‘లవ్ గురు’ మూవీ రివ్యూ.. పెళ్లి ఇష్టం లేని భార్యతో ప్రేమగా ఎలా దగ్గరవ్వాలి..

'లవ్ గురు' మూవీలో భార్యకి ఇష్టం లేని పెళ్లి చేసారని తెలుసుకున్న భర్త ఆమెకి దగ్గరవడానికి ఏం చేసాడు అని కామెడీగా చూపిస్తూనే సిస్టర్ సెంటిమెంట్ ని కూడా ఎమోషనల్ గా వర్కౌట్ చేశారు.

‘లవ్ గురు’ మూవీ రివ్యూ.. పెళ్లి ఇష్టం లేని భార్యతో ప్రేమగా ఎలా దగ్గరవ్వాలి..

Vijay Antony Mirnalini Ravi Love Guru Movie Review and Rating

Updated On : April 11, 2024 / 10:37 AM IST

Love Guru Movie Review : విజయ్ ఆంటోనీ(Vijay Antony), మృణాళిని రవి(Mirnalini Ravi) జంటగా సుధ, యోగిబాబు, వీటివ్ గణేష్, షారా.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘లవ్ గురు’. వినాయక్ వైతనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి విజయ్ ఆంటోనీ ఎడిటర్ గా కూడా పనిచేశారు. తమిళ హీరో అయినా విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. అప్పట్నుంచి తన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ లవ్ గురు సినిమాని తమిళ్ – తెలుగు భాషల్లో నేడు ఏప్రిల్ 11న రిలీజ్ చేశారు. తమిళ్ లో ఈ సినిమా రోమియో పేరుతో విడుదల అవుతుంది.

కథ విషయానికొస్తే.. అరవింద్(విజయ్ ఆంటోనీ) ఫ్యామిలీ కోసం చిన్నప్పుడే మలేషియా వెళ్లి బాగా డబ్బులు సంపాదించి తిరిగి వస్తాడు. ఏజ్ బాగా పెరగడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంతపెడతారు. నాకు నచ్చిన అమ్మాయి దొరికకే పెళ్లి చేసుకుంటాను, ఆమెని ప్రేమిస్తాను అని చెప్తాడు. లీల(మృణాళిని రవి) ఇంట్లో సాఫ్ట్ వేర్ జాబ్ అని అబద్దం చెప్పి హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటుంది. లీల వాళ్ళ తాతయ్య చనిపోవడంతో ఊరికి వస్తుంది. అదే ఊళ్ళో ఉండే అరవింద్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రావడంతో ఆ సమయంలో లీలని చూసి ఇష్టపడతాడు అరవింద్. ఇంట్లో వాళ్ళు అది గమనించి పెళ్లి సెట్ చేయడంతో లీలని పెళ్లి చేసుకొని అరవింద్ సిటీకి వస్తాడు.

అయితే లీలకి ఇష్టం లేకుండా పెళ్లి చేయడంతో అరవింద్ ని అసలు పట్టించుకోదు. అతనికి దూరంగా ఉంటూ తన సినిమా ప్రయత్నాలు తాను చేస్తుంది. అరవింద్ మాత్రం లీలకి దగ్గరవ్వాలని ట్రై చేస్తూ ఎంత మంచిగా ఉన్నా ఆమె పట్టించుకోకుండా డైవర్స్ కావాలని అడుగుతుంది. దీంతో ఓ బార్ కి వెళ్తే అక్కడ విక్రమ్(యోగిబాబు)పరిచయం అవుతాడు. అతను ఇచ్చిన సలహాతో లీలకు తన ఫ్యాన్ అని చెప్పి విక్రమ్ అనే పేరుతో ఫోన్ చేసి మాట్లాడతాడు అరవింద్. తన మాటలతో ఆమెకి హీరోయిన్ అవుతావు అని మోటివేషన్ ఇస్తూ ఫోన్లోనే బాగా కనెక్ట్ అవుతాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా లీల హీరోయిన్ అవ్వకపోవడంతో లీల, ఆమె ఫ్రెండ్స్ నిరాశపడుతుండటం చూసి తనే నిర్మాతగా మారతాను కానీ హీరోగా నన్నే పెట్టాలని అంటాడు అరవింద్.

