Nari Nari Naduma Murari : ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ.. పడీ పడీ నవ్వుకోవాల్సిందే.. కొత్త పాయింట్ తో భలే ఉంది..
పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఫుల్ గా నవ్వుకోచ్చు. ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు ఇది కూడా కలిసి వచ్చే అంశం. (Nari Nari Naduma Murari)
Nari Nari Naduma Murari Movie Review
Nari Nari Naduma Murari Review : శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్ నిర్మాణంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నారీ నారీ నడుమ మురారి సినిమా నేడు జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది.(Nari Nari Naduma Murari Review)
కథ విషయానికొస్తే..
గౌతమ్(శర్వానంద్) నిత్య(సాక్షి వైద్య) ప్రేమించుకుంటారు. పెళ్లి గురించి మాట్లాడటానికి వెళ్తే వీళ్ళ లవ్ స్టోరీ అంతా విని మొదట నో చెప్తాడు నిత్య తండ్రి(సంపత్). కానీ కూతురి బాధ చూసి ఓకే చెప్తాడు. 60 ఏళ్ళ గౌతమ్ తండ్రి కార్తీక్(నరేష్) 25 ఏళ్ళ అమ్మాయి(సిరి హనుమంత్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్ళి గౌతమ్ దగ్గరుండి జరిపిస్తాడు. ఇది నచ్చని నిత్య తండ్రి ఇదే సాకు చూపించి రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే ఓకే అని కండిషన్ పెడతాడు. అయితే గౌతమ్ కాలేజీ రోజుల్లో దియా(సంయుక్త మీనన్)ని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ తర్వాత వీళ్లిద్దరు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు..
దియాని పెళ్లి చేసుకున్న రిజిస్టర్ ఆఫీస్ లో అదే ఆఫీసర్(సునీల్) ముందు మళ్ళీ నిత్యతో పెళ్లి అని తెలిసి, ఆ ఆఫీసర్ గౌతమ్ ని గుర్తుపట్టడంతో షాక్ అవుతాడు. దియా వచ్చి డైవర్స్ ఇస్తే తప్ప ఈ పెళ్లి జరగదని లేకపోతే ఈ విషయం నిత్యకు చెప్పేస్తానని ఆఫీసర్ బెదిరిస్తాడు. మరి దియా ఎక్కడ ఉంది? గౌతమ్ – నిత్య పెళ్లి జరుగుతుందా? దియా గౌతమ్ లైఫ్ లోకి మళ్ళీ ఎలా వస్తుంది? 60 ఏళ్ళ వయసులో గౌతమ్ తండ్రి కథేంటి? దియా – గౌతమ్ కాలేజీ ప్రేమకథ ఏంటి? వాళ్ళెందుకు విడిపోయారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Anaganaga Oka Raju Review : ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ.. సంక్రాంతి అల్లుడు వచ్చేసాడు..
సినిమా విశ్లేషణ..
నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్, పండక్కి రావడం, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే కాన్సెప్ట్, సూపర్ హిట్ సామజవరగమన డైరెక్టర్ సినిమా కావడం, ట్రైలర్ కూడా బాగుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఫస్ట్ హాఫ్ అంతా గౌతమ్ – నిత్య లవ్ స్టోరీ, దియా – గౌతమ్ లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లతో, కార్తీక్ లవ్ స్టోరీతో కామెడీతో పాటు ప్రేమ కథలతో సాగుతుంది. ఇంటర్వెల్ కి దియా ఎంట్రీతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓ పక్కన దియా మరో పక్కన నిత్య మధ్యలో గౌతమ్ నలిగిపోయే కథనంతో ఫుల్ గా నవ్విస్తారు. ఈ మధ్యలో గౌతమ్ తండ్రి కార్తీక్ ప్రేమకథ, ఆయన భార్య ప్రగ్నెంట్ అవడం, దియా విషయం నిత్య తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడటానికి వీళ్ళు పడే బాధలతో హిలేరియస్ కామెడీ వర్కౌట్ చేసి ఫుల్ గా నవ్విస్తారు. క్లైమాక్స్ లో చిన్న ఎమోషన్ పండించారు.
పెళ్లి గురించి కొన్ని డైలాగ్స్ తో ఎమోషన్ ని నడిపించారు. చివర్లో శ్రీవిష్ణు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సినిమాకి మంచి ఎండింగ్ ఇస్తాడు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు సామజవరగమన సినిమాతో ఎలా నవ్వించాడో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే కామెడీ, నరేష్ ని వాడుకొని ఒక కొత్త పాయింట్ తో ఫుల్ గా ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. కాలేజీలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఏమి తెలియనట్టు విడిపోయి, ఆ రిజిస్టార్ మ్యారేజ్ ఇప్పుడు రియల్ పెళ్లి చేసుకోవడానికి అడ్డంకిగా మారితే ఆ అమ్మాయి ఎలా వచ్చింది, ఏం చేసింది అనే కొత్త పాయింట్ తో హిలేరియస్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. మొత్తానికి పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఫుల్ గా నవ్వుకోచ్చు. ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు ఇది కూడా కలిసి వచ్చే అంశం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
శర్వానంద్ కాస్త స్లిమ్ అయి స్టైలిష్ గా కొత్త లుక్స్ లో కనిపిస్తూ పెళ్లి కోసం నలిగిపోయే పాత్రలో బాగా నటించి నవ్వించాడు. సాక్షి వైద్య లవ్ స్టోరీలో క్యూట్ గా సెట్ అయింది. సంయుక్త మీనన్ ప్రేమ కథతో పాటు, తర్వాత రీ ఎంట్రీ పాత్రతో రెండు వేరియేషన్స్ లో బాగా నటించింది. ఇక ఈ సినిమాకు సీనియర్ నటుడు నరేష్ హైలెట్ గా నిలిచి నవ్వించారు. నరేష్ చేసిన కొన్ని సీన్స్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. ఆయన తప్ప ఈ పాత్రని ఎవరూ ఆ రేంజ్ లో పండించలేరు.
సిరి హనుమంత్ కూడా ఇలాంటి పాత్ర ఎంచుకొని చేసిందంటే గ్రేట్ అని చెప్పాలి. తన పాత్రలో ఒదిగిపోయింది. సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్ వారి పాత్రల్లో ఫుల్ గా నవ్వించారు. సంపత్, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, గెటప్ శ్రీను.. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. హీరో శ్రీవిష్ణు గెస్ట్ అప్పీరెన్స్ పాత్రలో అలరించాడు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా కలర్ ఫుల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. కామెడీ పంచ్ లు ఎలివేట్ అయ్యేలా మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా, ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్స్ లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసారు. ఒక కొత్త పాయింట్ తీసుకొని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని ఫుల్ కామెడీతో రాసుకొని తెరకెక్కించాడు రామ్ అబ్బరాజు. డైలాగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పేలాయి. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా నారీ నారీ నడుమ మురారి సినిమా ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించిన యూత్ ఫుల్ సినిమా. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
