Viswam : ‘విశ్వం’ మూవీ రివ్యూ.. ఆరేళ్ళ తర్వాత శ్రీను వైట్ల రీ ఎంట్రీ సినిమా ఎలా ఉంది..?
శ్రీను వైట్ల సినిమాలంటేనే కామెడీకి మార్క్. అలాంటి కామెడీని మరోసారి విశ్వం సినిమాలో బాగానే వర్కౌట్ చేసాడు.

Sreenu Vaitla Gopichand Viswam Movie Review and Rating
Viswam Movie Review : ఒకప్పుడు తన కామెడీతో సూపర్ హిట్లు కొట్టిన శ్రీను వైట్ల ఆ తర్వాత ఫ్లాప్స్ చూడటంతో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్ గా విశ్వం సినిమా తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్స్ పై టిజి విశ్వప్రసాద్, దోనేపూడి చక్రపాణి ఈ సినిమాని నిర్మించారు. విశ్వం సినిమా నేడు అక్టోబర్ 11న థియేటర్స్ లో రిలీజయింది. శ్రీను వైట్ల ఆరేళ్ళ తర్వాత రావడం, ఈ సినిమాలో కూడా వెంకీ లాంటి ట్రైన్ కామెడీ సీన్ ఉండటంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి.
కథ విషయానికొస్తే.. ఓ టెర్రరిస్ట్ ఇండియాలో కొంతమందితో కలిసి బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఈ విషయం తెలిసిన ఓ మినిస్టర్ ని చంపేస్తుండగా దర్శన అనే పాప చూస్తుంది. దీంతో ఆ దర్శనని చంపాలని టెర్రరిస్ట్, అతని మనుషులు వెతుకుతూ ఉంటారు. ఓ రోజు గోపి(గోపీచంద్) పాపని కాపాడి తన ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాడు. ఆ ఫ్యామిలిలో సమైరా(కావ్య థాపర్)తో గతంలో ప్రేమ అని, ఆమె కోసమే వచ్చాను అని చెప్పి అందరితో క్లోజ్ అవుతాడు. ఆ పాపని ప్రతిసారి కాపాడుతూ వస్తాడు గోపి. పాప కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఓ సీక్రెట్ ప్లేస్ లో పాపని, పాప తాతయ్యని దాస్తారు. అయినా టెర్రరిస్ట్ మనుషులు వస్తారు.
పాప కోసం ఇంత చేస్తున్నావేంటి అని సమైరా, ఫ్యామిలీ గోపిని ప్రశ్నిస్తారు. మరి గోపి ఆ పాపని కాపాడాడా? అసలు గోపి ఎందుకు పాపని కాపాడుతున్నాడు? గోపి గతం ఏంటి? సమైరాతో గోపి పరిచయం, ప్రేమ ఎలా అయింది? ఆ టెర్రరిస్ట్ లను గోపి ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Maa Nanna Super Hero : ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ రివ్యూ.. ఇద్దరు తండ్రులతో కొడుకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
సినిమా విశ్లేషణ.. హీరో తన ఒరిజినల్ జీవితాన్ని దాచి ఏదో ఒక కారణం కోసం, ఎవర్నో కాపాడటం కోసం రావడం గతంలో చాలా సినిమాలో చూసాము. ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ అదే కథ. ఇక బాద్ షా సినిమా స్క్రీన్ ప్లేనే శ్రీను వైట్ల ఇక్కడ వాడాడు. ఫస్ట్ హాఫ్ అంతా గోపి వేరే ఐడెంటిటీతో ఎంటర్ అవ్వడం, జాలి రెడ్డి(పృథ్విరాజ్)ని వాడుకొని అక్కడి ఫ్యామిలీల్లోకి ఎంటర్ అవ్వడం, పాపని కాపాడుతుండటంతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ కి పాపకి ఏమైంది అనే ఆసక్తితో సెకండ్ హాఫ్ కి లీడ్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు గోపి ఎవరు, అతను పాపని ఎందుకు కాపాడుతున్నాడు అని ట్విస్టులు రివీల్ చేస్తూ వెళ్లారు. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది.
అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో ట్రైన్ సీన్స్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీను వైట్ల సినిమాలంటేనే కామెడీకి మార్క్. అలాంటి కామెడీని మరోసారి విశ్వం సినిమాలో బాగానే వర్కౌట్ చేసాడు. కామెడీ బాగా పండి ప్రేక్షకులని నవ్వించినా మిగతా కథ అంతా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రొటీన్ గానే సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు దూకుడు , బాద్ షా సినిమాలు మిక్స్ చేసి చూసినట్టే అనిపిస్తుంది. అయితే పండగ హాలిడేస్ ఉండటంతో కామెడీ, పాప ఎమోషన్ ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయి కలెక్షన్స్ వచ్చే ఛాన్సులు అయితే బాగానే ఉన్నాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. గోపీచంద్ ఎప్పటిలాగే తన బెస్ట్ ఇచ్చారు. సినిమాలో ఫిజికల్ గా కూడా బాగానే కష్టపడ్డాడు. ఇక కావ్య థాపర్ తన అందాల ఆరబోతకే. డ్యాన్సులు, తన అందంతో, అక్కడక్కడా నటనతో మెప్పించింది. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్, నరేష్, పవిత్ర, పృథ్విరాజ్.. పలువురు కమెడియన్స్ బాగానే నవ్వించారు. విలన్ పాత్రలో జిషుసేన్ గుప్తా బాగా నటించాడు. సునీల్, ప్రియా వడ్లమాని, ముకేశ్ రిషి, శ్యామ్.. పలువురు నటీనటులు స్పెషల్ పాత్రల్లో కనిపించి మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు ఒక్కసారి వినడం కూడా కష్టమే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇటలీ, కశ్మీర్, గోవా.. లాంటి ప్రాంతాల్లో మంచి లొకేషన్స్ ని వాడారు. శ్రీనువైట్ల తన మార్క్ కామెడీ చూపించినా రొటీన్ కథ, కథనంతో పర్వాలేదనిపించారు. గ్రాఫిక్స్ వర్క్ చాలా పూర్. నిర్మాణ పరంగా పీపుల్ మీడియా సంస్థ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘విశ్వం’ సినిమా ఓ పాపని కాపాడటానికి హీరో ఎందుకు వచ్చాడు, ఏం చేసాడు అని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.