ఉదయ్ కిరణ్ బయోపిక్ : స్పందించిన సందీప్ కిషన్
ఉదయ్ కిరణ్ జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు, అందులో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తలపై యంగ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు..

ఉదయ్ కిరణ్ జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు, అందులో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తలపై యంగ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు..
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. సినీ, రాజకీయ మరియు క్రీడారంగానికి చెందిన పలువురి జీవిత కథలు తెరకెక్కుతున్నాయి. తెలుగులో గతకొద్ది రోజులుగా ఓ దివంగత హీరో బయోపిక్ గురించి, యంగ్ హీరో సందీప్ కిషన్ ఆ బయోపిక్‌లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
అర్ధంతరంగా మరణించిన యువ నటుడు ఉదయ్ కిరణ్ జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు, అందులో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా సందీప్ కిషన్ వ్యవహరించనున్నట్టు ఓ పుకారు తెగ షికారు చేస్తోంది. ఈ వార్త వైరల్ కావడంతో తాజాగా సందీప్ కిషన్ స్పందించాడు.
‘ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నేను నటిస్తున్నట్టు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నన్నెవరూ ఇంతవరకు సంప్రదించలేదు. ప్రస్తుతం బయోపిక్‌లు చేసే ఆలోచన నాకు లేదు` అని సందీప్ క్లారిటీ ఇచ్చాడు.. ఇటీవలే ‘తెనాలి రామకృష్ణ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సందీప్ ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అనే స్పోర్ట్ డ్రామాలో నటిస్తున్నాడు..