Independence Day 2024: 77 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేశం ముందున్న సవాళ్లేంటి?

ఒకప్పుడు గ్రామాల్లో కరెంటు లేని స్థాయి నుంచి ఇప్పుడు ప్రతి గ్రామంలో అన్ని వసతులున్నాయనే స్థాయికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చేరింది.

Independence Day 2024: 77 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేశం ముందున్న సవాళ్లేంటి?

స్వాతంత్ర్య దినోత్సవం.. ఇండిపెండెన్స్‌ డే.. పేరేదైనా.. ఇప్పటి వాళ్లకు ఇది జస్ట్‌ ఒక పబ్లిక్‌ హాలిడే. ఒక రోజు స్కూల్లో, కార్యాలయంలో, పార్టీ ఆఫీసుల్లో జరుపుకునే సెలబ్రేషన్‌ . చాక్లెట్లు, కేకులు పంచి.. కల్చర్‌ యాక్టివిటీస్‌, స్పీచులతో హడావుడి చేయడం మామూలే. కానీ.. ఇండిపెండెన్స్‌ డే అసలు అర్థం అది కాదు. బానిస బతుకుల నుంచి విముక్తికోసం యావత్‌ దేశం చేసిన పోరాటం. విదేశీ వలస సామ్రాజ్యవాద శక్తులకు మా భూమిపై పెత్తనమేంటని ప్రశ్నించిన గళాల ఫలితం. 1947 ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మరి 77 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నాం..? దేశం ముందున్న సవాళ్లేంటి..? ఒకసారి రివైండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం..

భూమి మనది.. పెత్తనం పరాయి వాడిది. కష్టపడేది మనం.. దోచుకుని సుఖపడేది తెల్లవాడు. రాజ్యం మనదే కానీ.. దానిపై అజమాయిషీ అంతా బ్రిటిషర్లది. మాట్లాడే స్వేచ్ఛలేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, మన తిండి మనం తినే అధికారం లేదు.. మన బట్ట మనం కట్టుకునే అవకాశం లేదు. అలా వందల ఏళ్లు మగ్గి.. తిరగబడితే దక్కింది దేశానికి స్వాతంత్ర్యం. ఎందరో త్యాగధనులు అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం వచ్చింది.

సుమారు 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో భారతదేశం చాలా కోల్పోయింది. చరిత్రలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగిన భారత్.. వాస్తవంలో మాత్రం చాలా వెనుకబాటుకు గురైంది. ఇంకా ఆ వెనుకబాటు కొనసాగుతూనే ఉంది. బ్రిటీష్ సామ్రాజ్యాధినేతలు మనకు ఏమీ మిగిల్చింది లేదు. మన దేశాన్ని సర్వం దోచుకున్నారు. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అయినప్పటికీ మనవాళ్లు ఏమాత్రం కుంగిపోలేదు. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. మెట్టు మెట్టు ఎక్కుతూ.. ప్రపంచంలో అగ్ర దేశాల సరసన నిలిపారు.

వారి చెంప ఛెళ్లుమనేలా..
మీ దేశానికి రాజ్యాంగం కూడా లేదన్నవారి చెంప ఛెళ్లుమనేలా.. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి, వడపోసి.. ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. దాన్ని అంతే నిబద్ధతతో అమలు చేసుకుంటూ ప్రజాస్వామ్యానికి భారత్‌ పెట్టింది పేరనేలా ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచాం. స్వేచ్ఛ, సమానత్వపు హక్కులు భారతదేశంలో ఎక్కువ. ఎవరైనా తమ భావ ప్రకటన నిరభ్యంతరంగా చేయొచ్చు.

డబ్బున్నవారికే అందలమనే మాట లేదు. అధికారం ఏ ఒక్కరి వారసత్వ హక్కూ కాదు. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడే నాయకుడిని ఐదేళ్లు కుర్చీలో కూర్చోబెడతాం.. సమర్థవంతమైన పాలన చేయకుంటే నిక్కచ్చిగా కుర్చీనుంచి దించేస్తాం. కులం, మతం, జాతి భేదం లేదు. అందరికీ సమానమైన అవకాశాలుంటాయి.

77 ఏళ్లుగా.. పడుతూ లేస్తూనే.. విద్య, శాస్త్ర సాంకేతికత, వ్యవసాయం, పారిశ్రామికం, వైద్యం, మౌలిక వసతుల కల్పన, రక్షణ, సేవలు, పరిపాలన ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ వస్తున్నాం. అయినా ఇంకా చాలా సాధించాల్సింది ఉంది. ప్రతి రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్‌.. తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందడుగు వేస్తోంది.

1947 ఆగస్ట్‌ 15న బ్రిటీష్‌ వారి చెరనుంచి భారతావని విముక్తమైంది. స్వాతంత్ర్యం సిద్ధించిందే కానీ.. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. అనే సందిగ్ధ వాతావరణమే కొన్నేళ్లపాటు సాగింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినా.. దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులు మళ్లీ మొదటి అడుగు నుంచి వేయాల్సిన పరిస్థితి. సంపద లేదు, వనరులు దోపిడీకి గురయ్యాయి. సామాజికంగా లింగ, వర్ణ అసమానత్వమే రాజ్యమేలుతూ వచ్చింది. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతింది.

ఆహారం కొరత, ఆకలి కేకలు.. దీనికి తోడు పెరుగుతున్న జనాభా.. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో హరితవిప్లవాన్ని 1967లో తీసుకొచ్చారు. కొత్త రకం వ్యవసాయ విధానంతో మార్పులకు శ్రీకారం చుట్టారు. అలా ఒక్కో రంగాన్ని రిపేరు చేసుకుంటూ వెళ్లడం మినహా చేయగలిగినది ఇంకేం లేదనే పరిస్థితి. దాని ఫలితమే ఇవాళ బియ్యం, గోధుమలు, చెరకు , పప్పు ధాన్యాల ఉత్పత్తి, ఎగుమతిలో దేశం ముందు వరసలో ఉంది. ఇది ఏ ఒక్కరి కష్టమో కాదు.. మన రైతన్న చెమటోడ్చి చేసిన కష్టం.. ఆనాటి పాలకులు అందించిన వెన్నుదన్ను.

నిరక్షరాస్యత, లంచగొండితనం
స్వాతంత్ర్యం తర్వాత దేశం ఆర్థికంగా చితికిపోయింది. శతాబ్దాల తెల్ల దొరల పాలన ఫలితంగా నిరక్షరాస్యత, లంచగొండితనం, పేదరికం, లింగ వివక్ష, అంటరానితనం, కుల మత వర్గ భేదాలు.. ఇలా ఎటు చూసినా సందిగ్ధకాలమే రాజ్యమేలింది. 1947లో దేశ జీడీపీ 2.7 లక్షల కోట్లు . ఇది ప్రపంచ జీడిపీలో కేవలం 3 శాతం మాత్రమే. కానీ 1965 హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, పారిశ్రామిక రంగంలో తెచ్చిన ప్రగతి కారణంగా 1978-1979 మధ్య రికార్డు స్థాయిలో 131 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అలా వ్యవసాయాధారిత దేశమైన భారత్‌ వైపు ఇతర దేశాలు చూడటం మొదలు పెట్టాయి.

ఎం. ఎస్‌. స్వామినాథన్‌ లాంటి శాస్త్రవేత్తల కృషి, గ్రీన్‌ రెవల్యూషన్‌ రాకుంటే దేశం మరో వందేళ్ళు వెనక్కి వెళ్లుండేదేమో.. హరిత విప్లవ ఫలితాలు అన్ని రంగాలపైనా పడ్డాయి. పరిశ్రమలు, పవర్‌ ప్లాంట్‌లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవడంతో ఒక దేశం ముందు మనం చేతులు చాచి అడుక్కునే పరిస్థితులు లేకుండా గడ్డున పడ్డాం.

ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి. ఇప్పుడు దేశ జీడీపీ 7.3 శాతంగా 173 లక్షల కోట్లు. 8 శాతం గ్లోబల్‌ జీడీపీ షేర్‌తో పరుగులు పెడుతోంది. గత పది, పదిహేనేళ్లలో పరిశ్రమలు చాలా వేగంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా స్టార్టప్‌లు వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు చేరుకున్నాయంటే.. ప్రపంచంతో మనం పడుతున్న పోటీని అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగాన్ని ఎంతోకొంత తగ్గించడంలో ఇది కీలకమైంది.

అయితే ప్రస్తుతం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు తగినంత ప్రోత్సాహం ప్రభుత్వం ఇవ్వడం లేదనే వాదనలున్నాయి. దేశంలో ఏటా సేద్యం చేసే రైతుల సంఖ్య తగ్గిపోవడం, వ్యవసాయ భూమి తగ్గుతుండటం కూడా భవిష్యత్‌లో ఆహార సంక్షోభానికి ముందస్తు హెచ్చరికలుగా ప్రభుత్వాలు భావించాల్సి ఉంటుంది. రైతన్నల ఆత్మహత్యలు, సేద్యానికి ప్రోత్సాహాలు, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై మరింత దృష్టి పెడితేనే ప్రధాన ఆర్థిక ఆదాయ వనరుగా ఉన్న సేద్యం ఇంకొన్నాళ్లు మనుగడ సాగిస్తుందనేది మేధావులు, నిపుణులు చెబుతున్నమాట.

బ్రిటిష్‌ వాళ్లు మన దేశాన్ని వదిలి వెళ్లినప్పుడు.. అఖండ భారతావని ముక్కలుగా ఉంది. అభివృద్ధి లేదు.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. దీంతో సాంకేతికత అనేది లేకపోతే దేశమనుగడ ప్రశ్నార్థకమవుతుందని నాటి పాలకులు భావించారు. మొదట్లో విదేశీ సంస్థల సహకారంతో అటు రక్షణ రంగాన్ని, ఇటు శాస్త్ర సాంకేతిక రంగాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తిగల దేశాల్లో ముందున్నాం. ఆకాశమే హద్దుగా.. చంద్రునిపైకి మన సొంత కష్టంతో రాకెట్లను పంపే స్థాయికి చేరుకున్నాం.

స్వాతంత్య్రానంతరం, చరిత్ర పునరావృతం కాకుండా భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ విడిపోయాయి. దేశంలో విచ్ఛిన్నమైన రాజ్యాలన్నీ కలిశాయి. మన పాలకులు అప్పట్నుంచే రక్షణరంగంపై దృష్టి పెంచారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచీ కూడా దేశంలో సైనిక వ్యవస్థ ఉంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీగా.. ఆ తర్వాత నేషనల్‌ ఆర్మీ ఆఫ్ ఇండియాగా మారింది. 1949 తర్వాత బ్రిటిష్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ బుచెర్‌ నుంచి సైనిక శక్తి బదిలీ అయ్యింది. అలా ఇండియన్‌ ఆర్మీ రూపాంతరం చెందింది. ఇప్పుడు 14లక్షల మంది త్రివిధ దళాల్లో దేశం కోసం సేవ చేస్తున్నారు.
అభివృద్ధి పథాన
భారత రక్షణ వ్యవస్థ  1947 తర్వాత మెల్లగా బలోపేతమైంది. ఆ వెంటనే 1954లో అటామిక్‌ ఎనర్జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది భారత్‌. 1974లో మొదటి అణు పరీక్ష స్మైలింగ్‌ బుద్ధను నిర్వహించింది. ఐదు అణుశక్తి దేశాల జాబితాలో చేరింది. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తిని కలిగిఉన్న దేశం. 1965, 1971లో భారత్‌ పాక్‌ యుద్ధాలు జరిగాయి. 1999లో కార్గిల్‌ యుద్ధం జరిగింది. 1962లో సరిహద్దుల్లో చైనా దురాక్రమణల్ని తిప్పి కొడుతూ భారత సైన్యం పోరాడింది.

