Nitish
Toxic Liquor Death : బీహార్‌లో కల్తీ మద్యం మళ్లీ కలకలం రేపుతోంది. మందుబాబులను కల్తీమద్యం కాటేస్తోంది. మద్యపాన రహిత రాష్ట్రమైన బీహార్‌లో.. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కల్తీ మద్యం కాటుకు నిన్న ఒక్కరోజే.. 11 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33కి చేరింది. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. మరోవైపు చంపారన్, గోపాల్ గంజ్‌లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో.. రంగంలోకి దిగిన ప్రభుత్వం.. బిహార్‌లో కల్తీ మద్యం కేసులో విచారణకు ఆదేశించింది. మద్యంపై ప్రభుత్వం సీరియస్ అవడంతో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. 60 ప్రాంతాల్లో దాడులు చేసి.. మొత్తం కల్తీ మద్యం విక్రయిస్తున్న 19 మందిని అరెస్ట్ చేశారు. వందల లీటర్ల కల్తీ మద్యాన్ని గుర్తించారు.
Read More : Drugs : వరంగల్‌లో డ్రగ్స్, ఇద్దరు యువకుల అరెస్టు
మూడు రోజుల్లో మొత్తం.. 33 మందిని మద్యం రక్కసి పొట్టనపెట్టుకుంది. కల్తీ మద్యం కారణంగా వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో ఎనిమిది మంది మరణించగా.. గోపాల్‌గంజ్ జిల్లా కుషాహర్, మహ్మద్‌పూర్‌లో 16 మంది మృతి చెందారు. వీరంతా నకిలీ మద్యం తాగి ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తేల్చారు బీహార్ అధికారులు. మృతదేహాలకు పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరణాలకు గల కారణం తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మృతుల్లో దాదాపు చాలా మంది గిరిజనులే ఉన్నారు. స్థానికంగా తయారు చేసిన మద్యం సేవించిన తర్వాతే వీరు చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Read More : Exchange of Fire Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, మావోయిస్టు మృతి
అయితే.. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. మద్యం తాగడంతోనే వారంతా మరణించినట్లు బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. నితీష్ కుమార్ బీహార్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మద్యపాన నిషేధం విధించారు. అయినా.. అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. మద్యానికి బానిసైన ప్రజలు.. గ్రామాల్లో దొరికే కల్తీ మద్యానికి అలవాటుపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు బీహార్‌లో కొత్త కాకాపోగా.. ఈ ఏడాది నకిలీ మద్యం తాగి ఇప్పటివరకు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.