Corona In Children : చిన్నారులపై కరోనా పంజా..మిజోరాంలో 128 మంది పిల్లలకు కోవిడ్

పిల్లలపై కోవిడ్ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

128 Children Among 576 New Covid Patients In Mizoram పిల్లలపై కోవిడ్ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం మిజోరాంలో 576 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో 128 మంది చిన్నారులే ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.తాజాగా ఈ మహమ్మారి బారిన పడినవారిలో చిన్నారులతో పాటు ఎనిమిది మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కోవిడ్ థర్డ్ వేవ్‌..చిన్న పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో.. కర్ణాటక, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇక, థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఇక, కొత్త కేసులతో కలిపి మిజోరంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,896కి పెరిగింది. అలాగే, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృతిచెందగా.. మృతుల సంఖ్య 173కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ఐజ్వాల్‌ జిల్లాలోనే అత్యధికంగా 323 కేసులు వచ్చాయి. ప్రస్తుతం మిజోరంలో 11,989 యాక్టివ్‌ కేసులు ఉండగా.. రికవరీ రేటు 74శాతంగా ఉంది. ఇప్పటివరకు 6.24లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసుకోగా.. వీరిలో 2.13 లక్షల మందికి వ్యాక్సిన్ రెండు డోసులూ అందింది.కోవిడ్ బారిన పడిన ఈ చిన్నారుల్లో తొమ్మిదేళ్ల లోపు వారు 106 మంది ఉన్నారని తెలిపింది.

మరోవైపు,కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా కొద్ది రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోన్న విషయం తెలిసిందే. గడిచిన ఐదు రోజుల్లో బెంగళూరులో 19ఏళ్ల లోపు వయస్సు ఉన్న 242 మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు మంగళవారం బెంగళూరు మహానగర పాలికే(BBMP) తెలిపింది. వచ్చే రోజుల్లో ఈ కేసులు మూడింతలకు పెరిగే అవకాశముందని కర్ణాటక ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి అంచనా వేశారు. పిల్లలను ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండా చూసుకుని వైరస్ బారి నుంచి కాపాడుకోవడమే మన చేతుల్లో ఉందని ఆయన తెలిపారు. పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, కాబట్టి పిల్లలను ఇంటికే పరిమితం చేయాలని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు