Delhi Assembly Election 2025: అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే పూజారులకు నెలకు రూ.18 వేల చొప్పున ఇస్తాం: కేజ్రీవాల్ హామీ

తాము అమలు చేస్తున్న పథకాల వంటి వాటిని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ అమలు చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

Arvind Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే మందిరాల పూజారులకు, గురుద్వారాల గ్రాంథీలకు నెలకు రూ.18 వేల చొప్పున ఇస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ‘పూజారీ గ్రాంథీ సమ్మాన్ యోజన’ను ప్రారంభిస్తామని ప్రకటించారు.

పూజారులు, గ్రాంథీలు సమాజంలో అంతర్భాగంగా ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వారు నిస్వార్థంగా తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్నారని చెప్పారు. వారి చేస్తున్న సేవలకు ఈ పథకం ద్వారా గౌరవించుకుందామన్నారు. ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ పథక రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభాన్ని పర్యవేక్షించేందుకు మంగళవారం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ మందిర్‌ను కేజ్రీవాల్ సందర్శించనున్నారు. పూజారులు ఎలా సేవ చేస్తారో అందరికీ తెలుసని చెప్పారు. మన పిల్లవాడి పుట్టినరోజైనా, మనకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోయినా పూజారులను సంప్రదిస్తామని తెలిపారు.

ఢిల్లీలో తాము ఎన్నో కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించామని ఆయన చెప్పారు. బడులు, ఆసుపత్రులను అభివృద్ధి చేశామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని అన్నారు. వీటిని చూసి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నేర్చుకుంటాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ అమలు చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

Pawan Kalyan: రేషన్ బియ్యం కేసు.. పేర్ని నాని వ్యవహారంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు