దేశంలోకి అక్రమంగా చొరబడిన 300మంది ఉగ్రవాదులు

  • Publish Date - October 7, 2019 / 04:15 AM IST

ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కశ్మీర్ మరియు జమ్మూ ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి భారత్ లోకి 300మంది ఉగ్రవాదులు అక్రమంగా చొరబడినట్లుగా జమ్మూ కాశ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. పాకిస్తాన్ సైనికులు దేశ సరిహద్దుల్లో పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపారని, ఇదే సమయంలో ఆ దేశంలో నుంచి ఉగ్రవాదులు అక్రమంగా మనదేశంలోకి చొరబడుతున్నారని  డీజీపీ చెప్పుకొచ్చారు.

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో భద్రతపై సమీక్షించేందుకు వచ్చిన డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. పాక్ సరిహద్దులైన కంచక్, ఆర్ఎస్ పుర, హీరానగర్, పూంచ్, రాజౌరి, ఉరి, నంబాల, కర్నాహ్, కేరన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పారు. కాల్పులు జరిగే సమయంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా వస్తున్నారని, పాకిస్తానే ప్లాన్ ప్రకారం పంపిస్తుందని డీజీపీ చెప్పారు. గుల్ మార్గ్ సెక్టారులో నాలుగు రోజులపాటు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు ఉగ్రవాదులు దొరికినట్లు డీజీపీ చెప్పారు.

సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో పాకిస్తాన్ నుంచి వచ్చిన కొందరు ఉగ్రవాదులు హతమయ్యారని డీజీపీ వివరించారు. మన దేశంలోకి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేస్తామని, వీలైనంత ఎక్కువ మంది ఉగ్రవాదులను వెనక్కి పంపడం, లేకుంటే మట్టుపెట్టడమే లక్ష్యంగా పని చేస్తామని డీజీపీ చెప్పారు. ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునేందుకు నియమించిన టీమ్ చాలా బలంగా ఉందని, అందువల్లే అనేకమంది చొరబాటును అడ్డుకున్నట్లు చెప్పారు. అయినా కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్డారని నివేదికలు వచ్చినట్లు డీజీపీ తెలిపారు.