ఆమె ఇప్పుడు బిక్షగత్తె కాదు.. లక్షాధికారి: ఫస్ట్ పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే?

  • Published By: vamsi ,Published On : August 26, 2019 / 08:26 AM IST
ఆమె ఇప్పుడు బిక్షగత్తె కాదు.. లక్షాధికారి: ఫస్ట్ పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే?

Updated On : August 26, 2019 / 8:26 AM IST

దేవుడు సల్లంగ చూడాలే కానీ బికారి లక్షాధికారిగా ఒక్క రోజులో మారిపోతారు. రాత్రికి రాత్రే రాజులైపోతారు. అటువంటి అదృష్టమే రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ జీవనం సాగించే రేణు మండల్ జీవితాన్ని మార్చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలోని రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో బిక్షం ఎత్తుకుని జీవిస్తూ ఉండే రేణు మండల్ అనే యాచకురాలు జీవితం ఇప్పుడు మారిపోయింది.

లతా మంగేష్కర్ ఆలపించిన ‘‘ఏక్ ప్యార్ కా నగ్‌మా హే’’ పాటను పాడడంతో ఆమె వీడియో వైరల్‌గా అవగా.. ఆమె అద్భుతమైన గాత్రానికి బాలీవుడ్ ఫిదా అయిపోయింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయిన ఆమెకు బాలీవుడ్ గాయకుడు, నటుడు హిమేష్ రెష్మియా తన అల్బంలో పాడే అవకాశం ఇచ్చాడు.

హిమేష్ రెష్మియా రూపొందిస్తున్న ‘తేరి మేరీ కహానీ’ ఆల్బమ్‌లో ఓ పాట పాడే అవకాశాన్ని రేణూకు ఇచ్చాడు. ఓ రియాల్టీ షోలో రేణూని కలిసిన హిమేష్..  త్వరలో రానున్న నా సినిమా ద్వారా ఆమె పాటను ప్రపంచానికి పరిచయం చేస్తా అంటూ వెల్లడించాడు. చెప్పినట్లే తన సినిమాలో థేరీ, మేరీ అనే పాటను పాడించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కోట్లాది మంది చూసి ఆమెను అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం రేణూ మండల్ ను తమ కోసం సినిమాల్లో పాడమని అడుగుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు భారీగా రెమ్యునిరేషన్ కూడా  ఆఫర్ చేస్తున్నారు. అయితే ఆమె పాడిన ఫస్ట్ పాటకు హిమేష్ రేష్మియా రూ. 7 లక్షలు ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఆమె డబ్బు వద్దు అని చెప్పినప్పటికీ హిమేష్ ఆమెకు బలవంతంగా డబ్బులు ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా చెప్పింది.