ప్రధాని మోదీ ఆదేశం : ఆమెకు రూ.కోటి పెన్షన్

ఢిల్లీ : భారత సరిహద్దులో మన సైనికులు అహర్నిశలు కళ్లలో ఒత్తులు వేసుకుని కాపలా కాస్తేనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలం. అటువంటి సైనికులకు దేశ ప్రభుత్వం ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. సైన్యంలో విశేషా సేవలందించి రిటైర్ అయిన ఓ సైనికుడు కుటుంబానికి ఇచ్చే పెన్షన్ విషయంలో మూడు దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యం వహించింది. ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ జోక్యంతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ క్రమంలో ఓ సైనిక కుటుంబానికి చెందిన 94 ఏళ్ల వితంతువునకు 30 ఏళ్ల తర్వాత సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యంతో హీబీ అనే మహిళకు రూ.కోటి రూపాయలకు పైగా పెన్షన్ అందనుంది.
బెంజిమిన్, హీబీ బెంజిమిన్ లు భార్యాభర్తలు. బెంజిమిన్ భారత సైన్యంలో కల్నల్ గా పని చేశారు. ఆర్మీలో ఇంజినీరుగా సేవలందించిన బెంజిమిన్ 1966లో రిటైర్ అయ్యారు. ఆ తరువాత బెంజిమిన్ ఫ్యామిలీ ఇజ్రాయిల్ దేశంలో సెటిల్ అయ్యారు. మాజీ సైనికాధికారి అయిన బెంజిమిన్ బ్రతికి వున్నంత కాలం పెన్షన్ వచ్చింది. బెంజిమిన్ 1990లో అనారోగ్యంతో మరణించడంతో ఆ పెన్షన్ కాస్తా ఆగిపోయింది. దీంతో హీబీకి ఆర్థిక కష్టాలు వెన్నంటాయి. ఇతర ఆదాయాలేవీ లేకపోవటంతో హీబీ పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఫ్యామిలీ ఫ్రెండ్ భారతదేశ రక్షణ మంత్రిత్వశాఖకు ఎన్నో లెటర్స్ రాశారు. అయినా రక్షణ మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.
చివరికి హీబీ పెన్షన్ విషయంలో భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని 1998లో డిఫెన్స్ అకౌంట్స్ ప్రిన్సిపల్ కంట్రోలరు హీబీకి లేఖ రాశారు. ఆ లేఖతో హీబీ బెంజిమిన్..ఆమె కుమార్తెలు ఇజ్రాయిల్ లోని భారత రాయబారిని 2018 జులై 24న పెన్షన్ ఇప్పించాలని కోరారు. అనంతరం తమకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ హీబీ దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్య సైనికాధికారి బిపిన్ రావత్ లకు లేఖలు రాశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యంతో 30 ఏళ్ల తర్వాత 94 ఏళ్ల హీబీకి పెన్షన్ ఇవ్వాలని రక్షణ రంగ అధికారులను ఆదేశించారు. దీంతో గత 30 ఏళ్లుగా హీబీ బెంజిమిన్ కు మొత్తం బకాయిలతో కలిపి రూ.75 లక్షల పెన్షన్ అందజేయాలని నిర్ణయించారు. పాత బకాయిలతోపాటు వడ్డీని లెక్కిస్తే హీబీకి కోటిరూపాయలకు పైగా పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. ప్రధాని మోదీ ఆదేశంతో హీబీకి జనవరి నెలాఖరులోగా పెన్షన్ బకాయిలతో అందజేయాలని డిఫెన్స్ అకౌంట్స్ విభాగం నిర్ణయించింది.