Maa Nanna Super Hero : ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ రివ్యూ.. ఇద్దరు తండ్రులతో కొడుకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
నాన్న ఎమోషన్ ని మాత్రం బాగా పండించగలిగాడు దర్శకుడు. కుదిరితే నాన్నతో కలిసి చూడండి ఈ సినిమాని.

Sudheer Babu Maa Nanna Super Hero Movie Review and Rating
Maa Nanna Super Hero Movie Review : సుధీర్ బాబు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేసే సుధీర్ బాబు మరోసారి ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు హీరోగా షాయాజీ షిండే, సాయిచంద్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా మా నాన్న సూపర్ హీరో. వి సెల్యులాయిడ్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మాణంలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దసరా సందర్భంగా మా నాన్న సూపర్ హీరో సినిమా నేడు అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. తన భార్య ప్రసవించి చనిపోవడంతో లారీ డ్రైవర్ గా పనిచేసే ప్రకాష్(సాయిచంద్) తన కొడుకు బాగా పెరగాలంటే కొన్ని రోజులు దూరం ఉండాలని జానీని ఓ అనాథ ఆశ్రమంలో వదిలేసి పనికి వెళ్తాడు. ఆ తర్వాత అనుకోకుండా ప్రకాష్ అరెస్ట్ అయి 25 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ క్రమంలో జానీ(సుధీర్ బాబు)ని వ్యారవేత్త అయిన శ్రీనివాస్(షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జానీని దత్తత తీసుకున్న తర్వాత అతనికి వ్యాపారాల్లో నష్టం రావడం, అప్పులు పెరగడంతో జానీ వల్లే తనకు దురదృష్టం అని భావించి కొన్నాళ్ల తర్వాత కొడుకుని పట్టించుకోవడం మానేస్తాడు. అతనిపై కోపం, అసహ్యం చూపిస్తూ ఉంటాడు శ్రీనివాస్. కానీ అనాథాశ్రమంలో ఉండాల్సిన తనని తీసుకొచ్చి మంచి జీవితం ఇచ్చాడని నాన్నే తనకు సూపర్ హీరో అని ఫీల్ అవుతుంటాడు జానీ.
ఓ సమయంలో లోకల్ లీడర్ కి శ్రీనివాస్ కోటి రూపాయలుకట్టాల్సి వస్తుంది శ్రీనివాస్. అదే సమయంలో ప్రకాష్ తన కొడుకుని వెతుక్కుంటూ వస్తాడు. మరి జానీ పెంచిన తండ్రి అప్పులను తీర్చాడా? కన్నతండ్రిని కలుసుకున్నాడా? అసలు ప్రకాష్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Vettaiyan : ‘వేట్టయన్’ మూవీ రివ్యూ.. రొటీన్ కథకు సూపర్ స్టార్ హంగులు..
సినిమా విశ్లేషణ.. ఇది ఒకరకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. కాకపోతే ఇద్దరు తండ్రులు ఒక కొడుకు మధ్య జరిగే ప్రేమ కథ. చిన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో కొడుకుని అనాథాశ్రమంలో వదిలేసి ప్రకాష్ వెళ్లిపోవడంతో మొదలైన సినిమా జానీ, శ్రీనివాస్ కథతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో శ్రీనివాస్ ఎంత చీదరించుకున్నా జానీ మాత్రం తండ్రి కోసం నిలబడుతూ ఉంటాడు. ఇంతలో అసలు తండ్రి ప్రకాష్ తన కొడుకుని వెతుక్కుంటూ వస్తాడు. ఇంటర్వెల్ ఆసక్తిగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో శ్రీనివాస్ కోటి రూపాయలు ఓ లీడర్ కి ఇవ్వాల్సి రావడం, మరో వైపు ప్రకాష్ వద్ద ఓ కోటిన్నర లాటరీ టికెట్ ఉండటం, దాని కోసం కొంతమంది వెంటపడటం, ప్రకాష్ – జానీ ఎలా కలుసుకుంటారు అనే ఉత్కంఠ, జానీ పెంచిన తండ్రిని కాపాడుకున్నాడా అని సాగుతుంది.
సినిమా అంతా ఫాదర్ ఎమోషన్ తోనే సాగుతుంది. మధ్యలో హీరోయిన్ సీన్స్, మరి కొన్ని సీన్స్ అవసరం లేకపోయినా పెట్టారు అనిపిస్తుంది. సినిమా కొంత స్లో నేరేషన్ తో ఉండటంతో అందరికి తొందరగా కనెక్ట్ కాలేకపోవచ్చు. తండ్రి కొడుకులు కలుసుకుంటారా అని క్లైమాక్స్ ఎమోషన్ ని చాలా బాగా రాసుకోవచ్చు కానీ సింపుల్ గా అయిపోయింది అనిపిస్తుంది. అయితే నాన్న ఎమోషన్ ని మాత్రం బాగా పండించగలిగాడు దర్శకుడు. కుదిరితే నాన్నతో కలిసి చూడండి ఈ సినిమాని.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సుధీర్ బాబు మాస్ పాత్రలే కాదు ఇలాంటి ఎమోషనల్ పాత్రలు కూడా చేసి మెప్పించగలడు అని మరోసారి ప్రూవ్ చేసాడు. షాయాజీ షిండే, సాయిచంద్ ఇద్దరూ తండ్రి పాత్రల్లో పోటీ పడి మరీ నటించి ఎమోషన్ ని పండించారు. సినిమా అంతా ముఖ్యంగా ఈ మూడు పాత్రలు మధ్యే నడుస్తుంది. ఆర్న వోహ్రా, రాజు సుందరం, విష్ణు.. మిగిలిన పాత్రలు అందరికి తక్కువ స్కోప్ దక్కినా వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఫ్రెష్ గా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఎమోషన్ సీన్స్ లో BGM బాగా ఎలివేట్ అయింది. పాటలు కూడా బాగున్నాయి. ఓ కొత్త రకం కథని తీసుకొని దానికి అనవసరమైన ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించకుండా సింపుల్ స్క్రీన్ ప్లేతో ఎమోషనల్ గా బాగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి. నిర్మాణ పరంగా కూడా వి సెల్యులాయిడ్స్ బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ఓ కొడుకు.. పెంచిన తండ్రి, దత్తత తండ్రి మధ్య సాగే ఎమోషనల్ డ్రామా మా నాన్న సూపర్ హీరో. కుదిరితే మీ నాన్నతో కలిసి సినిమా చూడండి. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.