Usurae : ‘ఉసురే’ మూవీ రివ్యూ.. తమిళ్ డబ్బింగ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..
తమిళ్ - తెలుగు భాషల్లో ఒకేసారి ఉసురే సినిమాను నేడు ఆగస్టు 1న రిలీజ్ చేసారు.

Usurae Review
Usurae Movie Review : శ్రీకృష్ణ ప్రొడక్షన్స్, బాకీలక్ష్మి టాకీస్ బ్యానర్స్ పై మౌళి M రాధాకృష్ణ నిర్మాణంలో నవీన్ D గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉసురే’. టీజె అరుణాసలం, జనని హీరోహీరోయిన్స్ గా రాశి కీలక పాత్రలో ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది. తెలుగులో డబ్ చేసి తమిళ్ – తెలుగు భాషల్లో ఒకేసారి ఉసురే సినిమాను నేడు ఆగస్టు 1న రిలీజ్ చేసారు.
కథ విషయానికొస్తే.. చిత్తూరు దగ్గర తమిళనాడు – ఆంధ్ర బోర్డర్ లో ఉన్న ఓ గ్రామంలో ఈ కథ జరుగుతుంది. లచ్చి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తన ఊరి కొండ వద్దకు తీసుకొచ్చి, ఈ కొండ చాలా స్పెషల్, ఒకరి ప్రేమకు నిదర్శనం అని తన ఫ్రెండ్ లవ్ స్టోరీ చెప్పడం మొదలుపెడతాడు.
రాఘవ(టీజె అరుణాసలం) ఊళ్ళోనే చిన్న జాబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తో తిరుగుతూ జాలిగా ఉంటాడు. పక్క ఊరి ఎస్టేట్ బాబుతో రాఘవకు గొడవలు ఉంటాయి. రాఘవ ఊళ్లోకి అనసూయ(రాశి), రంజన(జనని) తల్లీకూతుళ్లు కొత్తగా వచ్చి రాఘవ ఇంటి ముందు ఇంట్లో దిగుతారు. రంజన కాలేజీ చదువుకుంటుంది. అనసూయ చాలా సీరియస్ గా ఉంటూ, కోపిష్టిగా ఉంటూ తన కూతురు వైపు ఎవరు చూసినా కొడుతూ, తిడుతూ ఉంటుంది. రాఘవ ఫ్రెండ్ కిరణ్ రంజనని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో రాఘవకి అతని ఫ్రెండ్ కి గొడవ అవుతుంది. దీంతో అతని ఫ్రెండ్ అమ్మాయిలకు దూరంగా ఉండే రాఘవని ఒక్క అమ్మాయిని అయినా పడేసి చూపించు అని సవాలు విసురుతాడు.
అప్పటికే రంజన మీద ఇంట్రెస్ట్ ఉన్న రాఘవ ఆమెని ప్రేమలో పడేసే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. కానీ రంజన అసలు పట్టించుకోదు. కొన్ని సంఘటనలతో వారిద్దరూ కొంత దగ్గరవుతారు. కానీ ఓ గొడవతో రాఘవ ఊరందరి ముందు రంజనకి ప్రపోజ్ చేస్తాడు. దీంతో రంజన తల్లి అనసూయ రాఘవని చెప్పుతో కొట్టి నీలాగా తాగి గొడవలు పడే వాడికి నా కూతురితో ప్రేమ ఏంటి అంటూ నిలదీస్తుంది. మరి రాఘవ – రంజనల ప్రేమ ఫలించిందా? అనసూయ ఎందుకు సీరియస్ గా ఉంటుంది? అసలు అనసూయ – రంజన ఎవరు? రాఘవ మీద కోపంతో ఎస్టేట్ బాబు ఏం చేసాడు? ఆ కొండ స్పెషల్ ఏంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Mahavatar Narsimha : 6 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే.. 800 శాతం లాభాలు..
సినిమా విశ్లేషణ.. ఇదొక లవ్ స్టోరీ. కానీ ఓ 15, 20 ఏళ్ళ క్రితం రావాల్సిన లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా ఊర్లో సీన్స్, ఫ్రెండ్స్ తో రొటీన్ కామెడీ సీన్స్, గొడవలు, హీరో – హీరోయిన్ ల పరిచయం తోనే బాగా సాగదీసారు. అక్కర్లేని సన్నివేశాలు చాలా ఎడిటింగ్ చేసేయొచ్చు. ఇంటర్వెల్ కి మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతుంది? వీళ్ళ ప్రేమ ఫలిస్తుందా అనే ఆసక్తి నెలకొల్పారు. అయితే ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసి రొటీన్ కథతో తీయగా సెకండ్ హాఫ్ మాత్రం బాగానే నడుస్తుంది.
చివర్లో వచ్చే ట్విస్టులు ఎవరూ ఊహించలేరు. రొటీన్ లవ్ స్టోరీకి ఈ ట్విస్ట్ లను ఇచ్చి కొత్త కథగా చెప్పే ప్రయత్నం చేసారు. చివర్లో వచ్చే ట్విస్ట్ తో కథ పూర్తిగా మారిపోతుంది. అలాగే క్లైమాక్స్ లో ఎమోషన్ బాగా రాసుకున్నారు. హీరో – హీరోయిన్స్ మధ్య సన్నివేశాలను ఇంకా బాగా రాసుకునే స్కోప్ ఉన్నా వదిలేసారు. ఫ్రెండ్స్ కామెడీ సీన్స్ అన్ని ఈ సీన్స్ అవసరమా అనిపిస్తాయి. ఏదో నవ్వించడానికి బలవంతంగా ఆ సీన్స్ ని ఇరికించారు. ఈ సినిమాకు శృతి హాసన్, లోకేష్ కానగరాజ్, కమల్ హాసన్ ప్రమోషన్స్ చేయడంతో తమిళ్ లో అయితే కాస్త బజ్ ఏర్పడింది. తెలుగులో మాత్రం సింపుల్ గా రిలీజ్ చేసారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. టీజె అరుణాసలం ఓ విలేజ్ కుర్రాడి పాత్రలో నిజాయితీగా ప్రేమించే వ్యక్తిగా బాగానే నటించాడు. జనని క్యూట్ గా కనిపిస్తూ సింపుల్ లుక్స్ లో పర్వాలేదనిపించింది. సీనియర్ నటి రాశి సీరియస్ పాత్రలో బాగానే నటించింది. మిగిలిన తమిళ నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Supritha – Surekha Vani : తల్లీకూతుళ్ల వరలక్ష్మి వ్రతం.. స్పెషల్ ఫొటోలు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు మాత్రం వినడానికి చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కొన్ని సీన్స్ లో అక్కర్లేకపోయినా ఒకటే మ్యూజిక్ ని రిపీటెడ్ గా వాడారు. రియల్ లొకేషన్స్ లో చేయడంతో విజువల్స్ బాగా చూపించారు. ఎడిటింగ్ లో చాలా సాగదీసిన సీన్స్ అన్ని కట్ చేస్తే బాగుండేది. రొటీన్ పాత లవ్ స్టోరీ కథ కథనం అయినా చివర్లో ఓ కొత్త ట్విస్ట్ ఇవ్వడంతో కాస్త బెటర్ అనిపిస్తుంది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఉసురే’ సినిమా రొటీన్ లవ్ స్టోరీకి సరికొత్త క్లైమాక్స్ ఇచ్చి మెప్పించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.