Genghis khan : చెంఘీజ్‌ ఖాన్‌ పాత్ర తన జీవితాశయం అన్న బాలకృష్ణ.. ఎవరీ చెంఘీజ్‌ ఖాన్‌.. చెంఘీజ్‌ ఖాన్‌ స్పెషల్ స్టోరీ

చెంఘీజ్‌ ఖాన్ సినిమా చేస్తా ఇదే నా జీవితాశయం అని, ఐతే టైమ్ రావాలంటూ బాలయ్య చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. చెంఘిజ్‌ ఖాన్ ఎవరు? అతని ప్రత్యేకత ఏంటి అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు............

Genghis khan : చెంఘీజ్‌ ఖాన్‌ పాత్ర తన జీవితాశయం అన్న బాలకృష్ణ.. ఎవరీ చెంఘీజ్‌ ఖాన్‌.. చెంఘీజ్‌ ఖాన్‌ స్పెషల్ స్టోరీ

who is Genghis khan and his story

Updated On : January 9, 2023 / 12:46 PM IST

Genghis khan :  బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ అదుర్స్ అనిపించింది. రాబోయే రెండు మూడు సినిమాలకు ఒకే వేదిక నుంచి క్లారిటీ ఇచ్చాడు బాలయ్య. ఇక తన మనసులో మాట బయటపెట్టాడు. చెంఘీజ్‌ ఖాన్ సినిమా చేస్తా ఇదే నా జీవితాశయం అని, ఐతే టైమ్ రావాలంటూ బాలయ్య చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. చెంఘిజ్‌ ఖాన్ ఎవరు? అతని ప్రత్యేకత ఏంటి అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

చెంఘీజ్‌ ఖాన్.. ఒక్క పేరు మీద ఎన్నో అభిప్రాయాలు. హీరో అంటారు కొందరు, కాదు క్రూరుడు అంటారు ఇంకొందరు. ఇంతకీ ఎవరీ చెంఘీజ్‌ ఖాన్‌. తండాలో పుట్టిన నాయకుడు ప్రపంచాన్ని ఎలా జయించాడు. చెంఘీజ్‌ ఖాన్.. పేరు చెప్తే రక్తంతో తడిసిన చరిత్ర పేజీలు కళ్లముందు కదులుతాయ్‌. భూమిని పాలించిన గొప్ప చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో తమ గుర్తులను వదిలి వెళ్లారు. వారిలో నిరంతర యుద్ధాల ద్వారా ప్రపంచ దేశాలని ఆక్రమించి చక్రవర్తులైన వారిలో ప్రపంచ చరిత్ర మార్చిన వారు అలెగ్జాండర్, సీజర్, చెంఘీజ్ ఖాన్. అలెగ్జాండర్‌, సీజర్ ఇద్దరూ ఐరోపా దేశాల నుంచి బయలుదేరి ఆసియా దేశాలపై రాగా చెంఘీజ్‌ ఖాన్‌ ఆసియా నుంచి బయల్దేరి ప్రపంచ దేశాలు ఆక్రమించారు. అలెగ్జాండర్‌, సీజర్ ఇద్దరూ నగర జీవితాల నుంచి వచ్చిన వారైతే చెంఘీజ్‌ ఖాన్‌ తండా జీవితంలో వచ్చి చివరి వరకూ అందులో బ్రతికినవాడు. చెంఘీజ్‌ ఖాన్ అంటే ముస్లిం పేరులా వినిపించినా నిజానికి అది మంగోల్ పేరు. చెంఘీజ్‌ ఖాన్‌ అసలు పేరే కాదు ఓ బిరుదు. ఇప్పటి మనకు తెలిసిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజానికి ముందు 12కోట్ల చదరపు మైళ్ల భూమిని యుద్ధాల ద్వారా గెలిచిన ఒకే ఒక యోధుడు చెంఘీజ్‌ ఖాన్‌.

చెంఘీజ్‌ ఖాన్‌ హీరోనా.. విలనా అనే ప్రశ్న ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఐతే నెహ్రూ వంటి వారు చెంఘీజ్ ఖాన్‌ తన ఆదర్శవీరుడు అంటూ రాసిన మాటలు కొత్త ఆలోచనలు పుట్టిస్తుంటాయ్‌. 123 గుడిసెలు, డేరాలు ఉన్న ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకు జయించి మూడు శతాబ్దాలపాటు సువర్ణ యుగాన్ని అనుభవించిన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే అది సైనిక శక్తి వల్లే సాధ్యమైంది. చైనా సముద్రం నుండి ఇప్పటి యుక్రెయిన్‌ దేశం దాకా తన సైన్యాన్ని నడిపించిన మంగోల్ మహావీరుడు చెంఘీజ్‌ ఖాన్. మంగోల్ వంశాన్ని ప్రపంచం అంతా ప్రాకించిన మొదటి చక్రవర్తి. ఊరు పేరు లేని ఒక చిన్న మంగోల్ తెగ నాయకుడుగా పుట్టి పదకొండవ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించిన తిరుగులేని సైన్య నిర్మాణ దక్షుడు, చతుర్యోది పాయలను నేర్పుగా ప్రయోగించిన మహా నాయకుడు చెంఘీజ్‌ ఖాన్‌.

