Love Reddy : ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఆసక్తికర టైటిల్‌తో ఎమోషనల్ లవ్ స్టోరీ..

పూర్తిగా లవ్ స్టోరీ మీద వచ్చిన సినిమా లవ్ రెడ్డి.

Love Reddy : ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఆసక్తికర టైటిల్‌తో ఎమోషనల్ లవ్ స్టోరీ..

Anjan Ramachendra Love Reddy Movie Review and Rating Here

Updated On : October 17, 2024 / 6:22 PM IST

Love Reddy Movie Review : అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ రెడ్డి’. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాణంలో స్మరణ్ రెడ్డి దర్శకత్వంలో ఈ లవ్ రెడ్డి సినిమా తెరకెక్కింది. ఓ రియల్ సంఘటనతో ఈ సినిమా తీశామని మూవీ యూనిట్ తెలిపారు. టైటిల్ తో ఆసక్తి నెలకొల్పిన లవ్ రెడ్డి సినిమా రేపు అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు.

కథ విషయానికొస్తే.. ఈ కథ కర్ణాటక – ఆంధ్ర బోర్డర్ లోని ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర) బట్టలకు సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉంటాడు. 30 ఏళ్ళు వచ్చినా అతనికి ఇంకా పెళ్లి అవ్వదు. ఇంట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా నారాయణ రెడ్డికి నచ్చవు. అతని తమ్ముడు(గణేష్)అన్నకి పెళ్లి అయితే గాని తన ప్రేమ పెళ్లి అవ్వదని అన్నమీద కోపంగా ఉంటాడు. ఈ క్రమంలో నారాయణ రెడ్డి ఓ సారి బస్సులో దివ్య(శ్రావణి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె మైకంలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఓ పెళ్లిచూపులు తీసుకెళ్తే అక్కడ స్వీటీ(జ్యోతి) అనే అమ్మాయిలో దివ్యని చూసి ఓకే చెప్తాడు. కానీ ఆ తర్వాత ఆమె దివ్య ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆమెని దూరం పెడుతూ దివ్యకు తన ప్రేమ గురించి చెప్పకుండా దగ్గరవుదామని ప్రయత్నిస్తుంటాడు నారాయణరెడ్డి. ఓ రోజు దివ్య నాన్న గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని వేరేవాళ్లకు చెప్తుంటే విని ఇంట్లో తెలియకుండా 15 లక్షలు గవర్నమెంట్ జాబ్ కోసం లంచం ఇస్తాడు. కానీ ఆ లంచం తీసుకున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుంటారు.

మరి నారాయణరెడ్డికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అసలు నారాయణరెడ్డి దివ్యకు ప్రపోజ్ చేశాడా? దివ్య నాన్న వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాడా? స్వీటీ సంగతి ఏమైంది? తన పెళ్లి కోసం నారాయణ రెడ్డి తమ్ముడు ఏం చేసాడు అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Soniya : బిగ్ బాస్ సోనియా పెళ్లి.. కాబోయే వరుడు ఎవరంటే..? మూడేళ్ళుగా ప్రేమ.. పెళ్ళికి ముందే మాల్దీవ్స్‌కి..

సినిమా విశ్లేషణ.. ముద్దులు లేకుండా, వేరే కథలు మిక్స్ అవ్వకుండా ఇటీవల పూర్తిగా ఒక లవ్ స్టోరీ మీద సినిమాలు రావట్లేదు. ఇలాంటి సమయంలో పూర్తిగా లవ్ స్టోరీ మీద వచ్చిన సినిమా లవ్ రెడ్డి. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి పెంచి సినిమాకు రప్పించేలా చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో గురించి, హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, పెళ్లి సంబంధాలు ఇలా కామెడీ, లవ్ తో సాగుతుంది. ఇంటర్వెల్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్, చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని మెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఎవ్వరూ ఊహించలేరు. క్లైమాక్స్ కి ప్రేక్షకులు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు. అయితే ఇలాంటి ప్రేమ కథలు ఓ పదేళ్ల క్రితం ఎక్కువగా వచ్చేవి. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ స్టైల్ ప్రేమ కథ కనిపించింది.

విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తీసుకొని ప్రేమ కథను బాగా రాసుకున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో కాసేపు సాగదీసినట్టు అనిపించి ఏంటి ఇలా రాసుకున్నారు అనుకునేలోపు దానికి సరైన ఎండింగ్ ఇచ్చి వావ్ అనిపించారు. సింపుల్ స్క్రీన్ ప్లేతో ఒక మాములు లవ్ స్టోరీని అందంగా చూపించారు లవ్ రెడ్డి. ఇక టైటిల్ జస్టిఫికేషన్ సినిమా మొదట్లోనే ఇచ్చేస్తారు. అయితే ఈ సినిమాలో కర్ణాటక – ఆంధ్ర బోర్డర్ కావడంతో పాత్రలన్నీ మాట్లాడే భాష తెలుగు, కన్నడ, సీమ యాస మిక్స్ చేసి ఉండటంతో నార్మల్ ఆడియన్స్ కి కొన్ని కొన్ని డైలాగ్స్ అర్ధం కాకపోవచ్చు.

Anjan Ramachendra Love Reddy Movie Review and Rating Here

నటీనటుల విషయానికొస్తే.. పలు షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించిన అంజన్ రామచంద్ర ఈ సినిమాలో నారాయణ రెడ్డి పాత్రలో హీరోగా మొదటిసారి అయినా మెప్పించాడు. శ్రావణి తెలుగమ్మాయి కావడం, సినిమా అంతా చీరల్లో కనిపించి మంచి హోమ్లీ లుక్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. తన నటనతో కూడా ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా దివ్య నాన్న పాత్రలో నటించిన కన్నడ నటుడు NT రామస్వామి మాత్రం అదరగొట్టేసాడు. అయన నటన చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. క్యారెక్టర్ పరంగా తిట్టుకున్నా నటన పరంగా మెచ్చుకుంటారు. తమ్ముడి పాత్రలో నటించిన గణేష్ కూడా మెప్పించారు. స్వీటీ పాత్రలో జ్యోతి నవ్వించింది. రవి కాలబ్రహ్మ, తిలక్.. మిగిలిన నటీనటులు మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడం, కొన్ని సీన్స్ లో వర్షం వాడటంతో విజువల్స్ చాలా అందంగా చూపించారు. ఇక ఫీల్ గుడ్ సాంగ్స్ వినడానికి, చూడటానికి చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. రెగ్యులర్ లవ్ స్టోరీ అయినా దాన్ని కొత్తగా ప్రజెంట్ చేసి ప్రేక్షకులని మెప్పించాడు దర్శకుడు స్మరణ్ రెడ్డి. టేకింగ్ విషయంలో కూడా ఎక్కడా కొత్త దర్శకుడు అనే భావం రాకుండా చక్కగా ఆతెరకెక్కించాడు. ఇక నిర్మాణ పరంగా దాదాపు ఓ పదిమంది కలిసి ఈ సినిమాకి బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా లవ్ రెడ్డి సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ ఫీల్ గుడ్ ప్రేమ కథ ఎమోషనల్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.