Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఎందరో జీవితాల్లో తీరని విషాదం నింపింది. క్షణాల్లో అంతా మంటల్లో కాలిపోయారు. విమానంలో ఉన్న 242 మందిలో(ప్రయాణికులు, సిబ్బంది) ఒక్కరు తప్ప అంతా మరణించారు. విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగింది? పైలట్ చివరి మేసేజ్ ఏంటి? అనేది బహిర్గతమైంది. ”కమ్యూనికేషన్ చాలా వీక్ గా ఉంది. థ్రస్ట్ నాట్ అచీవ్డ్, పడిపోతున్నాం.. అని పైలట్ అన్నట్లుగా ఏటీసీ తెలిపింది.
జూన్ 12 అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా బోయింగ్ విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలోని వారంతా మంటల్లో కాలిపోయారు. ఈ విమాన ప్రమాదంపై మరింత లోతుగా దర్యాఫ్తు జరుగుతోంది. విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.
గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 క్షణాల వ్యవధిలో కూలిపోయింది. విమానంలో ఏదో తప్పు జరిగిందని ఎయిర్ ఇండియా పైలట్ ATCకి పంపిన సందేశం సూచిస్తుంది.
Also Read: 11A సీటు.. 27ఏళ్ల క్రితమే అద్భుతం.. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నటుడు ఇతడే..
అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళుతున్న బోయింగ్ విమానంలో 242 మంది ఉన్నారు. వారిలో 12మంది సిబ్బంది ఉన్నారు. (ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది). వారిలో 241 మంది మరణించారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతను గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎయిర్ ఇండియా విమానం, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఈ ప్రమాదానికి గురైంది. 2011లో వాణిజ్యపరంగా అరంగేట్రం చేసిన తర్వాత 787 ప్రమాదంలో ఇది మొదటి ప్రాణాంతక ప్రమాదం. ఈ విషాదం ఇప్పటివరకు 270 మంది ప్రాణాలను బలిగొంది. విమాన ప్రమాదాలు, సంఘటనలను పరిశోధించే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), విషాదం జరిగిన 28 గంటల తర్వాత ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానం తోక దగ్గర ఉన్న నారింజ రంగు పరికరం ప్రమాదంపై దర్యాప్తు చేయడంలో సహాయపడుతుంది. ఈ ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8/9 అన్ని విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టారు.