ఫ్రెషర్స్ డేకు ర్యాంప్ వాక్ చేస్తూ విద్యార్థిని మృతి

కాలేజీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్‌లో విషాదం చోటు చేసుకుంది. ర్యాంప్ వాక్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలింది. వెంటనే స్పందించి హాస్పిటల్ కు చేర్చినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని ఇండస్ట్రియల్ ఏరియాలోని పీన్యాలో ఎంబీఏ కాలేజీలో అక్టోబర్ 18 శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీన్యాలోని ఎంబీఏ కాలేజీలో షాలిని (21) అనే యువతి ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ప్రెషర్స్ డే ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా షాలిని ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసింది. తన వంతు రాగానే ర్యాంప్ వాక్ చేసి స్టేజీకి పక్కన వెళ్లి నిలుచుంది.
అంతే సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలింది. తోటి విద్యార్థులు స్పందించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.