ఇవాళ ఉన్నాం, రేపు ఉండకపోవచ్చు…కంటతడి పెట్టిస్తున్న అమర జవాన్ వాట్సాప్‌ చాట్‌

martyred jawan’s WhatsApp chat కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమరుడైన ఓ జవాన్ వాట్సాప్ చాట్ కంటతడి పెట్టిస్తోంది. వీరమరణం చెందడానికి కొన్ని గంటల ముందు సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ ఆ జవాన్ సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహితుడితో ఆ జవాన్ చేసిన వాట్సాప్‌ చాట్‌ వైరల్‌గా మారడమే కాకుండా నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.



మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా చలిగావ్ తాలూకాకు చెందిన యశ్ దిగంబర్ దేశ్‌ముఖ్ వయసు 20 ఏళ్లు. ఇండియన్ ఆర్మీకి ఎంపికై దేశానికి సేవలు అందించాలని చిన్ననాటి నుంచే కలలు కన్నారు. ఏడాది కిందట కర్ణాటకలో జరిగిన ఓ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి తన కల సాకారం చేసుకున్నారు.



శిక్షణ అనంతరం జమ్మూ కశ్మీర్‌కు పంపించగా.. అక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న తన మిత్రుడి క్షేమ సమాచారం గురించి తెలుసుకునేందుకు జవాన్ యశ్ దేశ్‌ముఖ్ మిత్రుడొకరు బుధవారం (నవంబర్-25,2020) వాట్సాప్ ద్వారా ఆయనతో చాట్ చేశాడు.



ఎలా ఉన్నావన్న మిత్రుడితో ‘‘బాగానే ఉన్నా. కానీ మా (సైనికుల) గురించి మీకు తెలియంది ఏముంది? ఇవాళ ఉంటాం… రేపుండొచ్చు, ఉండకపోవచ్చు’’ అని బదులిచ్చాడు జవాన్ యశ్ దేశ్‌ముఖ్.



అయితే, ఆ మరుసటి రోజే(నవంబర్-26,2020)ఉగ్రవాదులు చేసిన దాడిలో జవాన్ యశ్ దేశ్‌ముఖ్ వీరమరణం చెందారు. తన మాతృభాష మరాఠీలో జవాన్ చేసిన ఆ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలువురిని కంటతడి పెట్టిస్తోంది.



అసలేం జరిగింది

అక్రమంగా ఎల్‌వోసీ దాటిన ముగ్గురు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు గురువారం శ్రీనగర్‌లోని ఓ రద్దీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పట్టపగలే జరిగిన ఈ మెరుపుదాడిలో యశ్‌తో పాటు మరో జవాను అమరుడయ్యాడు.