Sagiletikatha : సగిలేటి కథ మూవీ రివ్యూ.. ఓ పక్క ఎంటర్టైన్మెంట్, మరో పక్క ప్రేమలు, పగలు..
రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథకి ఎంటర్టైన్మెంట్, ప్రేమ, పగ జత చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా 'సగిలేటి కథ'. ఈ మూవీ రివ్యూ ఎలా ఉంది..?

Telugu new movie Sagiletikatha complete review
Sagiletikatha Review : ప్రముఖ యూట్యూబర్ రవి మహాదాస్యం (Ravi Mahadasyam), విషిక (Vishika) జంటగా తెరకెక్కిన సినిమా ‘సగిలేటి కథ (Sagiletikatha)’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాని రాజశేఖర్ సుద్మూన్ తెరకెక్కించగా హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు.
కథ విషయానికొస్తే.. ఒక రాయలసీమ పల్లెటూరు, ఊర్లో జనాలు. కువైట్ నుంచి తిరిగొచ్చిన కుమార్(రవి) ఊళ్ళో కృష్ణ కుమారి(విషిక)ని చూసి ఇష్టపడతాడు. ఓ పక్క వీరి ప్రేమ సాగుతుండగా ఊళ్ళో కష్టాలు తీరడానికి గంగానమ్మ జాతర చేయాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. కుమార్, కృష్ణ కుమారి నాన్నలు ఊరి పెద్దలుగా గంగానమ్మ జాతర జరిపించాలి. కానీ సమయానికి హీరోయిన్ వాళ్ళ నాన్న(దొరస్వామి) రాకపోవడంతో హీరో వల్ల నాన్న(చౌడప్ప) జాతర మొదలుపెడతాడు. లేట్ గా వచ్చి ఇది చూసిన దొరస్వామి చౌడప్పతో తగువు పెట్టుకొని అప్పటిదాకా మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవ అవ్వడంతో చౌడప్ప దొరస్వామిని కత్తితో నరికి చంపుతాడు.
క్షణికావేశానికి ఒక ప్రాణం బలయిన సమయంలో కథపై ఆసక్తి పెంచి విరామం ఇస్తారు. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వాళ్ళ నాన్నని చౌడప్ప చంపడంతో వీళ్ళ ప్రేమ ఏమైంది? ఊరి పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ మధ్యలో సినిమా అంతా సాగే ఓ రోషం రాజు క్యారెక్టర్ కథేంటి అనేది తెరపై చూడాల్సిందే.
Also read : ఆస్కార్‌కి ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా.. శాశ్వత స్థానం దక్కించుకుంది..
సినిమా విశ్లేషణ..
సినిమా ప్రారంభమే హీరో నానమ్మ చనిపోతే హీరో ప్రేమలో పడే సన్నివేశాలు చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే చాలా చక్కగా సాగుతూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సాగుతుంది. మొదటి హాఫ్ మాములుగా పర్వాలేదనిపించినా ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్ లో వచ్చే రెండు ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. రోషం రాజు క్యారెక్టర్ సన్నివేశాలన్నీ ప్రేక్షకులని మెప్పిస్తాయి. అయితే క్లైమాక్స్ లో కథకి ఎలాంటి ఎండ్ ఇవ్వకుండా మధ్యలోనే వదిలేసి పార్ట్ 2 అని ఊహించుకునేలా వదిలేయడంతో కథకి ముగింపు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఇదంతా రాయలసీమ కథ కావడంతో ఇందులో మాట్లాడిన కొన్ని పదాలు వేరే ప్రాంత ప్రజలకు అంత తొందరగా అర్ధం కావు. ఒక రాయలసీమ సగిలేరు అనే పల్లెటూళ్ళో ఉండే జనల కథలా సినిమాని తెరకెక్కించారు.
ఆర్టిస్టుల విషయానికి వస్తే.. ఇన్నాళ్లు యూట్యూబ్ లో మెప్పించిన రవి మహాదాస్యం హీరోగా కూడా మెప్పించాడు. హీరోయిన్ విషిక కూడా తన నటనతో రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతూ, తన పల్లెటూరి అందాలతో మెప్పించింది. రోషం రాజు క్యారెక్టర్ చేసిన నరసింహ ప్రసాద్ చికెన్ కోసం ఆశపడే వ్యక్తిగా బాగా నటించి ప్రేక్షకులని నవ్వించాడు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన హీరో తల్లి పాత్ర, హీరో మామయ్య పాత్ర, హీరోయిన్ దగ్గర ఉండే తమ్ముడు పాత్ర, ఊరి పెద్దాయన పాత్రలు కూడా ప్రేక్షకులని నవ్విస్తాయి.
టెక్నికల్ అంశాలకు వస్తే.. సినిమా రాయలసీమ పల్లెటూళ్ళో జరుగుతుండటంతో అక్కడి లోకల్ మ్యూజిక్, సాంగ్స్ వినపడేలా చేశారు. ఈ మ్యూజిక్, సాంగ్స్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. చికెన్ కర్రీ వండే విధానం పాట రూపంలో చూపించారు. ఈ పాటకి ఇచ్చిన మ్యూజిక్ బాగుంటుంది. పల్లెటూరి కెమరా విజువల్స్ బాగున్నా కొన్ని చోట్ల షార్ట్ ఫిలిం ఛాయలు కనిపిస్తాయి. డైరెక్టర్ మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించాడు అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు 2.5 వరకు రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.