Satya Review : ‘సత్య’ మూవీ రివ్యూ.. క్యూట్ టీనేజీ లవ్ స్టోరీ.. పిల్లల చదువుల కోసం పేరెంట్స్ పడే తపన..

'సత్య' సినిమా ఒక క్యూట్ టీనేజీ లవ్ స్టోరీతో పాటు పేరెంట్స్ పిల్లల చదువు గురించి ఆలోచించే ఎమోషన్ తో చక్కగా తెరకెక్కించారు.

Satya Movie Review : ఇటీవల తమిళ్, మలయాళ భాషల్లో మంచి హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళ్ లో రిలీజ్ అయి హిట్ కొట్టిన రంగోలి సినిమాని తెలుగులో సత్య పేరుతో రిలీజ్ చేశారు. సత్య సినిమా నేడు మే 10న థియేటర్స్ లో రిలీజయింది. హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ.. పలువురు ముఖ్య పాత్రల్లో వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో సత్య సినిమాని సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా మారి రిలీజ్ చేశారు.

కథ విషయానికొస్తే.. సత్య(హమరేష్) గాజువాకలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు. అతని తండ్రి గాంధీ(ఆరుగాలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేయించాలని చాలా కష్టపడి సత్యని ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తాడు. కానీ సత్య అక్కడ ఇమడలేకపోతాడు. సత్య ఆ కాలేజీలో ఓ గ్యాంగ్ తో రోజూ గొడవపడతాడు. సత్యని ఆ కాలేజీలో చిన్నచూపు చూస్తారు తోటి విద్యార్థులు. అలాంటి సమయంలో పార్వతి(ప్రార్థన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పార్వతికి కూడా సత్య అంటే ఇష్టమున్నా చెప్పదు. ఓ కారణంతో పార్వతి సత్యని అందరి ముందు కొడుతుంది. దీంతో సత్య ఆ కాలేజీలో ఉండలేకపోతాడు. కానీ తన చదువు కోసం తన కుటుంబం కష్టం చూసి ఓ నిర్ణయం తీసుకుంటాడు. సత్య తీసుకున్న నిర్ణయం ఏంటి? సత్యని పార్వతి ఎందుకు కొట్టింది? సత్య చదువు కోసం గాంధీ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? సత్య ఆ కార్పొరేట్ కాలేజీలో చదువు కొనసాగించాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : Krishnamma Review : ‘కృష్ణమ్మ’ మూవీ రివ్యూ.. సత్యదేవ్ మరోసారి తన నటనతో అదరగొట్టేసాడుగా..

సినిమా విశ్లేషణ.. స్కూల్, కాలేజీ లవ్ స్టోరీలపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. సత్య కూడా అలాంటి కథే . కానీ దానికి తండ్రి కొడుకుల ఎమోషన్ తో పాటు చదువు గురించి కూడా ఓ మెసేజ్ జోడించి తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో గవర్నమెంట్ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో చూపిస్తూ కథ మొదలుపెట్టి ఆ తర్వాత హీరో ఫ్యామిలీ, కార్పొరేట్ కాలేజీలో హీరోని చదివించడానికి పేరెంట్స్ పడే కష్టాలు, కాలేజీలో క్యూట్ లవ్ స్టోరీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ కొద్దిగా సాగతీతగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీల్లో పిల్లలు సరిగ్గా చదవరేమో అని అప్పులు చేసి మరీ ప్రైవేట్ కాలేజీల్లో పిల్లని చేర్పించే పేరెంట్స్ కష్టాలు బాగా చూపించారు. ఇంటర్ కాలేజీ సీన్స్ కి కచ్చితంగా మన అందరం మన కాలేజీ డేస్ ని గుర్తు చేసుకుంటాము.

నటీనటుల పర్ఫార్మెన్స్ .. సత్య పాత్రలో హమరేష్ మెప్పించాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన స్టూడెంట్ కార్పొరేట్ కాలేజీలో చేరితో చుట్టూ ఉండే పరిస్థితుల్లో హమరేష్ చాలా బాగా నటించాడు. ప్రార్థన సందీప్ క్యూట్ గా కనిపించి అలరించింది. సత్య తండ్రి పాత్రలో ఆడుకలం మరుగదాస్ మంచి ఎమోషన్ తో అదరగొట్టారు. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. తమిళ్ సినిమా అయినా ఎక్కడా అనుమానం రాకుండా తెలుగు డబ్బింగ్ చాలా బాగా చెప్పించారు. తెలుగు డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగున్నా పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. తమిళ్, తెలుగులో క్లైమాక్స్ వేరు వేరుగా చిత్రీకరించడం విశేషం. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా దానికి తగ్గట్టు ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘సత్య’ సినిమా ఒక క్యూట్ టీనేజీ లవ్ స్టోరీతో పాటు పేరెంట్స్ పిల్లల చదువు గురించి ఆలోచించే ఎమోషన్ తో చక్కగా తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లి చూస్తే కచ్చితంగా సత్య నచ్చుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు