Banke Bihari Temple Treasury: ఇప్పుడు అందరి దృష్టి అటువైపే ఉంది. దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. మరో గుడి ఖజానా తెరుచుకోనుంది. ఆ గుడి ఖజనాలో ఏముంది? అనేది ఉత్కంఠగా మారింది. ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్న ఆ గుడే మధురలోని బృందావన్‌లో ఉన్న బంకే బిహారీ ఆలయం. ఈ టెంపుల్ ఖజానా 54 సంవత్సరాల తర్వాత తెరుచుకోనుంది.
బంకే బిహారీజీ గర్భగుడి కింద ఉన్న ఖజానా చివరిసారిగా 1971లో అందుబాటులోకి వచ్చింది. అప్పుడు భద్రత నిమిత్తం విలువైన ఆభరణాలను బ్యాంకుకి తరలించారు. నివేదికల ప్రకారం.. ఈ నిధిలో అరుదైన కళాఖండాలు ఉన్నాయి. వాటిలో పచ్చలతో చేసిన నెమలి హారము, సహస్ర ఫణి, వెండి శేషనాగము, బంగారు కలశంలో నవరత్నాలు ఉన్నాయి. గురువారం ఆలయ కమిటీ సమావేశం జరిగింది. గుడి ఖజానా తెరవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆలయ నిర్వహణ సభ్యులు, సివిల్ జడ్జిలు, ఆడిటర్లు, పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ వీడియోగ్రాఫ్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.
చరిత్రకారుల ప్రకారం 1864లో నిర్మించబడిన ఈ ఖజానా వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఈ ఖజానాలో భరత్‌పూర్, కరౌలి గ్వాలియర్ రాజ్యాల నుండి వచ్చిన కానుకలు, అలాగే సీలు వేసిన పత్రాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు, భూమి పత్రాలు, దానం చేసిన భవనాలు, దేవాలయాలు, భూములు ఉన్నాయి.
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఖజానా చివరిసారిగా 1971లో అప్పటి ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్యారేలాల్ గోయల్ పర్యవేక్షణలో తెరవబడింది. ఆ తర్వాత ట్రెజరీ నుండి తీసిన ఆభరణాలను ఒక పెట్టెలో ఉంచారు. దానికి సీలు వేశారు. మధురలోని భూతేశ్వర్‌లోని స్టేట్ బ్యాంక్ లాకర్‌లో దాన్ని భద్రపరిచారు. దీనికి సంబంధించి కమిటీ సభ్యులందరికీ ఇన్వెంటరీ అందించారు. అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కాపలా ఉంచినప్పటికీ, బంకే బిహారీ ఆలయ ఖజానాలో దొంగతనాలు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. బ్రిటీష్ పాలకుల సమయంలో 1926లో ఒకసారి, 1936లో మరొకసారి ఇందులో దోపిడీ జరిగింది.
దొంగతనాల ఘటనలతో అలర్ట్ అయ్యారు. ప్రధాన నేలమాళిగ తలుపును మూసివేశారు. నైవేద్యాల కోసం ఒక చిన్న కిటికీ మాత్రమే మిగిలిపోయింది. 2002లో ఒకసారి, 2004లో రెండోసారి ఖజానాను తెరవడానికి ప్రయత్నించారు. అయితే, అధికారిక అనుమతులు లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఖజానాకు రక్షణ పెంచేందుకు శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని లేదా రిటైర్డ్ సైనికులను నియమించుకునే ప్రణాళికలు ఉన్నాయి.
Also Read: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుల నెత్తిన పిడుగు.. ఈ తేదీ నుంచి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ బంద్..!