Jithender Reddy : ‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ.. 72 తూటాలు శరీరంలోకి దిగిన నాయకుడి బయోపిక్..
కరీంనగర్, జగిత్యాల చుట్టుపక్కల పలు ఊర్లకు జితేందర్ రెడ్డి కథ తెలిసిందే.

Rakesh Varre Jithender Reddy Movie Review and Rating
Jithender Reddy Movie Review : జగిత్యాలకు చెందిన నాయకుడు, దివంగత ABVP లీడర్ జితేందర్ రెడ్డి అలియాస్ జిత్తన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి. రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి పాత్ర పోషించాడు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి హిట్ సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వంలో ఈ జితేందర్ రెడ్డి సినిమా తెరకెక్కింది. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు. అయితే ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే.. ఇది 1980 – 1990 మధ్యలో జరిగే కథ. జగిత్యాలలో ప్రజల కోసం, రైతుల కోసం నిలబడే ఓ కుటుంబంలో పుడతాడు జితేందర్ రెడ్డి. చిన్నప్పట్నుంచి RSS శిక్షణ, హిందూ ధర్మం, దేశభక్తితో పెరుగుతాడు. ఓ చిన్నపిల్లాడిని నక్సలైట్లు కాల్చి చంపారని చిన్నప్పుడే తెలుసుకున్న జితేందర్ రెడ్డి ప్రజల కోసం ఏదైనా చేయాలని, నక్సలైట్ల ఉద్యమం పక్కదారి పట్టిందని భావిస్తాడు. కాలేజీలో ABVB లో లీడర్ గా ఎదుగుతాడు. జితేందర్ రెడ్డి, అతని సన్నిహితులు నక్సలైట్స్ లోకి వెళ్ళొద్దని ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ, పిల్లలకు చదువులు చెప్తూ ఉంటారు.
అయితే నక్సలైట్లు జితేందర్ రెడ్డి, అతని మనుషులు తమకు అడ్డొస్తున్నారని కొంతమందిని చంపేస్తారు. జితేందర్ రెడ్డి పైన కూడా హత్యాయత్నం చేస్తారు. జితేందర్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీకి నిలబడిన సమయంలో ఏం జరిగింది? అతని సన్నిహితులను నక్సలైట్లు ఎలా చంపారు? అతని ప్రేమకథ ఏంటి? జితేందర్ రెడ్డి సీనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు కలిశారు? వరంగల్ వాజ్ పేయి సభను ఎలా విజయవంతం చేసాడు? నక్సలెట్లు చుట్టుముట్టి జితేందర్ రెడ్డిని ఎప్పుడు ఎలా చంపారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Aha OTT : యువ రచయితలకు ఆహా ఓటీటీ ఆహ్వానం.. మీ దగ్గర ట్యాలెంట్ ఉంటే ట్రై చేయండి..
సినిమా విశ్లేషణ.. ఈ సినిమా బయోపిక్ అయినప్పటికీ కొన్ని అంశాలు సినిమాటిక్ గా జోడించి చూపించారు. కరీంనగర్, జగిత్యాల చుట్టుపక్కల పలు ఊర్లకు జితేందర్ రెడ్డి కథ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ జితేందర్ రెడ్డి బాల్యం, కాలేజీ బ్యాక్ డ్రాప్, కాలేజీలో ఎలా లీడర్ గా ఎదిగాడు అని చూపించారు. ఇక సెకండ్ హాఫ్ జితేందర్ రెడ్డి వర్సెస్ నక్సలైట్లు, జితేందర్ రెడ్డి పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అని చూపించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగా తీసినప్పటికి కొన్ని చోట్ల డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. హీరో పాత్రకు ఎలివేషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా తక్కువ ఎలివేషన్స్ తోనే సరిపెట్టేశారు. క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. అక్కడక్కడా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర, వాజ్ పేయి పాత్ర సీన్స్ మాత్రం అదిరిపోతాయి. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎంతగా ఉండేది అని సినిమాలో చూపించారు. జితేందర్ రెడ్డిని నక్సలైట్లు 72 బులెట్లు శరీరంలోకి దింపి చంపారు అని ఆయన రియల్ ఫొటోలు కూడా సినిమా క్లైమాక్స్ లో చూపించడం గమనార్హం. అతనితో పాటు రియల్ గా చనిపోయిన పలువురు ఫొటోలు, పేపర్ వార్తలు కూడా సినిమాలో చూపించారు. చరిత్ర తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవాళ్లు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్.. రాకేష్ వర్రే మాత్రం జితేందర్ రెడ్డి పాత్రలో జీవించేసాడని చెప్పొచ్చు. ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఒక లీడర్ లా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసి మెప్పిస్తాడు. సుబ్బరాజు రైతు లీడర్ గా బాగా నటించాడు. జితేందర్ రెడ్డి గన్ మెన్ గట్టయ్య పాత్రలో రవిప్రకాష్ కూడా చాలా బాగా మెప్పించాడు. నక్సలైట్ లీడర్ గా ఛత్రపతి శేఖర్ మెప్పించాడు. వైశాలి రాజ్, రియా సుమన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్ కూడా ఆ కాలానికి తగ్గట్టు గ్రామాల్లో, అడవుల్లో పర్ఫెక్ట్ గా సెట్ చేసారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా మెయిన్ లీడ్స్ నుంచి బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుల వరకు అందరికి పర్ఫెక్ట్ గా ఆ కాలానికి తగ్గట్టు డ్రెస్సులు డిజైన్ చేసారు. ఒక జీవిత కథని సరికొత్తగా మంచి స్క్రీన్ ప్లేతో చెప్పాడు దర్శకుడు విరించి వర్మ. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా ఇవ్వొచ్చు అనిపిస్తుంది. పాటలు మాత్రం యావరేజ్. ఇక నిర్మాత జితేందర్ రెడ్డి తమ్ముడే కావడంతో ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టి పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.
మొత్తంగా ‘జితేందర్ రెడ్డి’ సినిమా నక్సలైట్స్ పై పోరాడిన జగిత్యాల నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ గా పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.