సరిహద్దుల్లో కాల్పులు…జవాన్ మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతోంది.జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని సుందర్ బానీ సెక్టార్ లో గురువారం(మార్చి-21,2019)ఉదయం పాక్ కాల్పులకు తెగబడింది.పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాను యశ్ పాల్(24)ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.నౌషీరా,అక్నూర్ స్టెక్లార్లలో కూడా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.భారత జవాన్లు ధీటుగా కాల్పులను తిప్పికొట్టారు.సాయంత్రం 4:45 గంటల సమయంలో ఫైరింగ్ ముగిసినట్లు అధికారులు తెలిపారు.

జనవరి నుంచి ఎల్ వోసీ దగ్గర 110సార్లకు పైగా పాక్ కాల్పులకు తెగబడింది. గత సోమవారం  నియంత్రణ రేఖ దగ్గర అక్నూర్, సుందర్‌ బానీ సెక్టార్లలో పాక్‌ సైన్యం బాంబులతో విరుచుకు పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో కరమ్‌ జీత్‌ సింగ్‌ అనే జవాను మరణించారని తెలిపారు. గతేడాది  2936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యంపై ఎల్ వోసీ దగ్గర పాక్ కాల్పులకు దిగిందని, గడిచిన పదిహేనేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు.