×
Ad

The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

The Great Pre Wedding Show

Image Credits :

The Great Pre Wedding Show Review : తిరువీర్, టీనా శ్రావ్య జంటగా తెరకెక్కిన సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మాణంలో రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో రానుండగా రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

శ్రీకాకుళం దగ్గర్లోని ఓ గ్రామంలో రమేష్(తిరువీర్) ఫోటో స్టూడియో నడుపుతూ పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. పంచాయతీలో సెక్రెటరీగా పనిచేసే హేమ(టీను శ్రావ్య)ని ఇష్టపడతాడు. తనకు కూడా రమేష్ అంటే ఇష్టం కానీ ఒకరికొకరు బయటపడరు. రమేష్ దగ్గరికి తన పెళ్లి ఫిక్స్ అయిందని, గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, వీడియో తీయాలని ఖర్చు ఎంతైనా పర్లేదు అని ఆనంద్(నరేంద్ర రవి) వస్తాడు. దాంతో రమేష్ భారీగా ఆనంద్ – సౌందర్య(యామిని)ల ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు.

షూట్ ఫుటేజ్ అంతా ఒకే చిప్ లో ఉంటుంది. ఆ చిప్ కాపీ పెట్టమని తన దగ్గర పనిచేసే అబ్బాయి(రోహన్ రాయ్)కి ఇస్తాడు. కానీ ఆ చిప్ ని అతను పోగొడతాడు. దీంతో ఈ విషయం తెలిస్తే ఆనంద్ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో తనని ఏమైనా చేస్తాడని రమేష్ భయపడి ఎన్నిసార్లు ఆనంద్ ఫోటోలు అడిగినా రమేష్ తపించుకొని తిరుగుతాడు. ఆనంద్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అడగకూడదు అంటే వాళ్ళ పెళ్లి చెడగొట్టాలని రమేష్, హేమ కలిసి రకరకాల ప్లాన్స్ వేస్తారు. కానీ ఒక రోజు ఆనంద్ స్వయంగా వచ్చి తమ పెళ్లి ఆగిపోయింది అని చెప్పి బాధపడతాడు.

అసలు ఆనంద్ – సౌందర్య పెళ్లి ఎలా ఆగిపోయింది? ప్రీ వెడ్డింగ్ షూట్ ఫుటేజ్ ఉన్న చిప్ ఎలా పోయింది? ఆ విషయం ఆనంద్ కి తెలుస్తుందా? ఆనంద్ – సౌందర్య పెళ్లి జరుగుతుందా? వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో బయటకు వస్తుందా? చిప్ దొరుకుతుందా? రమేష్ – హేమ ప్రేమాయణం ఏమైంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Peddi Song : ‘పెద్ది’ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. చరణ్ స్టెప్ అదిరిందిగా.. ‘చికిరి’ అర్ధం ఏంటంటే..

సినిమా విశ్లేషణ..

డిఫరెంట్ కథలతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు తిరువీర్. ఈ క్రమంలోనే ది ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాతో వచ్చాడు. ఓ ఫోటోగ్రాఫర్ చేసిన ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫుటేజ్ ఉన్న చిప్ పోతే ఏం జరిగింది అనే పాయింట్ ని తీసుకొచ్చి ఫుల్ గా నవ్విస్తూ అక్కడక్కడా ఎమోషనల్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు.

ఫస్ట్ హాఫ్ అంతా అన్ని పాత్రల పరిచయాలు, ప్రీ వెడ్డింగ్ షూట్, చిప్ పోవడం, పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో తీసేయోచ్చు. ఫస్ట్ హాఫ్ లో బాగానే నవ్వించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ సీన్స్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అంటూ హడావిడి చేస్తున్న పెళ్లి జంటలను గుర్తుచేస్తాయి. రమేష్ – హేమ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆనంద్ స్వయంగా వచ్చి పెళ్లి ఆగిపోయింది అని చెప్పడంతో ఎలా అనే ఆసక్తి నెలకొంది.

సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషన్ పండించారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషన్స్ అరె నిజమే కదా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కాసేపు సాగినా మళ్ళీ ఫుల్ గా నవ్విస్తారు. క్లైమాక్స్ లో మనసుకు హత్తుకునే ఓ సన్నివేశంతో క్లోజ్ చేయడం బాగుంటుంది. చివర్లో మళ్ళీ ఫుల్ గా నవ్వించే సీన్ తో ముగింపు ఇచ్చారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఫుల్ గా నవ్వుకొని రావొచ్చు. టైటిల్ కి తగ్గట్టు సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ తక్కువ చేసారు. ఇంకాస్త ప్రమోషన్స్ చేస్తే సినిమా జనాల్లోకి వెళ్లి మరింత విజయం సాధించే అవకాశం ఉంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

తిరువీర్ ఎప్పటిలాగానే కాస్త అమాయకంగా కనపడే పాత్రలో బాగానే మెప్పించాడు. టీనా శ్రావ్య క్యూట్ గా కనిపించి అలరించింది. నరేంద్ర రవి మాత్రం సినిమా తన భుజాలపై మోశాడు అనిపిస్తుంది. ఓ పక్క నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కూడా అదరగొట్టాడు. పక్కన హీరో ఉన్నా కథకు తగ్గట్టు నరేంద్ర పాత్రను చాలా బాగా రాసుకున్నారు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చి మరిన్ని పాత్రలు రావడం ఖాయం. యామిని కూడా తన పాత్రలో బాగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కూడా బాగానే నవ్వించాడు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Bad Girl Review : ‘బ్యాడ్ గర్ల్’ మూవీ రివ్యూ.. ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా.. ఈ జనరేషన్ అమ్మాయిల గురించా?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్ న్యాచురల్ గా కథకు తగ్గట్టు బాగా సెట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొంత కట్ చేసి ఉంటే బాగుండేది. డేటా ఉన్న చిప్ పోతే కంగారుపడటం అనే కాన్సెప్ట్ పాతదే అయినా కామెడీతో పాటు ఒక మంచి ఎమోషన్ లవ్ తో బాగా తెరకెక్కించాడు దర్శకుడు. శ్రీకాకుళం యాస కొంతమందికి సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. కామెడీ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టొచ్చు.

మొత్తంగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఓ ఫోటోగ్రాఫర్ కాబోయే జంటకు చేసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పోగొడితే ఏమైంది అని ఫుల్ గా నవ్విస్తూనే చిన్న ఎమోషన్ తో మెప్పించారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేయొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.