Gold : భారతదేశంలో ఇళ్లు, ఆలయాల్లో ఎంత బంగారం ఉందో తెలుసా..? వామ్మో.. వీటి విలువ ఎంతంటే..
Gold : ఇళ్లు, ఆలయాల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉన్నా.. మన ఆర్థిక అభివృద్ధికి సరిగా ఉపయోగించుకోలేకపోవడంపై మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
Gold
- భారతదేశంలో ఇళ్లు, ఆలయాల్లో భారీగా బంగారం
- దాని విలువ రూ.940 లక్షల కోట్లుపైమాటే
- దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దమొత్తంలో దిగుమతులపై భారం!
Gold : గత రెండేళ్లలో బంగారం ధర ప్రతీయేటా సగటున 30శాతం చొప్పున పెరిగింది. అయినా, దేశంలో పసిడి, నగలకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. మన దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో వేల టన్నుల బంగారం నిల్వలున్నాయి. అయితే, దీనివల్ల ప్రజల ఆస్తుల విలువ పెరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రం పెద్దమొత్తంలో దిగుమతుల భారం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫిజికల్ గోల్డ్‌ను డిమాట్ గోల్డ్‌గా మార్చడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జితిన్ మక్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారతదేశంలో ప్రస్తుతం 50వేల టన్నుల వరకు బంగారం ఉంటుందని పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘం సభ్యుడైన పీపీ చౌదరి అన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం దీని విలువ ఎంత లేదన్నా దాదాపు 10లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.940 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అసోచాం నిర్వహించిన ఒక సదస్సులో చెప్పారు.
ఇళ్లు, ఆలయాల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉన్నా.. మన ఆర్థిక అభివృద్ధికి సరిగా ఉపయోగించుకోలేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఫిజికల్ గోల్డ్ ను ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ గా (ఈజీఆర్) మార్చడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ అభిప్రాయపడ్డారు.
దేశంలోని ఆలయాలు, ఇళ్లలోని బంగారాన్ని ఆర్థికంగా సరిగా ఉపయోగించుకోగలిగితే పసిడి దిగుమతులు తగ్గడంతోపాటు, మూలధన ఖాతాలోటు (సీఏడీ) కూడా తగ్గుతుందని పీసీ చౌదరి చెప్పారు. శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ.. ఫిజికల్ గోల్డ్ ను అప్పగించి ఈజీఆర్ లు తీసుకున్న వ్యక్తులు, వాటిని ఎన్ఎస్ఈలో షేర్లలా అమ్మటం, కొనడం చేయవచ్చునని, అయితే, ఫిజికల్ గోల్డ్ ను ఈజీఆర్ లో మార్చేటప్పుడు మూడుశాతం జీఎస్టీగా చెల్లించాల్సి రావడంతో ప్రజలు, ఆలయాలు పెద్దగా ముందుకు రావడం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు.
