Vinesh Phogat : కోట్లాది మంది భారతీయులకు నిరాశ.. వినేశ్ ఫోగట్ పిటిషన్ కొట్టివేత..
ఆశలు అడియాశలు అయ్యాయి. వినేశ్ ఫోగట్ రజత పతకం వస్తుందేమోనని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురుచూడగా వారికి నిరాశే మిగిలింది.

Vinesh Phogats Olympic appeal dismissed PT Usha shocked and disappointed
Vinesh Phogat – Paris Olympics : ఆశలు అడియాశలు అయ్యాయి. వినేశ్ ఫోగట్ రజత పతకం వస్తుందేమోనని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురుచూడగా వారికి నిరాశే మిగిలింది. వాయిదా పడుతూ వచ్చిన తీర్పు వినేశ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. సంయుక్తంగా రజతం ఇవ్వాలని వినేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్). ఆగస్టు 7న వినేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల విభాగంలో అసాధారణ విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది వినేశ్ ఫోగట్. ఫైనల్ బౌట్‌కు కొన్ని గంటల ముందు బరువు చూసే సమయానికి ఆమె నిర్ణీత బరువు కన్నా 100 గ్రాముల అధిక బరువు ఉంది. దీంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీన్ని వినేశ్ సవాల్ చేసింది. ఉమ్మడిగా రజతం ఇవ్వాలని సీఏఎస్‌ను ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను విచారించిన సీఏఎస్.. తీర్పును పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.
ఆగస్టు 16లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పింది. ఆఖరికి బుధవారం రాత్రి తన తీర్పును వెలువరించింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఇక తన పై అనర్హత వేటు పడడంతో వినేశ్ ఇప్పటికే రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పింది. చెప్పిన సంగతి తెలిసిందే
పీటీ ఉష నిరాశ..
యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా వినేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కొట్టేయడం దిగ్భ్రాంతిని, నిరాశను కలిగించినట్లుగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వినేశ్‌పై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఇలాంటి నిబంధనలపై ప్రశ్నలకు కారణమైంది.
అథ్లెట్లు.. ముఖ్యంగా మహిళా అథ్లెట్ల మానసిక, శారీరక ఒత్తిడిని పరిగణలోకి తీసుకోవడంలో సీఏఎస్ విఫలమైందని చెప్పింది. వినేశ్ తమ మద్దతు కొనసాగుతుందని చెప్పింది. న్యాయపరంగా ఇంకా ఏమైనా అవకాశాలు ఉన్నాయో లేవో అని పరిశీలిస్తామని చెప్పింది.