వడోదర నుండి పోటీ చేస్తా : వివేక్ ఒబెరాయ్

బాలీవుడ్ స్టార్ ‘వివేక్ ఒబెరాయ్’పై ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమా కొంత ప్రభావం చూపించినట్లుంది. రాజకీయాల వైపు ‘ఒబెరాయ్’ మనస్సు మళ్లుతోందని ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమౌతోంది. అవును పాలిటిక్స్‌లోకి ప్రవేశిస్తే ‘వడోదర’ నుండి పోటీ చేస్తానని స్వయంగా ‘ఒబెరాయ్’ ప్రకటించాడు. ఈ నటుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోడీ’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు సీజన్ ఉండడంతో సినిమా రిలీజ్ అయితే..ఓటర్లపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా పారుల్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు ‘వివేక్ ఒబెరాయ్’. ఈ సందర్బంగా రాజకీయాలపై ఆయన మనస్సులోని మాటను బయటపెట్టారు. ఒకవేళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే 2024 ఎన్నికల్లో వడోదర నుండి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు ఎంతో నచ్చినట్లు..మోడీ మీద చూపే ప్రేమ ఎంతో విలువైందన్నారు. అందుకే..ఇక్కడి నుండి బరిలోకి దిగాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. రాజకీయం లేని వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉంటూ..ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా ఎలా మారారో తెలియచేసినట్లు..వెల్లడించారు. సినిమాను ఒమంగ్ కుమార్ డైరక్షన్‌లో సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు.