Pranayagodari : ‘ప్రణయగోదారి’ మూవీ రివ్యూ.. గోదారి గొట్టున ప్రేమకథ..

ప్రణయగోదారి సినిమా ఇటీవల డిసెంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

Pranayagodari : ‘ప్రణయగోదారి’ మూవీ రివ్యూ.. గోదారి గొట్టున ప్రేమకథ..

Sai Kumar Pranayagodari Movie Review and Rating

Updated On : December 15, 2024 / 11:35 AM IST

Pranayagodari Movie Review : సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ప్రణయగోదారి’. సాయి కుమార్, ఉషశ్రీ, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వి.. ముఖ్య పాత్రలు పోషించారు. పిఎల్‌వి క్రియేషన్స్‌ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. ప్రణయగోదారి సినిమా ఇటీవల డిసెంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. గోదావరి దగ్గర ఉండే ఓ ఊరిలో పెదకాపు(సాయి కుమార్) బాగా డబ్బున్న ఆసామి. ఆ ఊరికే కాక చుట్టూ పక్క ఊర్లకు కూడా ఆయనే పెద్ద. పెదకాపు చెప్పిందే ఆ ఊళ్ళల్లో వేదం. పెదకాపు చెల్లి ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కాని కొన్నాళ్ళకు భర్త చనిపోవడంతో తన కొడుకు శ్రీను(సదన్ హాసన్)తో కలిసి మళ్ళీ అన్నయ్య పెదకాపు దగ్గరికి వస్తుంది. పెదకాపు తన కూతురు లలిత(ఉషశ్రీ)ని మేనల్లుడు శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ శ్రీను ఓ జాలరి ఇంటి అమ్మాయి అయిన గొయ్య లక్ష్మిని ఇష్టపడతాడు. వీరిద్దరూ గోదారి గట్టు మీద ప్రేమించుకుంటూ ఉంటారు. వీళ్లకు గోచి గాడు(సునీల్) సపోర్ట్ చేస్తూ ఉంటాడు.

శ్రీను – గొయ్య లక్ష్మి ప్రేమ విషయం పెదకాపుకు తెలుస్తుంది. మరి పెదకాపు వీళ్ళను ఏం చేసాడు? శ్రీనుకి ఎవరితో పెళ్లి జరుగుతుంది? పెదకాపుకు ఊళ్ళో దత్తుడు(30 ఇయర్స్ పృద్వి)తో విబేధాలు ఏంటి? శ్రీను – గొయ్య లక్ష్మి ప్రేమ నిలబడుతుందా? వారి ప్రేమ కోసం గోచిగాడు ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Pushpa 3 : పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ.. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న

సినిమా విశ్లేషణ.. పరువుహత్యలు, పునర్జన్మ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ ప్రణయగోదారి కూడా అదే కోవకి చెందింది. ఈ సినిమా మెయిన్ పాయింట్ చూస్తే నాగార్జున జానకి రాముడు సినిమా గుర్తొస్తుంది. పునర్జన్మ నేపథ్యంలో ఫస్ట్ హాఫ్ రొటీన్ గా మొదలయినా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన తర్వాత సినిమా ఆసక్తికరంగా మారుతుంది.

శ్రీను – గొయ్య లక్ష్మి ప్రేమ కథని బాగానే రాసుకున్నారు. గోదారి గట్టు మీద ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రేమ కథ. వాళ్ళ మధ్యలో గోచిగాడు అప్పుడప్పుడు నవ్వులు పూయిస్తాడు. ఓ రొమాంటిక్ సాంగ్ కూడా మెప్పిస్తుంది. హీరో – హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా రాసుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వీరి ప్రేమ పెదకాపుకు తెలిసిన దగ్గర్నుంచి ఏమవుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. గోచిగాడు పాత్ర ఇచ్చే ఓ ట్విస్ట్, చివర్లో ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అవుతాయి. క్లైమాక్స్ సాయి కుమార్ బాగానే నడిపించారు.

Sai Kumar Pranayagodari Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్.. సదన్ మెయిన్ లీడ్ పాత్రలో మెప్పించాడు. కొత్త అమ్మాయి ప్రియాంక ప్రసాద్ గొయ్య లక్ష్మి పాత్రలో ఆ వేషభాషలలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. గోచిగాడు పాత్రలో సునీల్ రావినూతల అక్కడక్కడా నవ్విస్తూనే చివర్లో కాస్త ఎమోషనల్ చేస్తాడు. ఇక సినిమాకు సాయి కుమార్ పాత్ర హైలెట్. ఊరి పెద్దగా పవర్ ఫుల్ పాత్రలో అదరగొట్టేసాడు. ఉషశ్రీ, 30 ఇయర్స్ పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, గోదావరి చుట్టూ ప్రకృతి అందాలను బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సాంగ్స్ మాత్రం కొత్తగా బాగున్నాయి. కథ పాతదే అయినా స్క్రీన్ ప్లే ఇంకొంచెం బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా విగ్నేష్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ప్రణయగోదారి’ సినిమా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి పరువు హత్యలు, పునర్జన్మ నేపథ్యాలు జత చేసి గోదావరి గట్టు మీద కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.