ఛాన్సుల కోసం ఇన్నాళ్లు తిరిగిన లీల ఫ్రెండ్స్ ఓకే చెప్పడంతో లీల కూడా ఇష్టం లేకపోయినా సరే అంటుంది. లీల ఫ్రెండ్ డైరెక్టర్ గా అరవింద్, లీల జంటగా సినిమా మొదలవుతుంది. మరి ఈ సినిమా పూర్తయిందా? లీల ఫోన్లో తనకి దగ్గరైన విక్రమ్ ని కలుస్తుందా? విక్రమ్ – అరవింద్ ఒక్కరే అని లీల తెలుసుకుంటుందా? మరోవైపు చిన్నప్పుడు తప్పిపోయిన అరవింద్ చెల్లి తిరిగొస్తుందా? లీల – అరవింద్ లు డైవర్స్ తీసుకుంటారా? కలుస్తారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Sriranga Neethulu : ‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ.. మూడు కథలతో.. మనిషి ఎలా బతకాలి..

సినిమా విశ్లేషణ.. అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసేయడంతో భర్త ఆమెకి దగ్గరవ్వాలని కథాంశంతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. షారుఖ్ ‘రబ్ నే బనాదీ జోడి’ సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా అరవింద్ – లీలకు ప్రేమతో దగ్గరవ్వాలని చూస్తాడు. అందులో ఇంకో వ్యక్తిలా వస్తే ఇందులో ఫోన్లో మాత్రమే క్యారెక్టర్ ఉంటుంది. ఆ సినిమా కోరే పాయింట్ తీసుకున్నా కథాంశం మొత్తం కొత్తగా ఉంటుంది. అలాగే ఈ కథకి సిస్టర్ సెంటిమెంట్ జత చేసి మరింత కొత్తగా క్లైమాక్స్ చూపించారు. సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగుతుంది. చివర్లో మాత్రం ఎమోషన్ తో ప్రేక్షకులని మెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ సింపుల్ గా అక్కడక్కడా కామెడీతో అయిపోయింది అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఆసక్తిగా సాగుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. భార్య ఎంత వద్దనుకున్నా ప్రేమతో ఆమెకు దగ్గరవ్వాలని, ఆమె కోసం ఏదైనా చేయాలనే భర్త పాత్రలో విజయ్ ఆంటోని జీవించేసాడని చెప్పొచ్చు. తన సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ నుంచి బయటకి వచ్చి విజయ్ ఆంటోనీ కామెడీ కూడా బాగా చేస్తాడని మొదటిసారి ప్రూవ్ చేశారు. మృణాళిని రవి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా యాక్టింగ్ కోర్స్ తీసుకుంది. సినిమాలో పెళ్లి ఇష్టంలేని భార్యగా, హీరోయిన్ అవ్వాలనే అమ్మాయి పాత్రలో మెప్పించింది. షారా, యోగిబాబు, వీటివి గణేష్ తమ కామెడీతో నవ్విస్తారు. మిగిలిన పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా రిచ్ గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. కానీ తెలుగులో సాంగ్స్ అసలు అర్థం కావు. తెలుగు డైలాగ్స్ బాగా రాసారు కాకపోతే తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల సింక్ మిస్ అయిందనిపిస్తుంది. కథ పాత పాయింట్ అయినా కొత్తగా రాసుకొని తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే వినాయక్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాతగా విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు బానే ఖర్చు పెట్టాడు. ఎడిటర్ గా కూడా సినిమా ఎక్కడా ల్యాగ్ లేకుండా కట్ చేశాడు.

మొత్తంగా ‘లవ్ గురు’ మూవీలో భార్యకి ఇష్టం లేని పెళ్లి చేసారని తెలుసుకున్న భర్త ఆమెకి దగ్గరవడానికి ఏం చేసాడు అని కామెడీగా చూపిస్తూనే సిస్టర్ సెంటిమెంట్ ని కూడా ఎమోషనల్ గా వర్కౌట్ చేశారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.