అమిత్ షా చెన్నై టూర్ లో అపశృతి

  • Published By: murthy ,Published On : November 21, 2020 / 08:08 PM IST
అమిత్ షా చెన్నై టూర్ లో అపశృతి

Updated On : November 21, 2020 / 9:04 PM IST

60 year old throws placard at Amit Shah in Chennai : కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం శనివారం చెన్నై చేరుకున్నారు. అమిత్ షా విమానాశ్రయం నుంచి బయటకు రాగానే చిన్న అపశృతి చోటు చేసుకుంది. మతి స్ధిమితం లేని ఒక వ్యక్తి అమిత్ షా పై ప్లే కార్డును విసిరేందుకు ప్రయత్నించగా  భద్రతా సిబ్బంది అది గమనించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

శనివారం చెన్నై విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి హోటల్‌కు బయలుదేరారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున బీజేపీ, అన్నాడీఎంకే కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ బయట వేచి ఉన్నారు. ఇది గమనించి అమిత్ షా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి, తన బుల్లెట్ ఫ్రూప్ కాన్వాయ్‌లో నుంచి దిగి కాలినడకన వెళ్తూ వారికి అభివాదం చేశారు.

దాదాపు ఐదు నిమిషాల పాటు ఆయన రోడ్డుపై నడిచి తన కోసం వేచి ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అయితే అమిత్ షా కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ 60 ఏళ్ల వృధ్దుడు అమిత్ షా గోబ్యాక్ అని రాసిన ప్లకార్డ్ ను ఆయనపైకి విసిరాడు. అయితే అది ఆయన వరకు చేరకుండా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను తరలించారు.ఆ వ్యక్తిని నంగనల్లూరుకు చెందిన దురైరాజ్‌గా గుర్తించారు. ప్లకార్డు విసిరిన వ్యక్తి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు తర్వాత వెల్లడించారు.