చెంఘీజ్‌ ఖాన్‌ అసలు పేరు టెమూజిన్‌. మంగోల్ తండా నాయకుడు యాసుకై భగత్తూర్‌కు, మెర్కిట్ తండా నుంచి ఎత్తుకు వచ్చిన తల్లి యూలాన్‌కు పుట్టిన మొదటి బిడ్డ టెమూజిన్. అంటే ఉక్కు మనిషి అని అర్థం. తండ్రికి విషం ఇచ్చి చంపడం బంధువులు అనుకున్న తెగలు, తండాలు ఎదురుతిరగడం, బందీగా చేయడం.. ఇలాంటి పరిణామాల మధ్య చెంఘీజ్‌ ఖాన్‌ బాల్యం చాలా కష్టంగా మారింది. ప్రపంచాన్ని జయించాలనుకున్న ఓ బానిస కొడుకు చెంఘీజ్ ఖాన్ మారణహోమం సృష్టించాడు. చదువు లేకపోయినా తండా రాజకీయాల్లో మహానేర్పరి. ఇప్పటివరకూ భూమి మీద 12 కోట్ల చదరపు మైళ్లు నిర్దాక్షిణ్యంగా జయించిన ఒకే ఒక నాయకుడు టెమూజిన్. తండాలలో ఐక్యత కోసం నిర్దాక్షిణ్యంగా ఉండడం, తండాలలో మూఢనమ్మకాలను తనకు అనుకూలంగా మలుచుకోవడం, జాగ్రత్తగా సంబంధాలు కుదుర్చుకోవడం, తాను చేసే పని ఒప్పు అని తన చుట్టు పక్క నాయకులు అనిపించేలా రంగం తయారుచేయడం, నేల మీద మనిషికి గుర్రం బలం అని నమ్మిన మహానాయకుడు టెమూజిన్‌. సైన్యాన్ని చిన్న చిన్న గుంపులుగా తయారు చేయడం, వేగంగా కదలడం, ఆ చిన్న గుంపు వారి నాయకుడిని ఎన్నుకొనే అధికారం ఇవ్వడం లాంటి విధానాలు ఇప్పటి దేశాలు కూడా స్ఫూర్తి అక్కడ నుండే తీసుకున్నట్లు అనిపిస్తుంది.

యుద్ధ నిర్వహణ ఓ కళ. అది ఓ నైపుణ్యం. అన్ని కళల్లో లాగానే దాని రహస్యం అందరికీ అంతు చిక్కదు. యుద్ధాలు నిర్వహించినవారు, యుద్ధాల్లో గెలుపోటములు చవిచూసిన వారు అందరూ ఆ కళలో పర్ఫెక్ట్‌ అనుకోవడం కరెక్ట్ కాదు. చెంఘీజ్‌ ఖాన్‌ జీవితం చెప్తుంది అదే. కొందరే యుద్ధ నిర్వహణలో నిపుణులు అవుతారు. తండ్రి చనిపోయాక బంధువులతో పోరాటాలతో నెగ్గుకు వస్తూ, తండాలను జయిస్తూ చెంఘీజ్‌ఖాన్‌ చాలాకాలం గడపాల్సి వచ్చింది. తన స్థానం పదిలం చేసుకోవడానికి 20ఏళ్లకు పైగా చెంఘీజ్‌ ఖాన్‌ యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు.

