ఇలాంటిరోజు వస్తుందని ఊహించలేదు.. కంటతడి పెట్టిన కమెడియన్..

కరోనా ఎఫెక్ట్ : కన్నీటితో ప్రజలను వేడుకున్న ప్రముఖ హాస్యనటుడు వడివేలు..

  • Published By: sekhar ,Published On : March 29, 2020 / 01:41 PM IST
ఇలాంటిరోజు వస్తుందని ఊహించలేదు.. కంటతడి పెట్టిన కమెడియన్..

Updated On : March 29, 2020 / 1:41 PM IST

కరోనా ఎఫెక్ట్ : కన్నీటితో ప్రజలను వేడుకున్న ప్రముఖ హాస్యనటుడు వడివేలు..

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి క్వారంటైన్ ఒక్కటే మార్గమని కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాల కోసం తప్పితే ప్రజలు బయటకు రావడంలేదు. జాగ్రత్తగా ఇంటిపట్టునే ఉండండి. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించండి. సామాజిక దూరం పాటించండి. ఎవరూ రోడ్లపైకి రావద్దు.. శానిటైజర్లు వాడండి.. చేతులు శుభ్రంగా కడుక్కోండి. అందరూ ఇవే జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఇవే సూచనలు ప్రముఖ కమెడియన్ కన్నీళ్లు పెట్టుకుని మరీ వేడుకుంటూ తెలిపారు.

ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు అంటే.. తమిళ్, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని వడివేలు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏనాడూ ఊహించలేదు. చాలా మనోవేదనకి గురవుతున్నా. మనకే ఇలా ఉంటే.. వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు. వాళ్లంతా మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా చాలా చోట్ల చేతులు జోడించి వేడుకోవడం చూశాను.

దయచేసి గమనించండి వారు పోరాడుతున్నది మన కోసం, మన ముందు తరాల కోసం. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలు చెప్పింది విని, ఇంటిపట్టునే ఉందాం. ప్రభుత్వ సూచనలని ఎవరూ తేలికగా తీసుకోవద్దు. ఎవరూ బయటికి రావద్దు. పిల్లా పాపలతో హాయిగా ఇంట్లోనే ఉండండి అని వేడుకుంటున్నాను..’’ అని చెబుతూ వడివేలు కంటతడి పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.