ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు విసు మృతి

ప్రముఖ తమిళ నటుడు, రచయిత, దర్శకులు విస్సు ఇకలేరు..

  • Published By: sekhar ,Published On : March 23, 2020 / 06:24 AM IST
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు విసు మృతి

Updated On : March 23, 2020 / 6:24 AM IST

ప్రముఖ తమిళ నటుడు, రచయిత, దర్శకులు విస్సు ఇకలేరు..

ప్రముఖ తమిళ సీనియర్ దర్శకుడు, నిర్మాత విసు(74) మార్చి 22 (ఆదివారం) సాయంత్రం అనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న మూత్ర పిండాల వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. 1945లో జ‌న్మించిన విసు 1981లో ప్ర‌ముఖ దివంగ‌త ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కుడిగా చేరారు. ‘తిల్లు ముల్లు’ చిత్రంతో ర‌చ‌యిత‌గా మారారు. ‘క‌ణ్మ‌ణి పూంగా’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. రంగస్థల నటుడిగానూ, టెలివిజన్ వ్యాఖ్యాతగానూ విసు గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాలు తెలుగులోనూ అనువాద‌మై మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. తెలుగులో ఈయ‌న కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘ఆడ‌దే ఆధారం’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్పీ ముత్తరామన్‌ దర్వకత్వం వహించిన ‘కుడుంబం ఒరు కడంబం’ అనే సినిమాతో నటుడిగానూ మారారు. సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌ వంటి హీరోలతో కలిసి పనిచేశారాయన. ‘అరుణాచలం’ సినిమాలో రంభ తండ్రిగా చేసిన రంగాచారి పాత్ర ఆయనకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది.

Veteran Tamil Director and Actor Visu (75) passed away

కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరనే పేరు పొందారాయన. విసు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సంసారం అదు నిన్‌సారం’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’ పేరుతో రీమేక్‌ చేయగా.. తమిళంలో విసు చేసిన పాత్రనే తెలుగులో గొల్లపూడి మారుతీరావు చేశారు. 

ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘వరావు నల్ల ఉరావు’ చిత్రానికి ఉత్తమ రచయితగా తమిళనాడు స్టేట్ అవార్డు, ‘నీంగా నల్ల ఇరుక్కానుమ్’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు. విసు మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.