దండయాత్రలు 51 ఏట మొదలుపెట్టాడు. చెంఘీజ్‌ ఖాన్‌ రాజనీతిలో మార్గదర్శకంగా ఉన్న సూత్రం చాలా జాగ్రత్తగా సంబంధాలు కుదుర్చుకోవడం. చెంఘీజ్‌కు కావాల్సింది తమ సంచార తెగల జాతుల ఆధిపత్యం. దాని కోసం పచ్చిక బీళ్లని, పర్వత కనుమలని స్వాధీనం చేసుకునే దాకా దండయాత్రలు జరిపాడు. తన సైనికుల పోరాటపటిమను తక్కువ అంచనా వేసే వ్యక్తి కాదు చెంఘీజ్‌ ఖాన్‌. అలాగని మనుషులుగా వారికీ వారి శరీరాలకు ఉన్న పరిమితులను అర్థం చేసుకోకుండా అన్యాయంగా వారిని పోరాటాల్లోకి దింపేవాడూ కాదు. తన బలం, బలహీనతలు ఏంటి, ప్రత్యర్థి బలం, బలహీనతలు ఏంటి అని తెలిసిన నాయకుడు చెంఘీజ్‌ ఖాన్. యుద్ధంలో వ్యూహాలు కూడా అలానే ఉండేవి. ప్రస్తుత యుద్ధనీతి దాదాపుగా కనిపించే యుద్ధవ్యూహాలను వందల ఏళ్ల కిందే అనుసరించాడు చెంఘీజ్‌ ఖాన్‌. మెరుపుదాడులు, త్రిముఖ వ్యూహాలు, చతుర్ముఖ వ్యూహాలు, గెరిల్లా యుద్ధాలు.. ఇలా ప్రత్యర్థి బలాన్ని దెబ్బతీసేందుకు రకరకాల యుద్ధ రీతులను పరిచయం చేశాడు చెంఘీజ్‌ ఖాన్‌.

చెంఘీజ్‌ ఖాన్‌ నిరక్షరాస్యుడు అసలు లిపి అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. నోటి మాటగానే దౌత్యాలు, ఆజ్ఞలు, వ్యవహారాలు నడిచేవి. లిపి అనేది ఒకటి ఉంది అని తెలిశాక దాని విలువ తెలుసుకున్నాడు. యుద్ధంలో గడ్డిపరకను కూడా కత్తిలా వాడే రకం తెలివి చెంఘీజ్‌ ఖాన్‌ సొంతం. సైనికుల గాయాలను నయం చేయటానికి ఈగ లార్వాలను వైద్యంలో ఉపయోగించిన మేధావి చెంఘీజ్‌ ఖాన్‌. యుద్ధానికి వెళ్లే ముందు బండెడు ఈగలను కూడా తీసుకెళ్లేవాడని చరిత్ర చెప్తోంది. ఈగలు గాయాల పక్కన ఉన్న చెడు చర్మాన్ని తినేసి త్వరగా నయం అయ్యేలా చేస్తాయ్‌. ఈ విషయం తెలిసింది కేవలం మంగోలులకు మాత్రమే అందులోనూ చెంఘీజ్‌ ఖాన్‌కు మాత్రమే తెలిసిన వైద్యం ఇది.

చివరి దశలో అనారోగ్యంతో చెంఘీజ్‌ ఖాన్ చనిపోతాడు. అతని జీవితంలో విలన్ ఉండడు తనకు తానే సవాల్ విసురుకుంటాడు. ఓ బానిస కొడుకు విశ్వాన్ని జయించాలని కలగంటాడు. ఆ కల నెరవేరడానికి అత్యంత క్రూరంగా వ్యవహరిస్తాడు. చరిత్ర పేజీలు తిరగేస్తే తెలిసేది అదే. చెంఘీజ్‌ ఖాన్ అంటే యోధుడు అనేవాళ్లు ఎంతమందో, సంపూర్ణ విలన్ అనేవాళ్లు అంతకుమించి. భయంతోనే ఎన్నో విజయాలు సాధించాడని చరిత్ర చెప్తోంది. ఐతే దేనికి ఆధారాలు లేవు.

Balakrishna : బి గోపాల్ తో అలాంటి సినిమా చేయడం నా కల..

చరిత్ర క్రూరుడు అని చెప్తున్న రాజుల్లో మొదటగా వినిపించే పేరు చెంఘీజ్‌ ఖాన్‌. నిజానికి చరిత్రలో విజేతలే తమ గురించి గ్రంథాలు రాయించుకున్నారు. చెంఘీజ్ ఖాన్ విషయంలో అలా కాదు ఓడినవారు రాశారు. అందుకే క్రూరుడుగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు అనే వారు ఉన్నారు. చెంఘీజ్ ఖాన్‌ గురించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయ్. ఎవరు ఎలా చెప్పినా ఒకటి మాత్రం నిజం చెంఘీజ్‌ ఖాన్ మహావీరుడు. అలాంటి మహావీరుడి చరిత్రను సినిమాగా తెరకెక్కించాలని.. హీరోగా నటించాలన్నది తన జీవిత ఆశయం అని బాలకృష్ణ తన మనసులో మాట బయటపెట్టాడు. మరి ఈ సినిమా కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.