Kolla Movie Review : రజిష విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మలయాళం సినిమా ‘కొల్ల’. రాజీశ్ నిర్మాణంలో సూరజ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో ఈ సినిమా 2023 లో రిలీజవ్వగా ఇటీవలే ఈ విన్ ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ తో అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికొస్తే.. యాని(రజిష విజయన్), శిల్ప(ప్రియా ప్రకాష్ వారియర్) ఇద్దరూ కలిసి ఓ కొత్త ఊరికి వచ్చి అక్కడ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయడానికి షాప్ ని రెంట్ కి తీసుకొని రెడీ చేస్తూ ఉంటారు. ఊళ్ళో అందరితో మంచిగా సంబంధాలు పెంచుకుంటారు. త్వరలోనే వాళ్ళ బ్యూటీ పార్లర్ షాప్ ఓపెనింగ్ ఉందనగా ఆ షాప్ పైన ఉన్న బ్యాంక్ లో లాకర్లలో ఉన్న బంగారం అంతా ఈ ఇద్దరు అమ్మాయిలు మరో ఇద్దరితో కలిసి దొంగతనం చేస్తారు. తర్వాత రోజు ఏమి తెలియనట్టే వచ్చి చుట్టుపక్కన వాళ్ళని పిలిచి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేలా చేస్తారు. ఈ కేసుని పోలీసాఫీసర్ షారుఖ్ టేకప్ చేస్తాడు. అసలు ఈ ఇద్దరు అమ్మాయిలు దొంగతనం ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? పోలీసాఫీసర్ దొంగల్ని ఎలా కనిపెట్టాడు? వీళ్ళతో పాటు దొంగతనంలో పాల్గొన్న మరో ఇద్దరు ఎవరు? దొంగతనం చేసిన బంగారం ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Sobhita Dhulipala : తమిళనాడు విలేజ్ లో వెకేషన్.. ఎంజాయ్ చేస్తున్న శోభిత ధూళిపాళ.. ఫొటోలు..
సినిమా విశ్లేషణ.. రెండేళ్ల క్రితం సినిమా అయినా మలయాళం థ్రిల్లర్ సినిమా కావడంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది కొల్ల. మలయాళంలో కొల్ల అంటే దొంగతనం అని అర్ధం. సినిమా ప్రారంభంలో ఇద్దరు అమ్మాయిలు వచ్చి అందరితో మంచిగా ఉండటం సీన్స్ ఒక ఇరవై నిమిషాల వరకు కాస్త సాగదీసినట్టే అనిపిస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు దొంగతనం చేయడం మొదలుపెట్టినప్పట్నుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది. పోలీస్ ఆఫీసర్ షారుఖ్ ఎలా పట్టుకున్నాడు అనే ఇన్వెస్టిగేషన్ బాగా చూపించారు.
ఒక్కొక్కరు దొరికిపోతుండటంతో అమ్మాయిలు కూడా దొరికేస్తారా? దొరికితే ఏం చేస్తారు, ఎలా తప్పించుకుంటారు అని థ్రిల్లింగ్ గా నడిపించారు. చివరికొచ్చేసరికి ఏంటి ఇంత సింపుల్ గా ముగించేస్తారా అనుకునేలోపు క్లైమాక్స్ లో ట్విస్ట్ తో పర్ఫెక్ట్ గా ముగిస్తారు. కాస్త స్లో నేరేషన్ ఉన్నా మొదటి 20 నిముషాలు పక్కన పెడితే ఆ తర్వాత నుంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగానే నడిపించారు. ఫ్యామిలీతో చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. రజిష విజయన్ ఓ పక్క సాఫ్ట్ గా కనిపిస్తూనే మరో పక్క దొంగతనం, తప్పించుకోవడం లాంటి ప్లాన్స్ వేస్తూ రెండు షేడ్స్ లో మెప్పించింది. ప్రియా ప్రకాష్ వారియర్ కాస్త క్యూట్ గా, అమాయకంగా కనిపించి పర్వాలేదనిపించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో వినయ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సీనియర్ దొంగ స్టీఫెన్ పాత్రలో అలెన్సర్ లోపెజ్, డ్రైవర్ పాత్రలో బేసిల్ బాగానే మెప్పించారు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మంచి థ్రిల్లింగ్ అనుభవం ఇచ్చారు. ఆల్మోస్ట్ సినిమా అంతా నాలుగు అయిదు లొకేషన్స్ లోనే షూట్ చేసారు. తెలుగు డబ్బింగ్ బాగానే వర్కౌట్ అయింది. ఇద్దరమ్మాయిలు దొంగతనం అనే కాన్సెప్ట్ ని బాగానే రాసుకొని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘కొల్ల’ సినిమా ఇద్దరు అమ్మాయిలు కలిసి ఓ బ్యాంక్ ని ఎలా దొంగతనం చేసారు, ఎలా తప్పించుకున్నారు అని థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.