ఘనంగా డైరెక్టర్స్ డే వేడుకలు.. ఈసారి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో..

ఇలా ఓపెన్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారని, ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను సభ్యుల సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు.

Telugu film directors association: దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు జయంతిని ఈసారి తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించనుంది. దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీని డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి నాలుగుసార్లు డైరెక్టర్స్ డేను సెలబ్రేట్ చేసింది తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్. ఈసారి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే వేడుకలు నిర్వహించబోతున్నట్టు తాజాగా వెల్లడించింది.

ఐదోసారి ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున డైరెక్టర్స్ డే నిర్వహించబోతున్నామని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ తెలిపారు. ఇలా ఓపెన్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారని, ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను సభ్యుల సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు. సంఘ కార్యాలయం నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక చేయూత వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. డైరెక్టర్స్ డేకు దాదాపు 15 వేల మంది వస్తారని భావిస్తున్నామన్నారు. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వీరశంకర్ ఆహ్వానించారు. ప్రోగ్రామ్ నిర్వహణకు కల్చరర్ కమిటీ ఏర్పాటు చేశామని.. ఇందులో దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారని తెలిపారు.

ఈసారి డైరెక్టర్స్ డేను గ్రాండ్ గా నిర్వహించేందుకు తామంతా ప్రయత్నిస్తున్నామని దర్శకులు రాజా వన్నెంరెడ్డి, నందిని రెడ్డి, సాయి రాజేశ్, శివ నిర్వాణ, వశిష్ట అన్నారు. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఇదొక బెంచ్ మార్క్ ఈవెంట్ కాబోతోందని, తమకు దాసరి గారి ఆశీస్సులు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్స్ అందరూ సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారని వెల్లడించారు.

Also Read: అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దేవర.. హిందీ థియేట్రికల్ రైట్స్‌ని దక్కించుకున్న బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ..