Veekshanam : ‘వీక్షణం’ మూవీ రివ్యూ.. థ్రిల్లర్ తో అదరగొట్టారుగా..
సాధారణ థ్రిల్లర్ కాకుండా ఓ మంచి మెసేజ్ తో ఈ సినిమాని ఆసక్తిగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఫీల్ వచ్చేలా బాగా తెరకెక్కించారు.

Ram Karthik Veekshanam Movie Review and Rating
Veekshanam Movie Review : రామ్ కార్తీక్, కశ్వి జంటగా వచ్చిన సినిమా ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మాణంలో మనోజ్ పల్లేటి దర్శకత్వంలో కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. వీక్షణం సినిమా నేడు అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. అర్విన్(రామ్ కార్తీక్) కు తన బెడ్రూమ్ కిటికీ లోంచి బైనాక్యులర్ తో చుట్టూ ఉన్న ఇళ్లల్లో అమ్మాయిలను చూసే అలవాటు ఉంది. అలా ఒక రోజు నేహా(కశ్వీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెని ప్రేమలో పడేయడానికి తన ఫ్రెండ్ చిచి, తన బావ నారి(జబర్దస్త్ ఫణి) సహాయం తీసుకుంటాడు. నేహా అర్విన్ ని ఇష్టపడ్డాక అనుకోకుండా ఇలా బైనాక్యులర్ విషయం, ఆమెని పడేయడానికి పడ్డ కష్టాలు చెప్పడంతో మోసం చేసావంటూ నేహా అర్విన్ ని దూరం పెడుతుంది.
అదే సమయంలో అర్విన్ ఓ ఇంట్లో ఒక అమ్మాయి(నక్షత్ర నైనా) మర్డర్ చేయడం తన బైనాక్యులర్ లో చూస్తాడు. ఈ విషయం చిచి, నారిలకు చెప్తే నమ్మరు. అయితే ముగ్గురు కలిసి ఇంకో రోజు అదే అమ్మాయి ఇంకొకరిని మర్డర్ చేయడం చూస్తారు. తెలిసిన పోలీస్ కి ఈ విషయం చెప్తే వాళ్ళు కొన్ని మిస్సింగ్ పర్సన్ ఫోటోలు చూపిస్తారు. అందులో ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది. మిస్ అయిన వాళ్లలో కొంతమందిని ఆ అమ్మాయే చంపింది అని అర్విన్ చెప్తే అసలు ఆ అమ్మాయి కూడా ఎప్పుడో చనిపోయింది అని పోలీసులు చెప్తారు. దీంతో ఈ ముగ్గురు షాక్ అవుతారు. చనిపోయిన అమ్మాయి మనుషులని ఎలా చంపుతుంది? అసలు ఎందుకు మనుషులను ఆ అమ్మాయి చంపుతుంది? నేహా అర్విన్ కి మళ్ళీ దగ్గరవుతోందా? మర్దర్లు చేసే అమ్మాయి ఎవరో కనిపెట్టే ప్రయత్నంలో అర్విన్ ఎదుర్కున్న కష్టాలు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Love Reddy : ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఆసక్తికర టైటిల్‌తో ఎమోషనల్ లవ్ స్టోరీ..
సినిమా విశ్లేషణ.. సాధారణంగా మర్డర్ మిస్టరీలు ఆసక్తికరంగా అంటాయి. అయితే ఇందులో ఓ వ్యక్తి ఎవరో వరుస మర్దర్లు చేయడం చూసి దాన్ని ఎలా ఛేదించాడు అనేది కొత్తగా చూపించారు. ఫస్ హాఫ్ అంతా అర్విన్ – నేహా ప్రేమ కథతో నడిపించి ఇంటర్వెల్ ముందు ఓ అమ్మాయి హత్యలు చేయడం చూపించి అసలు ఆ అమ్మాయే చనిపోయింది అని పోలీసులతో చెప్పి ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ ఇచ్చారు. దీంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు ఆ అమ్మాయి ఎవరు, ఈ మర్దర్లు ఏంటి అని హీరో ఛేదించడం ఆసక్తిగా చూపించారు.
ప్రీ క్లైమాక్స్ నుంచి కథని మరో వైపు తీసుకెళ్లి ఎవరూ ఊహించని కథని చూపించాడు దర్శకుడు. సాధారణంగా వరుస మర్దర్లు అంటే ఏదో ఒకటి గెస్ చేసే ప్రేక్షకులకు ఈ సినిమాలో అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రీ క్లైమాక్స్ వచ్చే వరకు ఎవరూ ఊహించలేరు. అయితే ఈ మర్దర్లకు కారణం, ఆ అమ్మాయి చనిపోయింది అనేదానికి ఇచ్చే క్లారిఫికేషన్ బాగుంది. సాధారణ థ్రిల్లర్ కాకుండా ఓ మంచి మెసేజ్ తో ఈ సినిమాని ఆసక్తిగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఫీల్ వచ్చేలా బాగా తెరకెక్కించారు. ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ లో కచ్చితంగా థ్రిల్ అవుతారు. ఇక క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ కి కూడా లీడ్ ఇవ్వడం గమనార్హం.
నటీనటుల విషయానికొస్తే.. రామ్ కార్తీక్ ఆ మర్దర్లు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అని కనుక్కునే పాత్రలో మెప్పించాడు. హీరోయిన్ కశ్వి మాత్రం అందాల ఆరబోత బాగానే చేసి అలరించింది. జబర్దస్త్ ఫణి, హీరో ఫ్రెండ్ పాత్రలో చేసిన వ్యక్తి బాగానే నవ్వించారు. ఇక మర్దర్లు చేసే అమ్మాయి పాత్రలో నక్షత్ర నైనా అదరగొట్టింది అని చెప్పొచ్చు. సమ్మెట గాంధీ, దయానంద్ రెడ్డి, నాగ మహేష్, చిత్రం శీను.. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. హారర్ సినిమాలో ఎవరైనా భయపెడతారు కానీ థ్రిల్లర్ సినిమాలో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకులని భయపెట్టాడు సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం ఇంకాస్త బెటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎడిటింగ్ మాత్రం ఎక్కడా ల్యాగ్ లేకుండా పక్కాగా ఉంది. ఒక థ్రిల్లర్ సబ్జెక్టుని మెసేజ్ తో ఊహించని క్లైమాక్స్ తో చెప్పడంలో దర్శకుడు మనోజ్ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా వీక్షణం సినిమా వరుస హత్యలు చేసే అమ్మాయిని హీరో ఎలా పట్టుకున్నాడు అని మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకులని భయపెట్టి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి కలిగేలా చేసి అక్కడక్కడా నవ్వించారు కూడా. థ్రిల్లర్ సినిమాలు ఇష్టం ఉన్నవాళ్లు థియేటర్ కి వెళ్లి మరీ చూడండి. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.