ఇండియన్‌ ఆర్మీ అంటే కేవలం యుద్ధాలే కాదు.. దేశంలో అశాంతి , విపత్తులను ఎదుర్కోవడం లోనూ ముందుంటుంది. అంతెందుకు దేశంలో రీసెంట్‌గా కేరళ వయనాడ్‌ లాంటి ప్రకృతి విపత్తులో కూడా సమర్థవంతంగా సహాయకచర్యలు అందించగలిగామంటే.. అది మన త్రివిధ దళాల పుణ్యమే. తమ శక్తియుక్తులన్నీ పెట్టి దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు సైనికులు. వారికి ఎన్నిసార్లు సెల్యూట్‌ చేసిన తక్కువే.

దేశంలో ఆర్మీ తర్వాత రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాలపై 1947 తొలినాళ్ల నుంచే దృష్టి పెట్టారు. అందుకే ఐఐటీ, ఐఐఎస్‌సీ లాంటి ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలను 1950లోనే స్థాపించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను 1969 ఆగస్టు 15న స్థాపించారు. ఇది భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. 1975లో భారతదేశం తన మొదటి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది.

నాటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాకేష్ శర్మ 1986లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ స్వదేశీ సాంకేతికత ఆధారిత ప్రయోగ వాహనాలు తయారు చేస్తున్నారు. 2008లో, భారతదేశం PSLV-C9 ద్వారా ఒకే మిషన్‌లో 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది.

మంగళయాన్ ప్రాజెక్ట్‌తో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రునిపైకి చంద్రయాన్ వంటి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. గతేడాది చంద్రయాన్‌-3తో.. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై అడుగు పెట్టి ప్రపంచ దేశాలకు మన పరిశోధనారంగం శక్తి సామర్థ్యాలను తెలియజేసింది. చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతమైన వెంటనే ఆదిత్య ఎల్‌1 ద్వారా సూర్యునిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది ఇస్రో. మన రాకెట్ల ద్వారా విదేశీ ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపి.. వాణిజ్యపరంగానూ బలోపేతం అవుతున్న దశలో ఉన్నాం. అమెరికా, రష్యా, చైనా, జపాన్‌తో పోల్చితే సాంకేతిక రంగంలో చాలా ఆలస్యంగా పురోగతి సాధించాం. కానీ.. ఎక్కడా ఆగిపోలేదు. ఆకాశమే హద్దుగా సాగుతున్నాం.

మౌలిక వసతుల కల్పన అనేది ప్రభుత్వాలు, విధాన నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో మౌలిక వసతుల అభివృద్ధితో పోల్చితే గత ఇరవై ఏళ్లలోనే వేగం మరింత పుంజుకుందనే చెప్పాలి. ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యి తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు గ్యాస్‌, ఎలక్ట్రిక్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. త్రాగునీరు, రోడ్లు, రవాణా, వసతులు కూడా చాలావరకు గతంతో పోల్చితే చెప్పలేనంత మార్పులొచ్చాయి.

ఒకప్పుడు గ్రామాల్లో కరెంటు లేని స్థాయి నుంచి ఇప్పుడు ప్రతి గ్రామంలో అన్ని వసతులున్నాయనే స్థాయికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చేరింది. మరి మారుమూల గ్రామాల్లో సంగతేంటి అనొచ్చు. ఇంకా కొన్ని గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్తు, వైద్య సదుపాయాల కొరత వేధిస్తోంది కదా అనే సందేహాలు వ్యక్తం కావొచ్చు. నిజమే.. కానీ ఒకప్పటి దుర్భరమైన పరిస్థితులు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపై ఫోకస్‌ పెంచాయి. గ్రామాలకు రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతలుకు సంబంధించి పలు పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. అలా గ్రామీణ జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. పేదరికంతో పాటు ఆర్థిక అసమానతల్ని తొలగించే చర్యల్ని మన పాలకులు, ప్రభుత్వాలు చేపట్టడంతోనే ఈ ప్రగతి సాధ్యమైంది.