బాగా నవ్వించేస్తాడమ్మా..: సరిలేరు నీకెవ్వరు..  ట్విట్టర్ రివ్యూ!

  • Publish Date - January 11, 2020 / 01:37 AM IST

‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సంక్రాంతికి సందడి చేసేందుకు వచ్చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనీల్ రావిపూడి దర్శకరత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యమైన పాత్రలో దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శనివారం (11 జనవరి 2020) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే అమెరికాలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక షోలు పడ్డాయి. 

ఇప్పటికే సినిమాను చూసిన కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తుండగా.. పొంగల్ హిట్టు బొమ్మ అని మరికొందరు చెబుతున్నారు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయిందని కొందరూ.. దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే సూపర్ అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్‌కి ఇది ఫుల్స్ మీల్స్ అని మాత్రం ఎక్కువ మంది అంటున్నారు. 

ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా కూడా సినిమా గురించి పాజిటివ్ గా ట్వీట్ చేశారు. సినిమా విడుదలైన ప్రతి చోట నుంచి యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ అని అంటున్నారని ఆయన వెల్లడించారు.

ఇక మరొక ట్విట్టర్ ట్వీట్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ ఓకే.. ఇంటర్వెట్ బ్లాక్ అదిరింది.. సెకెండాఫ్ సాగదీశాడు.. స్లోగా ఉంది. క్లైమాక్స్ వీక్‌గా ఉంది. మైండ్ బ్లాక్ సాంగ్ మంటలు రేపింది. హీరోయిన్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు.. ఓవరాల్ గా బిలో యావరేజ్ మూవీ. అని చెప్పారు. 

ఇంకొక ట్విట్టర్ వ్యూవర్ ప్రకారం.. క్లైమాక్స్ పెద్దగా లేదు.. స్లో చెయ్యడం.. హై పిచ్ లోకి తీసుకుని వెళ్లడం.. ఫ్యాన్స్ కి కావల్సిన స్టఫ్ ఉంది. కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుంది అనిపిస్తుంది కానీ అంతకు మించి మాత్రం సినిమా లేదు.

మరొక ట్విట్టర్ రివ్యూ ప్రకారం.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ఇది. ఫస్టాఫ్‌లో ట్రైన్ ఎపిసోడ్ బాగా నవ్విస్తుందట. ఈ ఎపిసోడ్‌లో మహేష్ బాబు యాక్షన్ చాలా ఎనర్జిటిక్‌గా ఉందంటున్నారు. ప్రకాష్ రాజ్ ఎంట్రీ సీన్ అయితే నాన్ స్టాప్ కామెడీ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఫస్టాఫ్‌లో ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ మొత్తం చూపించేశారట. ఇక సినిమాకు కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని టాక్. ‘ఒక్కడు’ రేంజ్‌లో ఉండట.

అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదించిందని టాక్. చాలా సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయట. అంతేకాకుండా కామెడీని బలవంతంగా రుద్దినట్టు ఉందని అంటున్నారు. ప్రీక్లైమాక్స్‌లో వేగం పెరిగినట్టు అనిపించినా క్లైమాక్స్ చాలా చప్పగా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. కథ కూడా ఏమీలేదని చెబుతున్నారు. కామెడీ, యాక్షన్ సీన్స్‌తో సినిమాను నడిపించేశారని టాక్. విజయశాంతి నటన అద్భుతంగా ఉన్నా రష్మిక మందన నటన కాస్త అతి అనిపిస్తుందని కొంత మంది అభిప్రాయం. మొత్తంగా చూసుకుంటే ఒక మంచి మాస్ ఎంటర్‌టైనర్‌ను చూపిన ఫీలింగ్ అయితే కలుగుతుందని అంటున్నారు. మహేష్ ఫ్యాన్స్‌కి అయితే విందు భోజనం లాంటి సినిమా అట.

సినిమాలో అనిల్ రావిపూడి రాసిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మహేష్ డ్యాన్స్. చాలా కొత్తగా ఇరగదీశారట. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్‌లో తన స్టెప్పులతో అదరగొట్టారట. దేవీశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ. ఏది ఏమైనా సినిమా మొత్తం బాగా నవ్వించేశాడమ్మా అని అంటున్నారు.