్ గా తేజ్ సప్రు, చాకలి ఐలమ్మగా ఇంద్రజ వారి పాత్రల్లో జీవించేసారని చెప్పొచ్చు. అనసూయ, ప్రేమ, వేదిక, బాబీ సింహ.. ఇలా చాలామంది ఆర్టిస్టులు హైదరాబాద్ సంస్థానంలోని వివిధ పల్లెల్లో రజాకార్లకు ఎదురు తిరిగిన వీరులుగా అద్భుతంగా నటించారు.

సాంకేతిక విషయాలు.. ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్. రజాకర్ సినిమాని అప్పటి కాలానికి తగ్గట్టు ఒక పీరియాడిక్ సినిమాగా తెరకెక్కించారు. దీంతో అప్పుడు నిజాం ప్రభుత్వం, అప్పటి పల్లెటూర్లు, అప్పటి హైదరాబాద్ ఎలా ఉందో విఎఫ్ఎక్స్ లో చాలా బాగా డిజైన్ చేశారు. నిజంగా హైదరాబాద్ అప్పుడు అలాగే ఉండేదేమో అన్నట్టు మెప్పించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఎలివేషన్స్ సీన్స్ కి దేశభక్తి ఉప్పొంగేలా ఇస్తూనే మరోపక్క ఎమోషన్స్ సీన్స్ లో కన్నీళ్లు తెప్పించేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి కూడా చెప్పుకోవాలి ప్రతి యాక్షన్ సీన్ ని చాలా కొత్తగా అప్పటి ఆయుధాలను వాడి డిజైన్ చేశారు.

కథ అందరికీ తెలిసిందే అయినా దానిని ఎక్కడ బోర్ కొట్టకుండా మలిచి చూపించారు. పలు సీరియల్స్ ని డైరెక్ట్ చేసిన దర్శకుడు యాట సత్యనారాయణ మొదటి సినిమానే రజాకార్ అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు, కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఖర్చు బాగానే అయిందని తెలుస్తుంది. నిర్మాత కూడా ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా రజాకర్ అనే సినిమా నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో ఎలా విలీనం చేశారు అనేక అంశంతో చూపించారు ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.