హ్యాట్సాఫ్ సీఎం సార్: అర్థరాత్రి అమ్మాయిలకు సాయంగా..

  • Publish Date - March 26, 2020 / 06:01 AM IST

కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయితే.. భారతదేశంలో మొట్టమొదటి అడుగు పెట్టింది కేరళ రాష్ట్రంలో.. అత్యధిక పాజిటివ్ కేసులు కూడా ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అయితే అక్కడి పినరయి ప్రభుత్వం తీసుకున్న మెరుగైన చర్యలతో వైరస్ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తూ భళా సీఎం అనిపించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పినరయి విజయన్‌కి ప్రతి విషయంలోనూ ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. లేటెస్ట్‌గా 13 మంది అమ్మాయిలతో సహా ఒక బృందం హైదరాబాద్ నుంచి కేరళకు ప్రయాణిస్తున్నారు. అయితే మధ్యలో వారికి తెలియని ప్లేస్‌లో చిక్కుకుపోయారు. దీంతో అందరూ భయపడిపోయారు. ఏం చెయ్యలేని పరిస్థితి. ఒకరిద్దరి ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయి.

ఎటు వెళ్లాలో తెలియట్లేదు.. ఏం చెయ్యలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరూ ఆదుకోలేరు అనుకున్నారు. వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అర్థరాత్రి  1.30 గంటల సమయంలో ఫోన్ చేశారు. అది చివరి ప్రయత్నం మాత్రమే. ముఖ్యమంత్రి స్పందించడం అంటే మాములు విషయమా? ఎవరూ ఊహించలేదు.. ఒకవేళ ఎత్తినా కూడా ఈ సమయంలో ఎందుకు చేశారు అని తిడతారేమో అనుకున్నారు.

కానీ వారి ఆందోళనలు అన్నీ రెండు ఫోన్ రింగుల తర్వాత మాయమైపోయాయి. రెండవ రింగ్‌‌కే అటుపక్క నుంచి ముఖ్యమంత్రి గారు.. సమస్య గురించి తెలుసుకున్నారు. రెండు నిమిషాల్లో రంగంలోకి దిగారు.. మూడో నిమిషంలో సమస్య పరిష్కారం అయ్యింది.

తెలియని ప్లేస్‌లో చిక్కుకున్న బృందం హైదరాబాద్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి సాయం తర్వాత కేరళకు చేరుకున్న వారికి చేతులు కడిగించి ఉష్ణోగ్రత చెక్ చేశారు. తర్వాత వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. వారిని సురక్షితంగా ఇంటికి చేరుకునేలా చేసిన సీఎం గారికి హ్యాట్సాఫ్ అంటూ సదరు అమ్మాయిలు చెప్పారు. 

Also Read | Breaking News : భారత్ లో కరోనా..మరో ఇద్దరు మృతి