Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు ఇంకో సమస్య వచ్చింది. ఏ మృతదేహం ఎవరిది? అనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. డీఎన్ఏ టెస్టుల్లో ఓ పెద్ద అడ్డంకి ఏర్పడిందని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ హెచ్ పీ సంఘ్వీ తెలిపారు. ప్రమాద సమయంలో ఏర్పడిన భీకర మంటల కారణంగా మృతులను గుర్తించడం చాలా కష్టం అవుతోందన్నారు. మంటల తీవ్రత కారణంగా శరీరంలో ఉన్న డీఎన్‌ఏపై కూడా ప్రభావం పడిందన్నారు.
పోస్టుమార్టం సమయంలో శరీరంలోని కుడి భాగం అవసరం అన్న సంఘ్వీ, డీఎన్‌ఏ సేకరణ కోసం మృతదేహంలోనూ కుడి భాగాన్ని గుర్తించి నమూనాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. అన్ని డీఎన్‌ఏ నమూనాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) కు అప్పగించామన్నారు. ఒక్క డీఎన్‌ఏ పరీక్ష పూర్తయ్యేందుకు 36 నుంచి 48 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.
ప్రొఫైల్ మ్యాచ్ ప్రక్రియ మొదలైందని, కొన్ని ఫలితాలు మొదటగా వస్తాయని వివరించారు. మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మొత్తం 36 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఈ పనిలో పాల్గొన్నారని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ సంఘ్వీ తెలిపారు.
ఈ నెల 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రమే బతికారు. ఇక విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో 33 మంది మెడికోలు సైతం మరణించారు.
విమాన ప్రమాద వార్త వినగానే అహ్మదాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘోర ప్రమాదంలో అపారమైన ప్రాణనష్టానికి కారణాన్ని కూడా వివరించారు. విమానంలో దాదాపు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, ఉష్ణోగ్రతలు పెరిగాయని, ప్రాణాలను కాపాడే అవకాశం లేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా 787 ఘోర ప్రమాదం తర్వాత ఎనిమిది బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను ఇప్పటికే తనిఖీ చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు తెలిపారు. భారత విమానాల సముదాయంలో ప్రస్తుతం పనిచేస్తున్న 34 డ్రీమ్‌లైనర్ విమానాలన్నింటినీ సమగ్రంగా పర్యవేక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
“DCGA నుండి 787 విమానాలకు విస్తృత నిఘా చేయాలని ఒక ఉత్తర్వు కూడా ఇచ్చాము. భారతీయ విమానాల సముదాయంలో 34 ఉన్నాయి. ఎనిమిదింటిని ఇప్పటికే తనిఖీ చేశాం. తక్షణ అత్యవసర పరిస్థితిలో అవన్నీ పూర్తి చేయబోతున్నామని నేను నమ్ముతున్నాను” అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.