కంగనా వదలట్లేదు.. తాప్సీ తగ్గట్లేదు.. ఆమె వ్యాఖ్యలు కాంప్లిమెంట్ అంటున్న స్వర భాస్కర్..

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లోని బంధుప్రీతి అంశం తెరమీదికొచ్చింది. బంధుప్రీతి, స్టార్ వారసుల ప్రవర్తనపై బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పట్నుంచో విమర్శలు గుప్పిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎదగకుండా బాలీవుడ్ మాఫియా ఎంత చేయాలో అంత చేసింది. సుశాంత్ నటించిన ‘డ్రైవ్’ సినిమాను నిర్మించిన కరణ్ జోహార్‌కు ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేసే సామర్థ్యం లేదంటే నమ్మనని చెప్పిన కంగనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ తాప్సీ, స్వర భాస్కర్‌లను బి గ్రేడ్ యాక్టర్స్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
దీనిపై తాప్సీ, స్వర ఇద్దరూ స్పందించారు. ‘‘ఎటువంటి సినీ నేపథ్యం లేనటువంటి తాప్సీ, స్వర భాస్కర్ వంటి బీ గ్రేడ్ హీరోయిన్లు బాలీవుడ్‌లో రాణిస్తున్నారు కానీ వారికి అలియా భట్, అనన్య పాండే అంత క్రేజ్ మాత్రం రావడం లేదు ఎందుకని..?’’ అని కంగనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. అయితే తనని బీ గ్రేడ్ హీరోయిన్ అని లెక్కగట్టిన కంగనాకు తాప్సీ గట్టిగానే కౌంటర్ వేసింది. ‘‘ఇటీవల 10, 12 తరగతుల పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత మా ఫలితాలు కూడా వచ్చాయని విన్నాను. ఇప్పుడు వ్యక్తుల విలువను తెలపడానికి గ్రేడ్ల విధానం అధికారికంగా మారిందా? ఇప్పటి వరకు నెంబర్ వన్, నెంబర్ టు అని నెంబర్ విధానంలోనే వ్యక్తుల యొక్క విలువను లెక్కగట్టేవారు కదా..?’’ అని తాప్సీ తన ట్వీట్‌లో పేర్కొంది. దీంతో ఈ భామలిద్దరి మధ్య మాటల యుద్ధం ముదురుతోందని, ఇది ఎంత వరకు దారితీస్తుందో.. చూడాలి అంటూ బాలీవుడ్ వర్గాల వారు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే విషయంపై స్వర భాస్కర్ కూడా స్పందించింది. ‘‘ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి బి గ్రేడ్ హీరోయిన్‌గా ఎదిగానని! అయితే ఆలియా భట్, అనన్య పాండే కంటే మంచి నటి అని కంగనా కామెంట్ చేశారు. దీన్ని నేనొక కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. థాంక్యూ కంగనా’’ అని ట్వీట్ చేసింది స్వర భాస్కర్.