అప్పటి ‘వల్లంకి పిట్ట’ పాప ఇప్పుడు హీరోయిన్..

చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలు, హీరోయిన్‌లుగా మారడం అనేది ఇప్పటివరకు చాలానే చూశాం.. మహేష్, ఎన్టీఆర్, తరుణ్, కళ్యాణ్ రామ్, బాలాదిత్య, తేజ సజ్జ, ఆకాష్ పూరి, రాశి, తులసి, శ్రియ శర్మ, సుహాని ఇలా చాలామందే ఉన్నారు. తాజాగా కావ్య ఈ లిస్టులో చేరుతోంది. కావ్య అంటే గుర్తు పట్టడం కష్టం కానీ.. అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లో ‘వల్లంకి పిట్ట’ పాటలో చిన్నప్పటి కథానాయికగా కనిపించింది ఆ కావ్య అంటే ఠక్కున గుర్తుపడతాం. ‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’ వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆ పాపే ఇప్పుడు కథానాయికగా పరిచయం కాబోతుంది. జూలై 20న కావ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు సంబధించిన వివరాలు తెలియచేసిందామె.
‘‘పుణెలోని లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టాను. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిషన్స్ ఇస్తున్నాను. నిజానికి లాక్‌డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్ స్టార్ట్ చేశాను. లాక్ డౌన్ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్లకన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పింది కావ్య.