మృత్యుంజయుడు: మూడు రైళ్లు మీద నుంచి వెళ్లినా బతికాడు

మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో ఒక వ్యక్తి రైలు పట్టాలపై పడి ఉన్నాడు. అతను చనిపోయాడేమో అని అక్కడ చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగ్గరకు వెళ్లి మాత్రం చూడలేదు. అయితే పోలీసులు వచ్చి చూసేలోగా అదే పట్టాలపై అతని మీదుగానే మూడు రైళ్లు వెళ్లాయి. ఇంతలో పోలీసులు రానే వచ్చారు. దగ్గరకు వెళ్లి చూడగానే అతను లేచి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్లు షాక్ అయ్యారు. అకస్మాత్తుగా లేచిన అతను తన తండ్రి వచ్చాడంటూ అరవడం మొదలుపెట్టాడు.
వ్యక్తి లేచి పోలీసులతో “పాపా ఆ గే [తండ్రి వచ్చాడు]” అని చెప్పడంతో పోలీసులకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. అనంతరం ఆ వ్యక్తిని ఎవరు? అని ప్రశ్నించగా.. తన పేరు ధర్మేంద్ర అని చెప్పుకొచ్చాడు. ఆ వ్యక్తి తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. అతను ట్రాక్ మీద పడుకున్నప్పుడు అతనికి తెలియకుండా పడుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిపై మూడు రైళ్లు ప్రయాణించిన విషయం కూడా అతనికి తెలియదు
అనంతరం ధర్మేంద్రను మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్‌కు పంపారు. చెకప్ అయిన తరువాత అతనిని ఇంటికి పంపించారు. తాగిన మైకంలో ఒళ్లు తెలియకుండా పట్టాలపై పడగా అతను చాలా బక్కగా ఉండడంతో అతనిపై రైళ్లు వెళ్లినా అర్థం కాలేదు. దీంతో అందరూ అతనిని మృత్యుంజయుడు అంటున్నారు.